రణగొణధ్వనులకు క్రిస్ప్‌గా చెక్‌

ఇప్పుడు ఇంటి నుంచి పనిచేయటం మామూలైపోయింది. దీంతో హడావుడిగా ఆఫీసుకు పరుగెత్తటం, ట్రాఫిక్‌లో చిక్కుకోవటం వంటి కష్టాలు తప్పిపోయి ఉండొచ్చు గానీ కొన్ని ‘ఇంటి’ చిక్కులు లేకపోలేదు.

Updated : 04 Aug 2021 06:02 IST

ఇప్పుడు ఇంటి నుంచి పనిచేయటం మామూలైపోయింది. దీంతో హడావుడిగా ఆఫీసుకు పరుగెత్తటం, ట్రాఫిక్‌లో చిక్కుకోవటం వంటి కష్టాలు తప్పిపోయి ఉండొచ్చు గానీ కొన్ని ‘ఇంటి’ చిక్కులు లేకపోలేదు. పిల్లల అరుపులు, వంటింట్లో మిక్సీ గరగర, బయట వాహనాల రొద, పక్కింట్లో మరమ్మతు పనుల చప్పుళ్లు.. ఇలాంటి రణగొణధ్వనులన్నీ ఇబ్బందులు సృష్టించేవే. ముఖ్యంగా వీడియో కాల్స్‌ చేస్తున్నప్పుడు మరీ చిక్కులు తెచ్చిపెడతాయి. తోటి ఉద్యోగులు, కస్టమర్లు, క్లయింట్లకు మనం చెప్పేది సరిగా వినిపించనీయకుండా అడ్డుతగులుతుంటాయి. మరి ఇలాంటి కష్టాలను తప్పించుకోవాలంటే? దీనికో సులభమైన మార్గం ఉంది. అదే క్రిస్ప్‌ యాప్‌.

ఏంటీ క్రిస్ప్‌?

ఇది కృత్రిమ మేధ సాయంతో చుట్టుపక్కల చప్పుళ్లను తొలగించే యాప్‌. పీసీ, మ్యాక్‌ రెండింటికీ ఉపయోగపడే దీన్ని https://krisp.ai/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూమ్‌, స్కైప్‌, టీమ్స్‌, ఫేస్‌టైమ్‌, హ్యాంగవుట్‌, వెబెక్స్‌ వంటి వివిధ యాప్‌లకూ కంప్యూటర్‌, మొబైల్‌ మైక్‌/స్పీకర్‌కూ మధ్య ‘నిశ్శబ్ద’ తెరలా పనిచేస్తుంది. చుట్టుపక్కల చప్పుళ్లను తొలగించి అవతలి వాళ్లకు మన మాటలు మాత్రమే స్పష్టంగా వినిపించేలా చూడటం దీని ప్రత్యేకత. క్రిస్ప్‌ నెట్‌ డీఎన్‌ఎన్‌ అనే న్యూరల్‌ నెట్‌వర్క్‌ రూపంలో రణగొణధ్వనులను గుర్తించి, తొలగించేస్తుంది. ఇది అన్నిరకాల హెడ్‌సెట్స్‌, మైకులు, స్పీకర్లనూ సపోర్టు చేస్తుంది. సుమారు 20వేల రకాల శబ్దాల మీద అధ్యయనం చేసి మరీ దీన్ని రూపొందించారు. దీనికి 50వేల గొంతుల ధ్వనులు, 2,500 గంటల రికార్డింగులతో ఆయా చప్పుళ్లను గుర్తించేలా కృత్రిమ మేధతో శిక్షణ కూడా ఇచ్చారు.

ఉచిత ఖాతాతోనూ

క్రిస్ప్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఉచిత ఖాతాను తెరచి, యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఉచిత ఖాతాలోనైతే వారానికి 240 నిమిషాల క్రిస్ప్‌ ఎనేబుల్డ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఒక జీబీ వరకు రికార్డింగు చేసుకునే అవకాశమూ ఉంది. అదే ప్రొ అకౌంట్‌ ద్వారానైతే అపరిమితంగా ఉచిత కాల్స్‌, 10 జీబీ వరకు రికార్డింగు చేసుకోవచ్చు. వినియోగదార్లను ప్రోత్సహించటానికి ప్రమోషనల్‌ ఆహ్వాన పథకాన్నీ కంపెనీ అందిస్తోంది. ఇన్విటేషన్‌ కోడ్‌తో తోటి ఉద్యోగులు ఇందులో ఖాతాను తెరచినట్టయితే 2 నెలల వరకు అపరిమిత కాల్స్‌ చేసుకోవటానికి వీలుంటుంది. సహోద్యోగులు కూడా ఒకే వర్క్‌ మెయిల్‌ డొమైన్‌ మీదే పనిచేస్తుంటే నాలుగు నెలల వరకు ఈ సదుపాయాన్ని పొందొచ్చు. ఒక నెల వరకు ఉచితంగా ప్రొ సర్వీసునూ ఉపయోగించుకోవచ్చు.

వాడుకోవటమెలా?

క్రిస్ప్‌ వెబ్‌సైట్‌లో ఖాతాను తెరచాక ఈమెయిల్‌కు కోడ్‌ వస్తుంది. దీని సాయంతో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అనంతరం ప్రిఫరెన్స్‌ ద్వారా గానీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ సర్వీసులో సెటింగ్స్‌ ద్వారా గానీ మైక్రోఫోన్‌, స్పీకర్‌కు క్రిస్ప్‌ను ఎంచుకోవాలి. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌లతోనే కాదు.. అడాసిటీ, అడోబ్‌ ఎడిషన్‌, ఎక్స్‌స్ప్లిట్‌ వంటి ఆడియో, వీడియో ఎడిటర్లతోనూ అనుసంధానమై పనిచేస్తుంది కూడా.

సామర్థ్యమూ ఎక్కువే

వంటింటి చప్పుళ్లు, ట్రాఫిక్‌ రొద, పిల్లల అరుపులు, పక్క అపార్టుమెంటులో మరమ్మతు పనుల వంటి శబ్దాలను ఇది సమర్థంగా నిలువరిస్తున్నట్టు పరీక్షల్లో తేలింది. అసలు అలాంటి రణగొణధ్వనులేవీ లేవన్నట్టుగానే స్పష్టంగా మాటలు వినిపించేలా చేయటం గమనార్హం. అందువల్ల ఇంటి నుంచి పనిచేసేవారికి, అదీ వీడియో కాల్స్‌లో మాట్లాడాల్సిన అవసరమున్నవారికి క్రిస్ప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. చాలామందికి ఉచిత ఖాతానే సరిపోవచ్చు. కావాలంటే ప్రమోషనల్‌ ఇన్వైట్‌తోనూ అదనపు ప్రయోజనం పొందొచ్చు. రోజూ గంటలకొద్దీ వీడియో కాల్స్‌ చేయాల్సినవారైతే పెయిడ్‌ అకౌంట్‌ను తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని