ఫోన్‌ సౌండ్‌కు నీటి దెబ్బ

స్మార్ట్‌ఫోన్లను ఎక్కడంటే అక్కడ, ఎడాపెడా వాడేస్తూనే ఉంటాం. కానీ వర్షంలో వాడటం మాత్రం కష్టమే. ఫోన్‌ లోపలికి నీరు పోతే అంతే. ప్రస్తుతం లోపలికి నీటిని పోనీయని స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి నీటిలో పడితే..

Updated : 18 Aug 2021 05:14 IST

స్మార్ట్‌ఫోన్లను ఎక్కడంటే అక్కడ, ఎడాపెడా వాడేస్తూనే ఉంటాం. కానీ వర్షంలో వాడటం మాత్రం కష్టమే. ఫోన్‌ లోపలికి నీరు పోతే అంతే. ప్రస్తుతం లోపలికి నీటిని పోనీయని స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి నీటిలో పడితే ఏమీ కాకపోవచ్చు గానీ కొన్నిసార్లు సౌండ్‌ నాణ్యత దెబ్బతినొచ్చు. దీన్ని సరిచేయటమెలా?

 స్పీకర్‌ క్లీనర్‌

సౌండ్‌ను సరిదిద్దటానికి ఆండ్రాయిడ్‌ ఫోన్ల కోసం చాలా యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవి వివిధ మోతాదుల్లో శబ్దాలను వెలువరిస్తూ సౌండ్‌ను సరిదిద్దుతుంటాయి. వీటిల్లో బాగా ఆదరణ పొందింది స్పీకర్‌ క్లీనర్‌. ముందుగా దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని, ఓపెన్‌ చేసుకోవాలి. తర్వాత వాల్యూమ్‌ను పూర్తిగా పెంచి, నున్నగా ఉండే చోట ఫోన్‌ను బోర్లించి పెట్టాలి. ఓ నిమిషం సేపు రకరకాల తరంగధైర్ఘ్యాల్లో శబ్దాలు వెలువడతాయి. ఇవి స్పీకర్‌ను శుభ్రం చేస్తాయి. కాకపోతే స్పీకర్‌ క్లీనర్‌ యాప్‌లో చాలా యాడ్స్‌ వస్తుంటాయి. వీటి బెడద వద్దనుకుంటే పెయిడ్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

 సిరి షార్ట్‌కట్స్‌

ఐఫోన్‌ ఐపీ రేటింగ్‌ భేషుగ్గా ఉందని కొందరు నీటిలో ముంచి మరీ ఫొటోలు తీస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఐపీ రేటింగ్‌ ఎంతున్నా సరే. స్పీకర్‌ గ్రిల్‌ నుంచి ఎంతో కొంత నీరు లోపలికి వెళ్లే అవకాశముంది. ఇది సౌండ్‌ తగ్గేలా చేస్తుంది. ఇక్కడే సిరి షార్ట్‌కట్స్‌ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది. సెటింగ్స్‌ మెనూ ద్వారా వెళ్లి, షార్ట్‌కట్స్‌ను ఎంచుకోవాలి. ‘అలో అన్‌ట్రస్టెడ్‌ షార్ట్‌కట్స్‌’ ఆప్షన్‌ మీద నొక్కాలి. తర్వాత Routinehub.co లో Josh0678 నుంచి ‘వాటర్‌ ఎజెక్ట్‌’ షార్ట్‌కట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని, ఆన్‌ చేస్తే రకరకాల శబ్దాలు పుట్టుకొస్తాయి. ఇవి స్పీకర్‌ నుంచి నీరు బయటకు వెళ్లేలా చేస్తాయి. సోనిక్‌ యాప్‌ సైతం ఇందుకు ఉపయోగపడుతుంది. ఇదీ శబ్దాలతో నీరును తొలగించేస్తుంది. ఇది పెయిడ్‌ వర్షన్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని