
లవ్లీగా చెత్త తరలింపు!
అదొక చెత్తను తరలించే వాహనం. చెత్తకుండీ ఎక్కడుందో, అది ఎంతవరకు నిండిందో అదే గుర్తిస్తుంది. దానంతటదే అక్కడికి వచ్చి, కుండీని లోపలేసుకొని వెళ్లిపోతుంది. అదీ ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా. అంతా వాహనంలోని కంట్రోల్ వ్యవస్థ మహాత్మ్యం. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, పార్కుల వంటి నియంత్రిత ప్రాంతాల కోసం పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు దీన్ని రూపొందించారు.
సాధారణంగా తమకుతాముగా ఆయా వస్తువులను గుర్తించే వ్యవస్థలు ఇంటర్నెట్ మీదే ఆధారపడుతుంటాయి. కానీ ‘లవ్లీ’ వ్యవస్థ అలా కాదు. రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత నెట్‌వర్క్‌తో పనిచేయటం వల్ల ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. సమర్థంగా డేటాను సంగ్రహించటానికి, విశ్లేషించటానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో పాటు వైర్లెస్ సెన్సర్ నెట్‌వర్క్‌తో దీన్ని రూపొందించటం విశేషం. ఆఫ్‌లైన్ జియో-మ్యాపింగ్‌ను జోడించటం వల్ల కుండీలున్న చోటునే కాదు, వాటిల్లో ఎంత చెత్త ఉందో కూడా గుర్తిస్తుంది. వాహనం రావాల్సిన సమయానికన్నా ముందే కుండీ నిండిపోయినా చెత్త ఒలికి పోవటమనేది ఉండదు. ఎందుకంటే కుండీ నిండగానే వాహనానికి సమాచారం అందుతుంది. దీన్ని అందుకోగానే వాహనం దానంతటదే బయలుదేరుతుంది. దారిని ఎలా గుర్తిస్తుందనేగా మీ అనుమానం? ఇందుకోసం నియంత్ర వ్యవస్థకు ముందుగానే తేలికగా తర్ఫీదు ఇచ్చే అవకాశం ఉండటం వల్ల. అంటే ఒకసారి దారిని గుర్తిస్తే మరచిపోదన్నమాట. దీని మూలంగానే వాహనం సురక్షితంగా కుండీ ఉన్న చోటుకు చేరుకుంటుంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ వ్యవస్థ పనితీరును యూనివర్సిటీ ప్రాంగణాల్లో ఇప్పటికే పరీక్షించారు. పరిశ్రమలతో కలిసి దీన్ని పరీక్షించాలనీ పరిశోధక బృందం ప్రయత్నిస్తోంది. భారత పేటెంట్ కార్యాలయం నుంచి దీనికి పేటెంట్ కూడా లభించింది. మున్ముందు పెద్ద ఎత్తున తయారుచేయాలనీ భావిస్తున్నారు.