ఓ అనాది నక్షత్ర విస్ఫోటనం

అప్పుడెప్పుడో 25 లక్షల సంవత్సరాల క్రితం సంభవించిన భారీ నక్షత్ర విస్ఫోటనం ఆనవాళ్లను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమికి 150 నుంచి 300 కాంతి సంవత్సరాల దూరంలో జరిగి

Updated : 25 Aug 2021 00:36 IST

అప్పుడెప్పుడో 25 లక్షల సంవత్సరాల క్రితం సంభవించిన భారీ నక్షత్ర విస్ఫోటనం ఆనవాళ్లను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమికి 150 నుంచి 300 కాంతి సంవత్సరాల దూరంలో జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అంత సుదూర విస్ఫోటనం కాబట్టే భారీ అంతర్ధానాలకు దారితీయకపోయి ఉండొచ్చు. కానీ కాస్మిక్‌ కిరణాల ప్రవాహంతో భూ జీవావరణాన్ని గణనీయంగా ప్రభావితం చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు.

1. కాంతి విస్ఫోటనం

నక్షత్ర విస్ఫోటనం మూలంగా నెల వరకు కాంతి వెలువడింది. ఇది పున్నమి చంద్రుడి మాదిరిగానే ప్రకాశించి ఉండొచ్చు. దీని కాంతికి నేల మీద వస్తువుల నీడలు పడి ఉండొచ్చని, పగటి పూట కూడా నక్షత్రంలా కనిపించి ఉండొచ్చని అనుకుంటున్నారు. అయితే దాని కాంతిలోని గామా, ఎక్స్‌ కిరణాలు హాని చేసేంత స్థాయిలో లేవు.

2. కాస్మిక్‌ కిరణాలు

అత్యధిక శక్తితో కూడిన ప్రొటాన్లు, ఇతర కేంద్రకాలతో కూడిన కాస్మిక్‌ కిరణాల ప్రచోదనాలు కాంతి వేగంతో సమానంగా దూసుకొచ్చి ఉండొచ్చు. వేలాది సంవత్సరాలు కొనసాగిన ఈ కాంతి పుంజాలు జీవావరణానికి మాయలేని మచ్చను కలగజేసి ఉండొచ్చు.

3. విస్ఫోటన అవశేషాలు

ప్రకాశవంతమైన గ్యాస్‌, దుమ్ముతో విస్తరించిన పొర భూమికి చేరుకునేలోగానే మాయమైపోయి ఉండొచ్చు. కానీ ఐరన్‌-60 వంటి రేడియోధార్మిక అణువులు ఇంకా తిరుగాడుతూనే ఉండి ఉండొచ్చు. వీటి అవశేషాలను సముద్ర అడుగు భాగాల్లో, అంటార్కిటిక్‌ మంచులో, చంద్రుడి మట్టిలో శాస్త్రవేత్తలు గుర్తించారు.


ప్రభావాలు అనేకం

నక్షత్ర విస్ఫోటనం అవశేషాలను బట్టి దాని ప్రభావాలను పరిశోధకులు అంచనా వేశారు.

ఎరువుల వాన: కాస్మిక్‌ కిరణాలు నైట్రోజన్‌ అణువులను విచ్ఛిన్నం చేయటం వల్ల నైట్రోజన్‌ ఆక్సైడ్‌ రసాయన మిశ్రమాలు పుట్టుకొచ్చి, వానతో కలిసి కురిశాయి. ఇవి చెట్లకు ఎరువులుగా ఉపయోగపడ్డాయి. అయితే కార్బన్‌ డయాక్సైడ్‌ మోతాదులు తగ్గి, వాతావరణం చల్లబడింది.

ఓజోన్‌ తగ్గటం: నైట్రోజన్‌ ఆక్సైడ్‌ మోతాదులు పెరగటం ఓజోన్‌ పొరను దెబ్బతీసింది. ఫలితంగా సూర్యుడి నుంచి వెలువడే అతి నీలలోహిత కాంతి భూమి మీద ఎక్కువగా పడింది. ఇది జన్యువుల మార్పులకు దారితీసింది.

మ్యుయాన్స్‌ దాడి: కాస్మిక్‌ కిరణాల్లోని మ్యుయాన్లు (ఎలక్ట్రాన్ల కోవకు చెందినవి) జంతువుల కణజాలంలోకి చొచ్చుకుపోయి, క్యాన్సర్లకు కారణమయ్యాయి.

పిడుగుల దెబ్బ: గాలి అణువులను రేడియోధార్మిక రేణువులు విచ్ఛిన్నం చేయటం ఆయాన్‌ మార్గాలకు వీలు కల్పించింది. ఇది పిడుగులు పడటానికి ఆస్కారం కలిగిస్తుంది. ఇలా విపరీతంగా పిడుగులు పడటం వల్ల కార్చిచ్చులు చెలరేగాయి. ఫలితంగా అడవులు కాలిపోయి, చివరికి గడ్డి మైదానాలుగా మారిపోయాయి.


నక్షత్రం ఎందుకు విస్ఫోటం చెందుతుంది?

భారీ నక్షత్రం గురుత్వాకర్షణ శక్తి నిరంతరం దాన్ని కుచించుకుపోయేలా లోపలికి లాక్కోవటానికి ప్రయత్నిస్తుంటుంది.  అదే సమయంలో నక్షత్ర కేంద్రంలో మండుతున్న అణు ఇంధనంతో పుట్టుకొచ్చే పీడనం బయటకు వచ్చేస్తుంటుంది. ఇది నక్షత్ర గురుత్వాకర్షణ ప్రభావాన్ని అడ్డుకుంటుంది. నక్షత్రంలో ఇంధనం నిండుకున్నప్పుడు పీడనం తగ్గిపోయి గురుత్వాకర్షణ శక్తి గెలుస్తుంది. దీంతో నక్షత్రం ఉన్నట్టుండి కుంచించుకుపోయి, వెలుపలి భాగం పేలిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని