ల్యాపీ వేడెక్కుతోందా? ఇలా చేయండి

ల్యాపీలు వేడెక్కడం అరికట్టడానికి కొన్ని చిట్కాలున్నాయి. వాటిని ఫాలో అయిపోండి... ల్యాపీని చక్కగా వాడేయండి!

Published : 15 Jan 2021 07:07 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోం సీజన్‌ ఇంకా నడుస్తోంది... ఆన్‌లైన్‌ క్లాసుల ట్రెండూ‌ కొనసాగుతూనే ఉంది. దీంతో ల్యాప్‌టాప్‌లు బిజీబిజీ అయిపోయాయి. దీంతో ల్యాపీలు ఒక్కోసారి పొయ్యి మీది పెనంలా వేడెక్కిపోతున్నాయి. దీని వల్ల ల్యాపీ చెడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో ల్యాపీలు వేడెక్కడం అరికట్టడానికి కొన్ని చిట్కాలున్నాయి. వాటిని ఫాలో అయిపోండి... ల్యాపీని చక్కగా వాడేయండి!

సులభంగా వాడుకోవచ్చు... ఎక్కడికైనా ఇట్టే తీసుకెళ్లొచ్చు అనే ఆలోచనలతో చాలామంది ల్యాప్‌టాప్‌లు తీసుకుంటూ ఉంటారు. ల్యాప్‌టాప్‌లోని చిన్న స్పేస్‌లో ఫీచర్లు, వేగవంతమైన ప్రాసెసర్లు ఇస్తున్నారు. దీంతో కొన్నిసార్లు ల్యాపీలు వేడెక్కిపోతున్నాయి. ఇదే ల్యాపీని ఇబ్బంది పెడుతుందంటున్నాయి టెక్‌ వర్గాలు. ఇది హార్డ్‌వేర్‌ సమస్యలకు కూడా దారి తీసే అవకాశం ఉందట. 

ఇలా తెలుస్తుంది!

ల్యాప్‌టాప్‌లో ఓ ఫ్యాన్‌ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ల్యాపీ వేడెక్కిన సందర్భంలో ఆ ఫ్యాన్‌ తిరిగే వేగం పెరుగుతుంది. అలాగే కంప్యూటర్‌ వేగం మందగిస్తుంది. ల్యాపీ వేగం పెరిగినప్పుడు.. దానిని కంట్రోల్‌లో పెట్టడానికి కొత్త తరం సీపీయూలు ఆటోమేటిక్‌గా క్లాక్‌ స్పీడ్‌ను తగ్గించుకుంటాయి. అలా కంప్యూటర్‌ వేగం తగ్గింది అంటే... వేడి పెరిగిందనే అర్థం. మీ కంప్యూటర్‌ ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి హెచ్‌డబ్ల్యూ మానిటర్‌ టూల్‌ను వాడొచ్చు.ల్యాపీలో ఏ పార్టు వేడెక్కిందో ఈ టూల్‌తో సులభంగా తెలుసుకోవచ్చు. 

అసలు ఎందుకు వేడెక్కుతుంది?

ల్యాపీ వేడెక్కడానికి ప్రధానమైన కారణం సరైన కూలింగ్‌ వ్యవస్థ లేకపోవడమే అని చెప్పాలి. ల్యాపీలోకి గాలి వెళ్లే, బయటకు వచ్చే... ప్రదేశాల్లో (వెనుకవైపు గ్రిల్స్‌)లో దుమ్ము పేరుకుపోవడం ఓ కారణంగా కావొచ్చు. కంప్యూటర్‌లోని ఫ్యాన్‌ పని చేయకపోవడం, థర్మల్‌ పేస్ట్‌ తయారవడం లాంటివి డీజనరేట్‌ అవ్వడం మరికొన్ని కారణాలు. సీపీయూ, జీపీయూ వేడిని కంట్రోల్‌ చేయడానికి థర్మల్‌ పేస్ట్‌ని వాడతారు. ల్యాపీ వేడెక్కినప్పుడు ఇది కరిగిపోతుంటుంది. అలా ఉండాల్సిన పేస్ట్‌ కంటే తక్కువ ఉన్నా సిస్టమ్‌ వేడెక్కుతుంది. 

ఫ్యాన్స్‌ లేని ల్యాపీల్లో అయితే...

నా ల్యాప్‌టాప్‌లో ఫ్యాన్‌ శబ్దం రావడం లేదు.. అంటే ఏమన్నా ఫ్యాన్‌ ఆగిపోయిందా అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఫ్యాన్లు లేకుండా కూడా కొన్ని ల్యాపీలు తయారు చేస్తుంటారు. ఇటీవల కాలంలో అలాంటివే ఎక్కువ వస్తున్నాయి. వాటిలో పాసివ్‌ కూలింగ్‌ సాంకేతికత ఉంటుంది. ఇది ల్యాపీలోని వేడిని మొత్తం డివైజ్‌కు స్ప్రెడ్‌ చేస్తుంది. అలా వేడి తగ్గిస్తుంది.

వేడెక్కడాన్ని ఎలా ఆపాలంటే...

ల్యాప్‌టాప్‌ వేడెక్కిందని మీరు గ్రహించాక... ఈ దిగువ చిట్కాలు పాటించి సమస్యను సరిచేయొచ్చు... 

1. ఫ్యాన్‌ ‌ సరి చేసి...

ల్యాప్‌టాప్‌లోని సీపీయూ, గ్రాఫిక్ కార్డులను ఎప్పటికప్పుడు చల్లబరచడానికి ఫ్యాన్స్‌ ఉంటాయని ముందే చెప్పుకున్నాం. ఆ ఫ్యాన్ల పనితీరును ఒకసారి సమీక్షించుకోవాలి. ఆ ఫ్యాన్లు నిరంతరం తిరుగుతూనే ఉండటంతో  రెక్కల మీద దుమ్ము పేరుకుపోయే అవకాశం ఉంది. దీంతో లోపలకు గాలి ప్రవేశించే అవకాశాలు  తగ్గిపోతాయి.  ఫ్యాన్‌ను పరిశీలించి, రెక్కల్ని శుభ్రం చేసుకోవాలి. ల్యాప్‌టాప్‌ మాన్యువల్‌ చూసి, దానికి తగ్గట్టుగా ఓపెన్‌ చేసి శుభ్రం చేసుకోవాలి. లేదా సర్వీసు సెంటర్‌కి తీసుకెళ్లి చేయించాలి. 

2. ఎక్కడ వాడుతున్నారో చూసుకోండి...

చాలా ల్యాప్‌టాప్‌ల్లో కింద భాగంలో గ్రిల్స్‌ ఉంటాయి. వాటి నుంచే లోపలి వేడి బయటికొస్తుంటుంది, బయటి గాలి లోపలకు వెళ్తుంటుంది. ల్యాపీలు వాడేటప్పుడు దుప్పట్లు, దిండ్లు మీద ఉంచడం, ఒడిలో పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. దాని వల్ల ల్యాపీలోకి గాలి సరిగ్గా ప్రసరించదు. దీంతో ల్యాప్‌టాప్‌ వేడెక్కిపోతుంది. కాబట్టి వీలైనంతవరకు బల్లపరుపుగా ఉన్న టేబుళ్ల మీద పెట్టే వినియోగించాలి. లేదంటే ల్యాప్‌ హోల్డర్లు, ట్రేలు కూడా వినియోగించొచ్చు.

3. ల్యాపీకి కూలర్లు

ల్యాప్‌టాప్‌కు హోల్డర్లు, ట్రేలు కొనుక్కునే ఆలోచనే ఉంటే... ఏకంగా ల్యాప్‌టాప్‌ కూలర్‌, కూలింగ్‌ ప్యాడ్‌లను తీసుకోవడం మంచిది. హోల్డర్‌/ ట్రేలా ఉండే వీటికి ఓ ఫ్యాన్‌ అమర్చి ఉంటుంది. అలా అని ఏది పడితే అది కొనేయడం మంచిది కాదు. మీ ల్యాపీకి గాలి ఎటువైపు నుంచి ప్రసరిస్తుందో చూసి, ఆ తరహా కూలర్‌/కూలింగ్‌ ప్యాడ్‌ తీసుకోవడం ఉత్తమం. ఉదాహరణకు ల్యాపీ దిగువన గ్రిల్స్‌ ఉంటే... గాలిని దిగువ నుంచి పైకి పంపే కూలర్‌ తీసుకోవాలి. ఒకవేళ గాలిని దిగువకు లాగే కూలర్‌ కొంటే ల్యాప్‌టాప్‌ చెడిపోతుంది. దీంతోపాటు ప్యాసివ్‌ కూలర్స్‌ కూడా ఉంటాయి. ఇవి గాలిని పంపకుండా... ఉన్న వేడిని పీల్చుకుంటాయి. 

సాఫ్ట్‌వేర్‌ నుంచి...

హార్డ్‌వేర్‌లో ఎన్ని మార్పులు చేసినా, కూలర్లు/కూల్‌ ప్యాడ్‌లు తీసుకున్నా వేడి సమస్య తగ్గలేదంటే సాఫ్ట్‌వేర్‌లోనే అసలు ఇబ్బంది అని తెలుసుకోవచ్చు. అయితే ల్యాపీ వినియోగంలో కొన్ని ఆప్షన్లు మిస్‌ అయ్యే అవకాశం ఉంది. ల్యాప్‌టాప్‌ బ్రైట్‌నెస్‌ తగ్గించుకోవడం, సీపీయూ క్లాక్‌ స్పీడ్‌ తగ్గించడం లాంటి మార్పులు చేసి వేడి తగ్గించొచ్చు. ల్యాపీ సర్వీసు విషయంలో మీకు ప్రవేశం ఉంటేనే ఇలాంటి మార్పులు చేయండి... లేదంటే సర్వీసు సెంటర్‌కి తీసుకెళ్లడం ఉత్తమం. 

ఇవీ చదవండి...

ఈ ల్యాపీలు రేంజ్‌... వేరే లెవల్‌!

శాంసంగ్‌ ప్రాసెసర్‌..గేమింగ్ ఛైర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని