ఎంత కష్టానికి అంత మెదడు

కసరత్తులతో కండలు పెరుగుతాయి. శ్రమ చేయకపోతే క్షీణిస్తాయి. ఇది మెదడు సైజుకూ వర్తిస్తుందా? మన సంగతేమో గానీ చేపల మెదడు విషయంలో ఇది నిజమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మరింత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేపల...

Published : 18 Aug 2021 02:11 IST

సరత్తులతో కండలు పెరుగుతాయి. శ్రమ చేయకపోతే క్షీణిస్తాయి. ఇది మెదడు సైజుకూ వర్తిస్తుందా? మన సంగతేమో గానీ చేపల మెదడు విషయంలో ఇది నిజమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మరింత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేపల మెదడు సైజు పెరుగుతున్నట్టు తేలింది మరి. అదే మామూలు పరిస్థితుల్లోనైతే పెరగటం కాదు కదా, ఇంకాస్త కుంచించుకుపోతోంది కూడా. లేక్‌ ట్రాట్‌ అనే చేపల మెదడు చలికాలంలో పెద్దగానూ.. ఎండాకాలంలో చిన్నగానూ అవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడుకు ఎక్కవ శక్తి అవసరం. ఆహారం ద్వారా లభించే శక్తిలో ఎక్కువ భాగం వినియోగించుకునే అవయవాల్లో ఇదీ ఒకటి. మరి తగినంత ఆహారం లభించకపోతే? ఇలాంటి పరిస్థితుల్లో కీలక వనరులను పొదుపు చేసుకోవటానికి వీలుగా చేపల్లో మెదడు సైజు మారటం తోడ్పడుతోందని భావిస్తున్నారు. లేక్‌ ట్రాట్‌ చేపలకు చల్లటి నీరంటే ఇష్టం. అందుకే చలికాలంలో నీటి ఉపరితలానికి, ఒడ్డుకు వచ్చి ఆహారం కోసం అన్వేషిస్తుంటాయి. ఇలాంటి చోట్ల పోటీ ఎక్కువ. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టే చలికాలంలో మెదడు సైజు పెరుగుతుంది. ఇక వేసవిలో వేడి నీటికి దూరంగా ఉండటానికి లోతుల్లో ఉండటానికే ఇష్టపడతాయి. అక్కడ పెద్దగా కష్టపడాల్సిన పనుండదు. ఫలితంగా మెదడుకూ శ్రమ తగ్గుతుంది. సైజూ తగ్గుతుంది. పెంచినవాటి కన్నా బయట చెరువుల్లో పెరిగే చేపల మెదడు పెద్దగా ఉంటున్నట్టు మరో అధ్యయనంలోనూ బయటపడింది. మెదడుకు ఎంత పని పెరిగితే అంత పెద్దగా అవుతోందనే ఇవన్నీ సూచిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని