యాప్‌తో చిక్కొద్దు.. మెయిల్‌కి దొరకొద్దు..!

ఎక్కడ విన్న కొవిడ్‌ కబుర్లే.  ఏం చూసినా కరోనా కథనాలే. కరోనా పాజిటివ్‌ కేసుల గురించి వింటుంటే ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. దీంతో కరోనాకి సంబంధించిన సమాచారం కోసం ఆన్‌లైన్‌లో ...

Updated : 27 Feb 2024 19:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎక్కడ విన్నా కొవిడ్‌ కబుర్లే.  ఏం చూసినా కరోనా కథనాలే. కరోనా పాజిటివ్‌ కేసుల గురించి వింటుంటే ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. దీంతో కరోనాకి సంబంధించిన సమాచారం కోసం ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. మరి సమాచారం కోసం నమ్మకం లేని వెబ్‌సైట్‌లను తెరిస్తే ఎలా! మీ ఆతృత, భయాన్ని సైబర్‌ నేరగాళ్లు, స్కామర్లు సొమ్ము చేసుకుంటున్నారు.  జాగ్రత్త సుమా! ప్రమాదం పొంచి ఉంది. సైబర్‌ నేరగాళ్లు మీ కోసం వేచిచూస్తున్నారు. ఏదో విధంగా మిమ్మల్ని వారి బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారి వలలో పడకుండా సింపుల్‌గా ఈ చిట్కాలు పాటించేయండి.

యాప్‌లతో జాగ్రత్త
కరోనాకి సంబంధించిన కాంటాక్ట్‌ ట్రాకింగ్‌ కోసం ఒక్క ఆరోగ్య సేతు యాప్‌ తప్ప వీలైనంత వరకూ ఇతర యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయొద్దు.  ఈ మధ్యే ర్యాన్సమ్‌వేర్‌ బారిన పడేలా కొవిడ్‌లాక్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు కాంటాక్ట్‌ ట్రాకింగ్‌ యాప్‌ను రూపొందించారు. ఇది కరోనా వైరస్‌ ట్రాకింగ్‌ యాప్‌లా కనిపిస్తున్నప్పటికీ ఇదో ర్యాన్సమ్‌వేర్‌. యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేస్తే చాలు.. మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్‌ చేసి నగదు డిమాండ్‌ చేస్తారు. అందుకే ఏ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసినా జాగ్రత్త అవసరం.  

వెబ్‌ విహారంలోనూ.. 
ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ తప్ప కరోనా వైరస్‌ విషయంలో స్పష్టమైన, నమ్మదగిన సమాచారాన్నిచ్చే ఏ వెబ్‌సైట్‌ అందుబాటులో లేదని గమనించాలి. కానీ కరోనా వైరస్‌ సంబంధిత సమాచారంతో రిజిస్టర్‌ చేసుకుంటున్న వెబ్‌సైట్‌లెన్నో. వాటిని తెరిచే ముందు జాగ్రత్త. అవి మాల్‌వేర్‌లై ఉండొచ్చు. మీ వ్యక్తిగత డేటాని దొంగిలించి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉంది. 

వీటి జోలికి పోవొద్దు
   ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ బారిన పడిన వ్యక్తులకుండే లక్షణాలను చాలా స్పష్టంగా అందుబాటులో ఉంచింది. మరి ఇతర నమ్మశక్యంకాని వెబ్‌సైట్‌లు, పోర్టల్‌లు, యాప్‌లతో పనేంటి! జాగ్రత్త అవి మాల్‌వేర్‌ వెబ్‌సైట్లై ఉండొచ్చు. వ్యాధి విషయంలో మీకు సందేహాలున్నా, మరింత స్పష్టత అవసరమున్నా, ప్రభుత్వ టోల్‌ ఫ్రీ నంబరు లేదా వైద్యుడిని సంప్రదించడమే మంచిది.

నమ్మి చిక్కుల్లో పడొద్దు
ఇప్పటి వరకూ కరోనా వైరస్‌కి సంబంధించిన వంద శాతం నమ్మదగిన వ్యాక్సిన్‌, ఔషధాలు అందుబాటులోకి రాలేదు. అందుకే ఔషధాల కోసం ఆన్‌లైన్‌లో వెతకొద్దు. ఏదైనా ఆన్‌లైన్‌ సంస్థలు కరోనా వ్యాక్సిన్‌, ఔషధం,  అంటూ మెయిల్‌ లేదా ఇతర మెసేజ్‌లు పంపితే నమ్మకండి. వాటిని తెరిచి చిక్కుల్లో పడొద్దు. వైద్యుని సంప్రదిస్తే మీ వ్యాధి తీవ్రతని బట్టి చికిత్స అందిస్తారు. అలాగే వైరస్‌లను సంహరించే శుభ్రత సామగ్రి కోసమూ అనధికారిక వెబ్‌సైట్‌లలో వెతకొద్దు.

ఆ వీడియోలను నమ్మొద్దు
రోగనిరోధక శక్తి కోసం ఈ ఆహార పదార్థాలు తీసుకోండి.. ఈ సూచనలు పాటించండి, అంటూ చెప్పే వీడియోలను వీలైనంత వరకూ వెతకడం మానేయండి. ప్రభుత్వ సూచనల ప్రకారమే కరోనా వైరస్‌తో పోరాడటం మంచిది. అలాంటి వీడియోల ద్వారా రోగనిరోధక శక్తి మాటటుంచితే మీ ఆరోగ్యానికి హాని కలగొచ్చు. ఈ మధ్యే కరోనా వైరస్‌కి సంబంధించి యూట్యూబ్‌లో అనేక ఫేక్‌ వీడియోలను గూగుల్‌ తొలగించింది.  గుర్తుంచుకోండి... రోగనిరోధక శక్తి ఆకస్మికంగా వచ్చేది కాదు. దానికి కొంత సమయం పడుతుంది. 

ఈ-మెయిల్స్‌తో జాగ్రత్త
ఈ మధ్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ రంగల సంస్థల పేరుతో అనేక అనధికారిక స్పామ్‌ మెయిల్స్‌ వస్తున్నాయని.. చూసేందుకు అధికారికంగా ఉండటంతో ప్రజలు వాటిని నమ్మే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అలాంటి మెయిళ్లు, లింక్‌లు, అటాచ్‌మెంట్‌లను తెరవొద్దని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. కొవిడ్‌ 19 ఉచిత పరీక్ష అంటూ మీకేదైనా మెయిల్‌ వస్తే తెరవకండి. ఇలాంటి నకిలీ మెయిళ్లు మిమ్మల్ని ఫేక్‌ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్లి మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాయి.  వాటిని తెరిచి మోసపోవద్దు. 

ఆలోచించి పంపండి!
ఈ మధ్య అనేక ఆన్‌లైన్‌ ఛారిటీ సంస్థలు కరోనా వైరస్‌ బారిన పడిన వ్యక్తులకు సేవలందించేందుకు దాతల సహాయం కోరుతున్నాయి. అలా ఆన్‌లైన్‌ ద్వారా నగదు పంపే ముందు ఆ వెబ్‌సైట్‌ అధికారికంగా ధ్రువీకరించిందేమో తెలుసుకోండి. స్కామ్‌ వ్యాపారాలకి ముఖ్యమైన ఆధారం ఫేక్‌ డొనేషన్‌ వెబ్‌సైట్‌లే. అందుకే ఒకటికి రెండుసార్లు పరిశీలించి నగదు బదిలీ చేయండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని