వారానికోసారి టర్న్‌ ఆఫ్‌, ఆన్‌

నేటి డిజిటల్‌ యుగంలో మొబైల్‌ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువే. పెగాసస్‌ ఉదంతం అనంతరం చాలామంది దీని గురించి భయపడుతూనే ఉన్నారు. ప్రస్తుతం సెల్‌ఫోన్లు రకరకాల ఫీచర్లతో ఊరిస్తున్నాయి.

Published : 15 Sep 2021 02:01 IST

నేటి డిజిటల్‌ యుగంలో మొబైల్‌ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువే. పెగాసస్‌ ఉదంతం అనంతరం చాలామంది దీని గురించి భయపడుతూనే ఉన్నారు. ప్రస్తుతం సెల్‌ఫోన్లు రకరకాల ఫీచర్లతో ఊరిస్తున్నాయి. వీటన్నింటినీ వాడుకోవాలనే తాపత్రయ పడుతుంటాం. ఇవి సౌకర్యంగా ఉండొచ్చు గానీ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడు మొబైల్‌ ఫోన్లు డిజిటల్‌ ఆత్మలుగా మారిపోయాయని చెప్పినా అతిశయోక్తి కాదు. టెక్స్ట్‌ మెసేజ్‌లు, కాంటాక్టులు, ఫొటోలు, వీడియోలు.. ఇలా చెప్పుకొంటూ పోతే లెక్కలేనంత వ్యక్తిగత సమాచారం వీటిల్లో ఉంటుంది. అందుకే వీటిని దొంగిలించటానికి.. మన లొకేషన్‌ను ట్రాక్‌ చేయటానికి హ్యాకర్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి మన ఫోన్‌ హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే? తేలికైన, సులభమైన మార్గం ఒకటుంది. అదే వారానికోసారి.. లేదూ వీలున్నప్పుడల్లా టర్న్‌ ఆఫ్‌, టర్న్‌ ఆన్‌ చేయటం. మొబైల్‌ పరికరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండటానికి అమెరికా జాతీయ భద్రత సంస్థ సూచించిన ఉపాయాల్లో ఇదొకటి. కంప్యూటరో, ల్యాప్‌టాపో మొరాయించినప్పుడు సిస్టమ్‌ను ఆఫ్‌ చేసి, ఆన్‌ చేస్తాం కదా. సెల్‌ఫోన్‌ను అప్పుడప్పుడు రీబూట్‌ చేయటమూ అలాంటిదే. దీంతో సైబర్‌ నేరగాళ్లు, గూఢచార సంస్థల నుంచి పూర్తిగా తప్పించుకుంటామని కాదు గానీ ఫోన్‌ నుంచి సమాచారాన్ని తేలికగా దొంగిలించకుండా కాపాడుకోవచ్చు. సాధారణంగా హ్యాకర్లు ఒకసారి పరికరం లేదా నెట్‌వర్క్‌లోకి జొరబడ్డాక హానికర సాఫ్ట్‌వేర్‌ను సిస్టమ్‌ మూల ఫైల్‌ వ్యవస్థలోకి ప్రవేశపెడతారు. ఇలా నిరంతరం నిఘా వేస్తుంటారు. కోర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోకి మాల్‌వేర్లు ప్రవేశించకుండా అడ్డుకోవటానికి యాపిల్‌, గూగుల్‌ వంటి సంస్థలు గట్టి భద్రత వ్యవస్థను రూపొందించాయి. దీన్ని ఛేదించటం అంత తేలికైన పనికాదు. అందుకే గుర్తించటానికి కష్టమైన, పంపినవారిని పట్టుకోవటానికి వీల్లేని మాల్‌వేర్లను జొప్పించటంపై హ్యాకర్లు దృష్టి సారించారు. ఇలాంటివి ఫోన్‌ను రీబూట్‌ చేసినప్పుడు మనుగడ సాగించలేవు.

మరికొన్ని మార్గాలు

* ఉపయోగించనప్పుడు బ్లూటూత్‌ను డిసేబుల్‌ చేయటం మంచిది. ఎయిర్‌ప్లేన్‌ మోడ్‌లో పెట్టినా బ్లూటూత్‌ అన్నివేళలా డిసేబుల్‌ కాదు.

* పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించొద్దు. అవసరం లేనప్పుడు వైఫై ఆప్షన్‌ను ఆఫ్‌ చెయ్యాలి. వాడని వైఫై నెట్‌వర్క్‌లను డిలీట్‌ చేసెయ్యటం ఉత్తమం.

* ఫోన్‌ కేసును ఉపయోగించటం మంచిది. దీంతో గదిలోని శబ్దాలు మైక్రోఫోన్‌కు చేరకుండా చూసుకోవచ్చు. ఫోన్‌ను వాడనప్పుడు కెమెరాను కవర్‌ చేసి ఉంచటం మేలు.

* వీలైనంత తక్కువ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అదీ అధీకృత యాప్‌ స్టోర్ల నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లకు వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాడనప్పుడు యాప్‌ను క్లోజ్‌ చేయటం ఉత్తమం.

* పరికరం సాఫ్ట్‌వేర్‌ను, యాప్స్‌ను వీలైనంత త్వరగా అప్‌డేట్‌ చేస్తుండాలి.

* సమాచార సంరక్షణకు ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ వంటి బయోమెట్రిక్‌ ఫీచర్లు ఉపయోగించుకోవాలి.

* ముఖ్యమైన, కీలకమైన సమాచారం టెక్స్ట్‌ మెసేజ్‌ల రూపంలో ఫోన్‌లో లేకుండా చూసుకోవాలి.

* అపరిచిత ఈమెయిల్‌ అటాచ్‌మెంట్లను తెరవద్దు.

* ఒరిజినల్‌ ఛార్జింగ్‌ కేబుళ్లనే ఉపయోగించాలి. నమ్మకమైన తయారీ సంస్థల నుంచే ఛార్జింగ్‌ పరికరాలను కొనాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని