ఇదో కొత్త భ్రాంతి

ఈ చిత్రాన్ని ఒకసారి నిశితంగా చూడండి. నక్షత్రం విస్ఫోటనం చెందినట్టుగా.. మధ్య వృత్తంలోంచి తెల్లటి గీతలు అన్నివైపులకూ విస్తరిస్తూ కనిపిస్తున్నాయి కదా. నిజానికి అందులో తెల్ల గీతలేవీ లేవు.

Updated : 04 Aug 2021 06:03 IST

ఈ చిత్రాన్ని ఒకసారి నిశితంగా చూడండి. నక్షత్రం విస్ఫోటనం చెందినట్టుగా.. మధ్య వృత్తంలోంచి తెల్లటి గీతలు అన్నివైపులకూ విస్తరిస్తూ కనిపిస్తున్నాయి కదా. నిజానికి అందులో తెల్ల గీతలేవీ లేవు. అవన్నీ మన మెదడు భ్రమ ఫలితమే. ఇదో కొత్తరకం దృశ్య భ్రాంతి చిత్రం (ఆప్టికల్‌ ఇల్యూజన్‌). దీని పేరు సింటిలేటింగ్‌ స్టార్‌బరస్ట్‌. బహుభుజాల అమరికతతో కూడిన దీన్ని మైఖేల్‌ కార్లోవిచ్‌ అనే డిజైనర్‌ ఇటీవలే రూపొందించారు. బహుభుజాల మధ్య ఖాళీలను మెదడు అనుసంధానించుకోవటం వల్ల వాటిల్లోంచి కాంతి వెలువడుతున్నట్టు కనిపిస్తుందంతే. రంగుల మధ్య వ్యత్యాసం, రేఖల మందం, రేఖలు కలిసే బిందువుల సంఖ్య వంటివి లేనిది ఉన్నట్టుగా కనిపించేలా చేస్తున్నాయి. నిజానికిది అనుకోకుండానే పుట్టుకొచ్చింది. న్యూరోసైన్స్‌లో ప్రావీణ్యమున్న కార్లోవిచ్‌ కంపెనీ లోగో కోసం ఓ డిజైన్‌ను గీయాలని అనుకున్నారు. తీరా పూర్తయ్యాక ఆప్టికల్‌ ఇల్యూజన్‌గా తయారైంది. వెంటనే న్యూయార్క్‌ యూనివర్సిటీ న్యూరోసైన్స్‌ ప్రొఫెసర్‌ వాలిచ్‌కు చూపించారు. ఇలాంటి ఇల్యూజన్‌ను ఇంతకుముందెప్పుడూ చూడలేదని కితాబు ఇవ్వటంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. గీతలతో కూడిన ఇలాంటి భ్రాంతి చిత్రాలు చాలానే ఉన్నాయి గానీ ఇది మిగతా వాటి కన్నా భిన్నమైంది. దీని నేపథ్య డిజైన్‌ గుండా వెలుగు కిరణాలు ప్రసరిస్తుంటాయి. ఇవి నేపథ్య రంగు కన్నా లేతగా ఉండొచ్చు. లేదూ చిక్కగానూ ఉండొచ్చు. డిజైన్‌ రంగు, దాని నేపథ్యం మధ్య వ్యత్యాసాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. సింటిలేటింగ్‌ స్టార్‌బరస్ట్‌ను చూసినకొద్దీ రేఖలు మరింత ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వెలుగు రేఖలు కాసేపు మాయమవుతూ, తిరిగి ప్రత్యక్షమవుతూ విస్తుగొలుపుతుంటాయి కూడా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని