GBoard: జీబోర్డు మాయ

ఆండ్రాయిడ్‌ ఫోన్లయినా, ఐఓఎస్‌ ఫోన్లయినా ఎక్కువమంది గూగుల్‌ కీబోర్డు వాడుతుంటారు. తేలికగా టైప్‌ చేయటానికి, ఇతరత్రా అవసరాలకు వన్‌ హ్యాండెడ్‌ మోడ్‌ దగ్గరి నుంచి ప్రత్యేక ఎమోజీలు పంపటం వరకూ ఇందులో బోలెడన్ని ఫీచర్లున్నాయి. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.

Published : 29 May 2024 00:07 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్లయినా, ఐఓఎస్‌ ఫోన్లయినా ఎక్కువమంది గూగుల్‌ కీబోర్డు వాడుతుంటారు. తేలికగా టైప్‌ చేయటానికి, ఇతరత్రా అవసరాలకు వన్‌ హ్యాండెడ్‌ మోడ్‌ దగ్గరి నుంచి ప్రత్యేక ఎమోజీలు పంపటం వరకూ ఇందులో బోలెడన్ని ఫీచర్లున్నాయి. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.

ఒక చేత్తో టైప్‌

ఒక చేత్తో ఫోన్‌ పట్టుకుంటాం. మరో చేత్తో టిఫిన్‌ తినటమో, కాఫీ తాగటమో చేస్తుంటాం. ఇలాంటి సమయంలో ఎవరికైనా మెసేజ్‌ పంపాల్సి వస్తే? వన్‌ హ్యాండెడ్‌ మోడ్‌ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవాలంటే ముందుగా కామా గుర్తు మీద కాసేపు అదిమి పట్టి ఉంచాలి. పైకి తేలే మెనూ జాబితాలో స్వైప్‌ లెఫ్ట్, తర్వాత వన్‌ హ్యాండెడ్‌ మోడ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో కీబోర్డు చిన్నగా అవుతుంది. ఒక చేత్తోనే టైపింగ్‌ సాధ్యమవుతుంది. కీబోర్డును మళ్లీ నార్మల్‌కు తేవాలంటే నాలుగు బాణాల గుర్తు మీద ట్యాప్‌ చేయాలి.

నచ్చిన ఎమోజీలు

భావ ప్రకటనకు సరైన ఎమోజీలు కనిపించనప్పుడు ఎమోజీ కిచెన్‌ సాయం తీసుకోవచ్చు. ఇది రెండు ఎమోజీలను కలిపి కొత్త స్టికర్‌ను తయారు చేస్తుంది. దీన్ని వాడుకోవాలంటే యాప్‌ సెటింగ్స్‌లో ‘ఎమోజీస్, స్టికర్స్, గిఫ్స్‌’ విభాగంలో ఎమోజీ స్టికర్స్‌ ఆన్‌ చేసుకొని ఉండాలి. తర్వాత ఏవైనా రెండు ఎమోజీలను ఎంచుకుంటే చాలు. జీబోర్డు వాటిని కలిపి కొత్త స్టికర్‌గా రూపొందిస్తుంది.

ప్రత్యక్ష అనువాదం

మనం టైప్‌ చేసే భాష అవతలివారికి అర్థం కానప్పుడు ప్రత్యక్ష అనువాదం ఫీచర్‌ను వాడుకోవచ్చు. కీబోర్డు పైవరుసలో గేర్‌ గుర్తు పక్కనుండే అనువాదం ఆప్షన్‌ మీద తాకాలి. అక్కడి నుంచి ఏ భాషలోకి అనువాదం కావాలో ఎంచుకోవాలి. దీంతో టైప్‌ చేస్తున్నప్పుడే మెసేజ్‌ నేరుగా అనువాదమవుతుంది. గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

తేలే కీబోర్డు

ట్యాబ్లెట్ల వంటి పెద్ద పరికరాలు వాడుతున్నప్పుడు టైప్‌ చేయటం కాస్త కష్టంగా అనిపిస్తుంది. చేతులతో పరికరాన్ని పట్టుకొని అదే సమయంలో తెర మీద మీటలను నొక్కటం ఎవరికైనా ఇబ్బందే. ఇలాంటి ఇబ్బందిని తప్పించుకోవటానికి జీబోర్డు ఫ్లోటింగ్‌ మోడ్‌ చేదోడుగా నిలుస్తుంది. దీన్ని తెర మీద ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అవసరమైన సైజుకు మార్చుకోవచ్చు. జీబోర్డు పైవరుసలో కనిపించే ఆప్షన్లలో అన్నింటికన్నా ఎడమవైపున ఫ్లోటింగ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకుంటే చాలు. ఇదే పద్ధతిలో డిసేబుల్‌ కూడా చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని