మర కుక్క.. చిక్కుదారినీ దాటేస్తుంది

అదో చిక్కుదారి. అడ్డంకులను గుర్తిస్తూ సరైన దారిలో నడిస్తే గానీ గమ్యాన్ని చేరుకోలేం. అలాంటి కష్టమైన పనిని ఒక కుక్క పూర్తిచేసింది. ‘ఆ.. కుక్కలేమైనా తెలివి లేనివా? ఇలాంటి పని చేయటంలో వింతేముంది?’.

Updated : 20 Oct 2021 06:10 IST

దో చిక్కుదారి. అడ్డంకులను గుర్తిస్తూ సరైన దారిలో నడిస్తే గానీ గమ్యాన్ని చేరుకోలేం. అలాంటి కష్టమైన పనిని ఒక కుక్క పూర్తిచేసింది. ‘ఆ.. కుక్కలేమైనా తెలివి లేనివా? ఇలాంటి పని చేయటంలో వింతేముంది?’. అది మామూలు కుక్క కాదు మరి. రోబో కుక్క! అదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు కదా. కీటకాల స్ఫూర్తితో రూపొందించిన కృత్రిమ ‘మెదడు’ సాయంతో. మెదడు అంటే నిజంగా మెదడు కాదు. మెదడులా పనిచేసే ఆల్గోరిథమ్స్‌ అన్నమాట. కేవలం 30 గ్రాముల బరువుండే దీన్ని చిన్న చిన్న చిప్‌ల మీద తేలికగా అమర్చొచ్చు. చాలా వేగంగా పనిచేసే వీటికి 3 వాట్ల విద్యుత్తు చాలు. మిగతా రోబో నియంత్రిత వ్యవస్థలకు అవసరమైన విద్యుత్తుతో పోలిస్తే ఇది అతి తక్కువ. ఈ రోబో కృత్రిమ ‘మెదడు’ను ఎవరు రూపొందించారో తెలుసా? బ్రిటన్‌కు చెందిన ఆప్టెరన్‌ టెక్నాలజీస్‌ సంస్థ. దీనికి ఒక కంప్యూటర్‌ చిప్‌, 360 డిగ్రీల కోణంలో దృశ్యాల సమాచారాన్ని అందించే రెండు కెమెరాలు ఉంటాయి. కీటకాలు కదులుతున్నప్పుడు వాటి ప్రవర్తన, మెదడులో నాడీ కణాల పనితీరును పరిశీలించి.. వాటిని కలబోసి కృత్రిమ మేధ సాయంతో దీన్ని తయారుచేశారు. లక్ష్యాలను సాధించటానికి విస్తృత సమచారంతో శిక్షణ ఇవ్వటం కన్నా ఇలా కీటకాలు దిక్కులను పసిగట్టే సామర్థ్యాలను అనుకరించేలా చేశారన్నమాట. దీనిలోని ఒక ఆల్గోరిథమ్‌ కెమెరాల నుంచి అందే సమాచారంతో స్థిరమైన, విశాలమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. రెండో ఆల్గోరిథమేమో కదలికను విశ్లేషించి దూరం, వేగం వంటి వాటిని అంచనా వేస్తుంది. ఇలా అడ్డంకులకు ఢీకొట్టుకోకుండా తప్పిస్తుంది. కృత్రిమ ‘మెదడు’తో కూడిన రోబో కుక్కను కార్డుబోర్డు పెట్టెలతో తయారుచేసిన చిక్కుదారిలో పరీక్షించగా.. దేనికీ ఢీకొట్టకుండా సరైన దారిలో నడవటం గమనార్హం. అందుకే ఈ పరిజ్ఞానాన్ని వస్తువులను సరఫరా చేసే డ్రోన్లకు, గనుల్లో తనిఖీ రోబోలకు అనుసంధానించాలనీ భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు