చెక్క ఉపగ్రహం

ఉపగ్రహాలు అనగానే లోహాలతో తయారుచేసినవే గుర్తుకొస్తాయి. మరి చెక్కతో చేసిన ఉపగ్రహాల గురించి విన్నారా? అయితే ఇది చదవాల్సిందే. అప్పుడెప్పుడో 1957లో స్పుత్నిక్‌ ఉపగ్రహాన్ని...

Published : 23 Jun 2021 01:46 IST

పగ్రహాలు అనగానే లోహాలతో తయారుచేసినవే గుర్తుకొస్తాయి. మరి చెక్కతో చేసిన ఉపగ్రహాల గురించి విన్నారా? అయితే ఇది చదవాల్సిందే. అప్పుడెప్పుడో 1957లో స్పుత్నిక్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పట్నుంచి ఎన్నో దేశాలు ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం భూ దిగువ కక్ష్యలో వందల కొద్దీ చిన్న, మధ్యతరహా, భారీ ఉపగ్రహాలు నిండిపోయాయి. వీటి మూలంగా పెద్ద మొత్తంలో ప్లాస్టిక్‌, లోహ, మూలకాల వ్యర్థాలు అంతరిక్షంలో పేరుకుపోతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్కిటిక్‌ ఆస్ట్రోనాటిక్స్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు జరి మకినెన్‌ కాస్త భిన్నంగా ఆలోచించాడు. చెక్క ఉపగ్రహాలను ఎందుకు ప్రయోగించకూడదని అనుకున్నాడు. జరి మకినెన్‌ ఫిన్లాండ్‌ రచయిత. ప్రసారకర్త (బ్రాడ్‌కాస్టర్‌) కూడా. విద్య, శిక్షణ అవసరాల కోసం ఆర్కిటిక్‌ ఆస్ట్రోనాటిక్స్‌ సంస్థ ఉపగ్రహాలు రూపొందిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఐరోపా స్పేస్‌ ఏజెన్సీతో కలిసి వీసా వుడ్‌శాట్‌ని జూన్‌ 12న ఫిన్లాండ్‌లో ప్రయోగాత్మకంగా ప్రయోగించారు. 10 సెంటీమీటర్ల ఈ నానో ఉపగ్రహం ఉపరితల ప్యానెళ్లని ప్లైవుడ్‌తో రూపొందించటం విశేషం. మూలల్లోని అల్యూమినియం రాడ్లు, మెటల్‌ సెల్ఫీ స్టిక్‌ తప్ప ఉపగ్రహం ఉపరితలం మొత్తం చెక్కే! హార్డ్‌వేర్‌ దుకాణాల్లో దొరికే, ఇళ్లలో ఫర్నిచర్లకి వాడే బిర్క్‌ చెట్టు చెక్కనే దీని తయారీకి వాడినట్టు వుడ్‌శాట్‌ చీఫ్‌ ఇంజనీర్‌, ఆర్కిటిక్‌ ఆస్ట్రోనాటిక్స్‌ సహ వ్యవస్థాపకులు ఎస్‌.నైమన్‌ పేర్కొంటున్నారు. నిజానికి బిర్క్‌ చెక్కలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని ముందుగా థర్మల్‌ వ్యాక్యూమ్‌ గదిలో పెట్టి ఎండించారు. అనంతరం దీనిలోంచి ఎలాంటి ఆవిరి బయటకు రాకుండా, అంతరిక్షంలోని అటమిక్‌ ఆక్సిజన్‌ ప్రభావానికి ఉపగ్రహం దెబ్బతినకుండా అతి పలుచటి అల్యూమినియం ఆక్సిడైజర్‌ పొరతో చుట్టేశారు. దీంతో తయారుచేసిన ఉపగ్రహాన్ని ఒక బుడగ సాయంతో స్ట్రాటోస్పియర్‌ వరకు విజయవంతంగా పంపించగలిగారు. వుడ్‌శాట్‌ 31.2 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాక బుడగ పగిలిపోయింది. ఆ తర్వాత ఉపగ్రహం పారాచ్యూట్‌ సాయంతో భూమ్మీదకి దిగింది. ముఖ్యంగా బూమ్‌కు అమర్చిన కెమెరాతో ఫొటోలు తీయటాన్ని పరీక్షించటానికి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ప్రయోగం ఆరంభం నుంచే సెల్ఫీ స్టిక్‌ను తెరచి ఉంచారు. ఉపగ్రహం దానంతట అదే ప్రతి ముప్పై సెకన్లకు ఒక ఫొటో తీయటం గమనార్హం. భూమ్మీద ఉన్న కేంద్రం నుంచి అదనంగా మరిన్ని ఫొటోలు తీసేలా కూడా చేశారు. అత్యధిక ఉష్ణం, చల్లదనం, రేడియేషన్‌ లాంటి తీవ్ర అంతరిక్ష పరిస్థితుల్లో చెక్క ఉపగ్రహాలు ఎలా పనిచేస్తాయన్నదాని మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని పరిశోధకులు చెప్పారు. మొత్తానికి ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయి చెక్క ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని అంటున్నారు. ఇదే నిజమైతే అంతరిక్షంలో ఇకపై చెక్క ఉపగ్రహాలూ చక్కర్లు కొడతాయన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని