ఎండలో వెన్నెల్లా..

బయట ఎండ చురుక్కుమంటోంది. అంతా వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మీరేమో ఆనందంగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఊహించుకోవటానికే ఎంతో హాయిగా ఉంది కదా. మరి అదే నిజమైతే?

Updated : 25 Aug 2021 04:08 IST

యట ఎండ చురుక్కుమంటోంది. అంతా వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మీరేమో ఆనందంగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఊహించుకోవటానికే ఎంతో హాయిగా ఉంది కదా. మరి అదే నిజమైతే? అది త్వరలోనే నిజం కానుందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం ఓ వినూత్నమైన స్మార్ట్‌ వస్త్రాన్ని రూపొందించారు మరి. మెటాఫ్యాబ్రిక్‌ అని పిలుచుకుంటున్న ఇది కాంతిని ప్రతిఫలింపజేస్తుంది. వేడిని బయటకు వెదజల్లుతుంది. ఫలితంగా ఎండలో ఉన్నా ‘నీడలో ఉన్నట్టే’ అనిపిస్తుంది! అతి సూక్ష్మమైన టైటానియం ఆక్సైడ్‌, టెఫ్లాన్‌, పాలీలాక్టిక్‌ యాసిడ్‌ పూసలను కలిపి ఈ వస్త్రాన్ని రూపొందించారు. టైటానియం ఆక్సైడ్‌, టెఫ్లాన్‌ పూసలు అతి నీలలోహిత, కంటికి కనిపించే కాంతిని వెనక్కి మళ్లిస్తాయి. పాలీలాక్టిక్‌ యాసిడ్‌ పూసలు పరారుణ కాంతిని వెదజల్లుతాయి. ఈ మెటాఫ్యాబ్రిక్‌ సామర్థ్యాన్ని పరీక్షించగా సమర్థంగా పనిచేస్తున్నట్టూ వెల్లడైంది. ఒకవైపు మెటాఫ్యాబ్రిక్‌, మరోవైపు నూలు వస్త్రంతో తయారుచేసిన కోటును ధరించి గంటసేపు ఎండలో ఉండగా- మెటా ఫ్యాబ్రిక్‌ కిందనున్న చర్మం ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెరిగింది. అదే నూలు వస్త్రం కిందనున్న చర్మం ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ఎగబాకింది. మరో పరీక్షలో ఒక కారు మీద మెటాఫ్యాబ్రిక్‌ కవరును, మరో కారుపై మామూలు కవరు కప్పి రెండు గంటల సేపు ఎండలో పెట్టి పరిశీలించారు. ఇంకో కారుకు ఎలాంటి కవరునూ కప్పలేదు. మామూలు కవరు కప్పిన కారు లోపల ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు, కవరు కప్పని కారులో 57 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ఎగబాకగా.. మెటాఫ్యాబ్రిక్‌ కవర్‌ను కప్పిన కారులో ఉష్ణోగ్రత 30 డిగ్రీలకే పరిమితమైంది. అందుకే దీంతో దుస్తులను తయారుచేసి, ఎండలో ఉన్నా నీడలో ఉన్నట్టుగా అనిపించేలా చూడాలన్నది శాస్త్రవేత్తల ప్రయత్నం. మెటాఫ్యాబ్రిక్‌కు రకరకాల రంగులు అద్దొచ్చు గానీ తెల్ల రంగు అయితే సూర్యరశ్మిని ఎక్కువగా వెదజల్లేస్తుంది. మెటాఫ్యాబ్రిక్‌ దుస్తులు చర్మానికి తాకి ఉన్నప్పుడు మరింత సమర్థంగా పనిచేస్తుండటం విశేషం. మామూలు దుస్తుల మీద వీటిని ధరిస్తే శరీర వేడిని సరిగా గ్రహించలేదు. దీంతో చల్లదనం ప్రభావం గణనీయంగా పడిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు