Year Ender 2021: ఈ ఏడాది యాపిల్‌ఆవిష్కరణలు ఇవే..!

ఈ సంవత్సరం యాపిల్‌ సంస్థ కొన్ని అదిరిపోయే కొత్త ఆవిష్కరణలు చేసింది. స్మార్ట్‌ఫోన్లే కాకుండా వినియోగదారుడి అవసరానికి తగ్గట్టు కొన్ని ఇతర ప్రొడక్ట్స్‌ను తీసుకొచ్చింది.

Updated : 29 Dec 2021 11:23 IST

టెక్‌ దిగ్గజం యాపిల్ సంస్థ తయారుచేసిన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ కంపెనీ నుంచి ఏ ప్రొడక్ట్‌ మార్కెట్లోకి విడుదలైనా అమ్మకాలు జోరందుకుంటాయి. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం యాపిల్‌ సంస్థ కొన్ని అదిరిపోయే ఆవిష్కరణలు చేసింది. స్మార్ట్‌ఫోన్లే కాకుండా వినియోగదారుడి అవసరానికి తగ్గట్టు కొన్ని ఇతర ప్రొడక్ట్స్‌నూ తీసుకొచ్చింది. మరి 2021లో యాపిల్‌ ఆవిష్కరించిన ప్రొడక్ట్స్‌ ఏంటి? వాటి ఫీచర్లు, డిజైన్ల వివరాలు తెలుసుకుందామా..


ఐఫోన్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు..

అప్పటికే విడుదలైన ఐఫోన్ 12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్న తరుణంలో యాపిల్‌ సరికొత్త 5జీ ఐఫోన్‌ 13 సిరీస్‌ను ఆవిష్కరించింది. కొత్తగా గులాబీ రంగులోనూ వీటిని తీసుకొచ్చింది. కెమేరా లెన్స్‌లను ఐ మూలగా ఏర్పాటు చేసి ఫోన్‌ వెనక భాగానికి కొత్త రూపు తెచ్చింది. ఫోన్‌ కెమెరాలో కొత్తగా సినిమాటిక్‌ మోడ్‌ ఉంది. డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌లో షూట్‌ చేయవచ్చు. మ్యాగ్‌సేఫ్‌ ఛార్జింగ్‌నూ ఇవి సపోర్ట్‌ చేస్తాయి. ఐఫోన్‌ 13 సిరీస్‌లో ఐఫోన్‌ 13 మినీ; ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మాక్స్‌లను అందుబాటులోకి తెచ్చింది.


యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7..

యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7ను 2021లోనే సంస్థ ఆవిష్కరించింది. వీటి డిస్‌ప్లేను పూర్తిగా మార్చేసి కొత్తగా డిజైన్‌ చేసింది. సిరీస్‌ 6 కంటే 20 శాతం పెద్దగా ఉండేలా డిస్‌ప్లేను రూపొందించారు. తెర పెద్దగా ఉండటం వల్ల డిస్‌ప్లే మీద కీబోర్డు పూర్తి స్థాయిలో ఉంటూ.. టెక్ట్స్‌ను టైప్‌ చేయడానికి సులువుగా ఉంటుంది. 


మ్యాగ్‌సేఫ్‌ బ్యాటరీ ప్యాక్‌..

ఐఫోన్‌ 12 వాడే యూజర్స్ కోసం యాపిల్ మ్యాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్‌ అనే కొత్త యాక్ససరీని 2021లోనే తీసుకొచ్చింది. దీంతో యూజర్స్ తమ ఫోన్‌ బ్యాటరీని ఎప్పుడైనా, ఎక్కడైనా ఛార్జ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ ప్యాక్‌ అయస్కాంతం సాయంతో ఐఫోన్ 12 ఫోన్లకు వెనకవైపు అతికించవచ్చు. తర్వాత ఇందులోని వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ ఫోన్‌ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇది ఫోన్‌కు 5వాట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. మ్యాగ్‌సేఫ్‌లో 1,469ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.


యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ 3

యాపిల్‌ కొత్తగా ఈ ఏడాది ఎయిర్‌పాడ్స్‌ 3 మోడల్‌ను విడుదల చేసింది. వీటిలో సౌండ్, డిజైన్ పరంగా కీలక మార్పులు చేసింది. అలానే సిలికాన్ ఇయర్‌స్ట్రిప్స్ లేకుండానే వీటిని తయారుచేసింది. నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ గతంలో విడుదల చేసిన ఎయిర్‌పాడ్ ప్రో, ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌ మోడల్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఇవ్వలేదు. 


ఐప్యాడ్‌ ప్రో, ఎం1 ఐమ్యాక్‌, మ్యాక్‌ బుక్‌ ప్రో..

యాపిల్ ఈ ఏడాదే కొత్త మోడల్‌ ఐప్యాడ్‌ ప్రో, ఎం1 ఐమ్యాక్‌ కంప్యూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది.  ఐప్యాడ్‌లో రెండు మోడళ్లను తీసుకొచ్చింది. లిక్విడ్ రెటినా ఎక్స్‌డీఆర్‌ (XDR) డిస్‌ప్లేతో  11-12.9-అంగుళాల ఐప్యాడ్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్త మ్యాక్‌బుక్‌ ల్యాప్‌టాప్‌ 24 అంగుళాలతో 4.5కే రెటీనా డిస్‌ప్లే, 1080పిక్సల్‌ హెచ్‌డీ వెబ్‌ కామ్‌, ఆరు స్పీకర్లతో సౌండ్‌ సిస్టమ్‌ చూడగానే ఆకట్టుకునేలా రూపొందించింది. ఐప్యాడ్‌ ప్రోలో మ్యాగ్నటిక్‌సేఫ్‌ ఛార్జర్, ఎస్‌డీ కార్డ్ స్లాట్, థండర్ బోల్ట్, హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు ఉన్నాయి. యాపిల్‌ కంప్యూటర్లను సరికొత్త హార్డ్‌వేర్‌తో 14 - 16 అంగుళాలతో రెండు మ్యాక్‌ బుక్‌ ప్రో మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇంతకుముందు వరకు ఇంటెల్‌ ప్రాసెసర్‌తో కూడిన టచ్‌ బార్‌, బట్టర్‌ప్లై కీబోర్డు మాత్రమే ఉండేది. కానీ, ఈ ఏడాది ప్రారంభంలో ఇంటెల్‌కు బదులుగా ఎం1 - ఆధారిత చిప్‌సెట్‌ను ఉపయోగించి కొత్తరకం మోడల్స్‌ను తీసుకొచ్చింది.  గత 15 ఏళ్లుగా ఇంటెల్ ఎక్స్ 86 ప్రాసెసర్‌ను ఉపయోగించగా.. ఆపిల్ కొత్త ప్రాసెసర్‌కు ఆపిల్ ఎం1 అని పేరు పెట్టింది.


ఎయిర్‌ ట్యాగ్స్‌

ఎక్కడైనా వస్తువులు మరిచిపోతే సులభంగా వెతుక్కోవడానికి ట్రాకర్‌గా ఎయిర్‌ ట్యాగ్స్‌నూ యాపిల్‌ ఈ ఏడాది తీసుకొచ్చింది. ఫైండ్‌ మై యాప్‌ సహాయంతో ‘కీ’లు వ్యాలెట్ల వంటి పరికరాలను గుర్తించడానికి ఇవి పనిచేస్తాయి.


యాపిల్‌ టీవీ 4కే

యాపిల్‌ ఈ ఏడాది టీవీ4కే ఫైర్‌ స్టిక్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో యూజర్లు 4కే హెచ్‌డీఆర్‌ రిజల్యూషన్ వీడియోలను ఆస్వాదించేలా దీన్ని రూపొందించింది.  ఇది చిన్న  బాక్స్‌ రూపకంగా సిరి ఎనేబుల్‌ రిమోట్‌ సహాయంతో ఆపరేట్ చేసేలా ఉంటుంది. కొత్త రిమోట్‌ డిజైన్‌లో మార్పులు చేసింది. క్లిక్‌ప్యాడ్ స్థానంలో ఐదు విధాలుగా నావిగేట్‌ చేసుకునేలా టచ్‌ప్యాడ్‌ను తీసుకొచ్చింది.

ఇవేకాకుండా యాపిల్‌ సంస్థ తమ వినియోగదారుల కోసం యాపిల్‌ వస్తువులను శుభ్రం చేయడానికి ప్రత్యేకమైన యాపిల్‌ పాలిషింగ్‌ క్లాత్‌ను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ స్పీకర్‌ పేరిట కొత్త హోమ్‌పాడ్‌ మినీని ఈ ఏడాదే ఆవిష్కరించింది.

- ఇంటర్‌నెట్‌ డెస్క్‌

► Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని