మీ ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందా?

ఫోన్‌ హ్యాకింగ్‌. ఇటీవల అందరినీ భయపెడుతున్న పదం. సైబర్‌ నేరగాళ్లు ప్రపంచంలో ఏ మూలనో నక్కి, ఫోన్లపై దాడి చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతే ఫోన్‌లోని విలువైన సమాచారం చోరీకి గురవుతుంది. మనకు తెలియకుండానే బ్యాంక్‌ లావాదేవీలు చేసేస్తారు.

Updated : 26 May 2021 12:17 IST

ఫోన్‌ హ్యాకింగ్‌. ఇటీవల అందరినీ భయపెడుతున్న పదం. సైబర్‌ నేరగాళ్లు ప్రపంచంలో ఏ మూలనో నక్కి, ఫోన్లపై దాడి చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతే ఫోన్‌లోని విలువైన సమాచారం చోరీకి గురవుతుంది. మనకు తెలియకుండానే బ్యాంక్‌ లావాదేవీలు చేసేస్తారు. ఇలాంటి విపత్తులు ఎన్నెన్నో. దాన్ని ఆపాలంటే.. అసలు మన ఫోన్‌ హ్యాకింగ్‌కి గురైందో తెలుసుకోవడం ఎలా? అంటే...
* బ్యాటరీ ఛార్జింగ్‌ సాధారణ రోజుల్లో కన్నా వేగంగా అయిపోతుంటే హ్యాకింగ్‌కు గురైందేమోనని అనుమానించాల్సిందే. స్పైవేర్‌, మాల్వేర్‌ హ్యాకర్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌ని ఉపయోగించడమే దీనికి కారణం.
* మనం ఇన్‌స్టాల్‌ చేయని కొన్ని యాప్స్‌ సైతం ఫోన్‌ స్క్రీన్‌పై కనిపిస్తున్నా జాగ్రత్త పడాల్సిందే.
* ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ విభాగంలో కొత్త నెంబర్లు, ఔట్‌బాక్స్‌లో మనం పంపని ఎసెమ్మెస్‌లు కనిపిస్తున్నా అనుమానించాల్సిందే.
* మన ప్రమేయం లేకుండానే తరచూ పాప్‌-అప్స్‌ హోం స్క్రీన్‌ మీద ప్రత్యక్షం అవుతున్నా ఏదో తేడా ఉన్నట్టే.
* హ్యాక్‌కి గురైన ఫోన్‌కి పోస్ట్‌ పెయిడ్‌ డేటా ప్లాన్‌ సదుపాయం ఉంటే బిల్లులు అసాధారణంగా, ఎక్కువగా వస్తుంటాయి కూడా.
* బ్రౌజర్‌ హోం పేజీ మనం వాడుతున్నది కాకుండా, తరచూ వేర్వేరుగా కనిపిస్తుంటుంది. మనం ఓపెన్‌ చేయని పేజీలూ హిస్టరీ విభాగంలో కనిపిస్తుంటాయి.
* ఫోన్‌ వేగం మందగిస్తుంటుంది. తరచూ ఆగిపోతుంటుంది.
ఇలాంటివి కనిపిస్తే ఫోన్‌ హ్యాక్‌ అయిందనే అర్థం.
ఏం చేయాలి?
హ్యాక్‌ అయినట్టు అనుమానం వస్తే ఫోన్‌లోనూ యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లు వేసుకోవాల్సిందే. ఏవైనా అనుమానిత యాప్‌లు కనిపిస్తే వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేసేయాలి. కచ్చితంగా అవసరమున్న యాప్‌లనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇన్ని చేసినా ఫోన్‌లో తేడాలున్నా, వింతగా అనిపిస్తున్నా వెంటనే ‘ఫ్యాక్టరీ రీసెట్‌’ చేసెయ్యటం ఉత్తమం. అయితే ముందుగా ఫోన్‌లోని సమాచారం, ఫొటోలు, వీడియోలు బ్యాకప్‌ చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని