ఈ ఇంజిన్లలో వెతికారా?

సమాచారం, ఫొటోలు, వీడియోలు.. ఏం కావాలన్నా గూగుల్‌లో వెతికేస్తాం. సెర్చ్‌ ఇంజిన్లలో గూగుల్‌దే ఏకఛత్రాధిపత్యమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Published : 23 Jun 2021 02:01 IST

సమాచారం, ఫొటోలు, వీడియోలు.. ఏం కావాలన్నా గూగుల్‌లో వెతికేస్తాం. సెర్చ్‌ ఇంజిన్లలో గూగుల్‌దే ఏకఛత్రాధిపత్యమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా మరికొన్ని సెర్చ్‌ ఇంజిన్లు లేకపోలేదు. ఇవీ బాగానే వాడకంలో ఉన్నాయి. కొన్ని కొత్త ఫీచర్లతోనూ అలరిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం. వీటి వైపూ ఓ కన్నేసి చూడండి.

బింగ్‌
(https://www.bing.com)

గూగుల్‌ తర్వాత బాగా పేరున్న సెర్చ్‌ ఇంజిన్‌ బింగ్‌నే. దీని సెర్చింగ్‌ వాటా 19.8శాతం. ఫొటోలు, వీడియోలతోపాటు ఫైనాన్స్‌, యాడ్స్‌, ఈవెంట్లు, స్పోర్ట్స్‌ స్కోర్లు, ఫ్లైట్‌ ట్రాకింగ్‌, ట్రాన్స్‌లేషన్‌, స్పెల్‌ చెక్‌, షాపింగ్‌.. ఇలా ఎన్నో అదనపు ఫీచర్లు దీని సొంతం. బ్యాక్‌గ్రౌండ్‌ రోజూ మారిపోతూ ఉంటుంది. ప్రకృతి దృశ్యాలు, జంతువులు, ప్రదేశాలు.. ఇలా ఎన్నెన్నో కనువిందు చేస్తుంటాయి.

యాహూ
(https://in.yahoo.com)

బింగ్‌తో జట్టు కట్టి 2011లో మొదలైంది. సెర్చ్‌లో అత్యుత్తమ నాణ్యతతో ఫలితాలు అందిస్తోంది. మొత్తం 38 అంతర్జాతీయ భాషల్లో రిజల్ట్స్‌ పొందవచ్చు. మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌తో అయితే అధికారికంగా ఈ సెర్చ్‌ ఇంజిన్‌ ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. యాహూ వెదర్‌, యాహూ ఫైనాన్స్‌, యాహూ ఆన్సర్‌, యాహూ లోకల్‌.. అంటూ ఆకట్టుకునే విభాగాలున్నాయి. దీని మార్కెట్‌ వాటా 5.2శాతం.

ఆస్క్‌
shttps://www.ask.com)

అందుబాటులో ఉన్న ఉత్తమ సెర్చ్‌ ఇంజిన్లలో ఇది ఒకటని అభివర్ణిస్తుంటారు. 1995లో మొదలైంది. మొదట్లో Ask Jeeves అనే పేరుండేది. తర్వాత ఆస్క్‌ డాట్‌కామ్‌గా మార్చారు. ప్రస్తుతం క్వశ్చన్‌-ఆన్సర్‌ కమ్యూనిటీగా మారిపోయింది. దీని మార్కెట్‌ వాటా 3శాతం. టెక్నాలజీ, రాజకీయాలు, కళలు, సైన్స్‌, వ్యాపార రంగాల్లో ఎక్కువ సమాచారం అందుబాటులో ఉంచుతోంది.

డాగ్‌పైల్‌
(https://www.dogpile.com)

దో ప్రత్యేకమైన సెర్చ్‌ ఇంజిన్‌. గూగుల్‌, యాహూ, బింగ్‌ వంటి సెర్చ్‌ ఇంజిన్ల నుంచే సమాచారాన్ని గ్రహించినప్పటికీ.. మెటాసెర్చ్‌ పరిజ్ఞానంతో అత్యంత సమకాలీన అంశాలనే ముందుంచుతుంది. లింక్‌ల ద్వారా నేరుగా ఆయా వెబ్‌సైట్లలోకి తీసుకెళ్తుంది. మన సెర్చ్‌ హిస్టరీ ఆధారంగా ప్రాధాన్యాంశాలను అందుబాటులో ఉంచుతుంది.

ఏఓఎల్‌
(https://www.aol.com)

అందుబాటులో ఉన్న మరో మంచి సెర్చ్‌ ఇంజిన్‌ ఇది. 1983లో మొదలై 1991లో కొద్దిపాటి మార్పులతో అమెరికన్‌ ఆన్‌లైన్‌ లిమిటెడ్‌గా అందుబాటులోకి వచ్చింది. 2009లో ప్రముఖ కంపెనీ వెరిజాన్‌ ఆధ్వర్యంలోకి వచ్చింది. దీని మార్కెట్‌ వాటా తక్కువే అయినప్పటికీ అందించే ఫలితాలు బాగుంటాయంటారు.

కిడిల్‌
(https://www.kiddle.co)

పిల్లల కోసం సురక్షితమైన సెర్చ్‌ ఇంజిన్‌ కావాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు. ఇది సెర్చ్‌ ఇంజిన్‌ మాత్రమే కాదు, ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా కూడా. టూల్‌బార్‌లో ఏదైనా అంశాన్ని టైప్‌ చేయగానే ర్యాంకుల వారీగా వెబ్‌సైట్లు దర్శనమిస్తాయి. పిల్లలకు సురక్షితమైనవే అన్నింటికన్నా పైన ఉంటాయి. అనుచిత అంశాలను టైప్‌ చేస్తే రోబో బొమ్మ కనిపిస్తుంది. మళ్లీ వెతకమని చెబుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని