గబ్బిలాలకు శబ్ద శక్తి పుట్టుకతోనే..

ధ్వని తరంగాలను వెదజల్లి, అవి వస్తువుకు తగిలి వెనక్కి చేరటాన్ని బట్టి (సోనార్‌) గబ్బిలాలు గాల్లో ఎగురుతుంటాయి. ఇవి మనలాగా దూరాన్ని కొలతల ప్రకారం చూడవు.

Updated : 19 May 2021 07:24 IST

ధ్వని తరంగాలను వెదజల్లి, అవి వస్తువుకు తగిలి వెనక్కి చేరటాన్ని బట్టి (సోనార్‌) గబ్బిలాలు గాల్లో ఎగురుతుంటాయి. ఇవి మనలాగా దూరాన్ని కొలతల ప్రకారం చూడవు. కాల ప్రమాణాన్ని బట్టి గుర్తిస్తాయి. అంటే మనం సెంటీ మీటర్లు, మీటర్ల లెక్కన గణిస్తే గబ్బిలాలు మిల్లీ సెకన్లు, సెకన్ల రూపంలో గణిస్తాయన్నమాట. ఉదాహరణకు ఏదైనా పురుగు ఒకటిన్నర మీటర్ల దూరంలో ఉందనుకోండి. గబ్బిలాలు దాన్ని 9 మిల్లీ సెకండ్ల దూరంలో ఉన్నట్టుగా భావిస్తాయి. తాము వెదజల్లిన శబ్దం, అది తమకు చేరుకున్న వేగాన్ని బట్టే ఇవి ఆయా వస్తువులు, కీలకాలను గుర్తిస్తాయి. ఇలా ధ్వని వేగాన్ని గుర్తించే శక్తి గబ్బిలాలకు పుట్టుకతోనే అబ్బుతోందని టెల్‌ అవైవ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తొలిసారి బయటపడింది. నిజానికి గబ్బిలాలు వెదజల్లే శబ్దాలను 80 ఏళ్ల కింëటే గుర్తించారు. అవి పుట్టుకతోనే ధ్వని వేగాన్ని కొలవటం నేర్చుకుంటున్నాయా, లేదంటే క్రమంగా వాటికి ఆ శక్తి అలవడుతోందా అన్న దాని మీద అప్పటి నుంచే పరిశోధనలు జరుగుతున్నాయి. టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీలోని సగోల్‌ స్కూల్‌ ఆఫ్‌ న్యూరోసైన్సెస్‌ అధిపతి యోసి యోవెల్‌ నేతృత్వంలో సాగిన తాజా పరిశోధన ఈ విషయంలో కొత్త అంశాలను వెలికి తీసింది. అధ్యయనంలో భాగంగా హీలియంతో గాలి ఒత్తిడిని పెంచిన వాతావరణంలో గబ్బిలం పిల్లలను, పెద్ద గబ్బిలాలను పెంచారు. ఇలాంటి వాతావరణంలో ధ్వని వేగం పెరుగుతుంది. ఈ కొత్త ధ్వని వేగానికి పిల్ల గబ్బిలాలే కాదు, పెద్దవీ సర్దుకోలేకపోయాయి. లక్ష్యాలకు ముందే పరిమితమయ్యాయి. లక్ష్యం కాస్త దగ్గరగా ఉందని అవి భావించటమే దీనికి కారణం. పెద్దవి సరే కొత్త వాతావరణానికి అలవాటు పడలేదని అనుకోవచ్చు. మరి చిన్నవో? దీనర్థం ధ్వని వేగాన్ని కొలవటం గబ్బిలాలకు పుట్టుకతోనే అలవడటమని పరిశోధకులు చెబుతున్నారు. గమనించాల్సి విషయం ఏంటంటే- ధ్వని వేగాన్ని బట్టి లక్ష్యం దూరాన్ని లెక్కించలేకపోవటం. వాటి మెదడులో ఆ వ్యవస్థ లేకపోవటం వల్ల వెను తిరిగి వచ్చే శబ్ద తరంగాల్ని దూరం రూపంలో కూడా అవి గణించలేవని యోవల్‌ అంటున్నారు. ధ్వని దూరాన్ని అవి సమయంలోనే కొలుస్తాయని వెల్లడించారు. మనం ప్రపంచాన్ని దూరంలో కొలిస్తే, అవి సమయంలో గణిస్తాయన్నమాట!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని