ఉప్పునీటి నుంచి చిటికెలో మంచినీరు!

సముద్రపు నీటిని మంచి నీరుగా మారిస్తే? తాగునీటి సమస్యలన్నీ మాయమైపోతాయి. ఇందుకోసం చాలా ప్రయత్నాలే జరిగాయి. తాజాగా కొరియా శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త ప్రక్రియ మరింత ఆశాజనకంగా

Published : 14 Jul 2021 01:30 IST

ముద్రపు నీటిని మంచి నీరుగా మారిస్తే? తాగునీటి సమస్యలన్నీ మాయమైపోతాయి. ఇందుకోసం చాలా ప్రయత్నాలే జరిగాయి. తాజాగా కొరియా శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త ప్రక్రియ మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రత్యేకమైన పొరతో కూడిన ఇది నిమిషాల్లోనే నీటిలోని ఉప్పును 99.9% వరకు వడపోయటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు మందికి పైగా ప్రజలు తాగు నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా తలసరి తాగు నీటి లభ్యత ఐదో వంతు మేరకు పడిపోయిందని ఐరాస పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రక్రియ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తే తాగు నీటి సమస్యకు చాలావరకు కళ్లెం పడుతుందని భావిస్తున్నారు. ఇందులో నానోఫైబర్‌ పొరను ఉప్పు నీటి ఫిల్టర్‌గా పరిశోధకులు ఉపయోగించుకున్నారు. నిజానికి పొరలతో నీటిని వడపోయటం కొత్తేమీ కాదు. కాకపోతే వీటితో చాలా ఇబ్బందులు తలెత్తుతుంటాయి. పొర బాగా తడిసిపోతే ఉప్పును వడపోయలేదు. దీంతో పొర ఎండిపోయేంతవరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. లేదూ పొరల రంధ్రాల నుంచి నీటిని తొలగించటానికి గాలిని ఒత్తిడితో పంపించాల్సి రావొచ్చు. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించటానికే కొరియా శాస్త్రవేత్తలు కో-ఆగ్జియల్‌ ఎలక్ట్రోస్పిన్నింగ్‌ అనే నానో టెక్నాలజీతో కొత్త 3డీ పొరను తయారుచేశారు. ఉపరితలం గరుకుగా, తక్కువ ఉష్ణ వాహకత్వం ఉండేలా దీన్ని రూపొందించారు. దీంతో ఇది చెడిపోకుండా 30 రోజుల వరకు ఉప్పునీటిని వడపోయటం విశేషం. ఇది నీటిని వడపోసే పరికరాలకు చాలా అనువుగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం రివర్స్‌ ఆస్మోసిస్‌ పద్ధతిలో సముద్రపు నీటిని వడపోస్తున్నారు. ఇలాంటి కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 20వేల వరకు ఉన్నాయి. కానీ ఇవి పనిచేయటానికి పెద్ద మొత్తంలో విద్యుత్తు అవసరమవుతుంది. వడపోత అనంతరం మిగిలిపోయే నీటిలో ఉప్పు పెద్ద మొత్తంలో ఉంటుంది. దీన్ని తిరిగి సముద్రంలోకే పంపిస్తుంటారు. ఇలాంటి ఇబ్బందులు, అనర్థాలను తప్పించే ఈ కొత్త ప్రక్రియ పర్యావరణానికీ మేలు చేస్తుండటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని