శుక్రుడి మీద సముద్రాలు లేవు

శుక్ర గ్రహం మీద సముద్రాలుండే అవకాశం లేనేలేదని, ఇందుకు అక్కడి వాతావరణం సహకరించదని తాజా అధ్యయనం పేర్కొంటోంది. దీంతో గత అధ్యయనాల అంచనాలు తప్పని...

Published : 27 Oct 2021 01:58 IST

శుక్ర గ్రహం మీద సముద్రాలుండే అవకాశం లేనేలేదని, ఇందుకు అక్కడి వాతావరణం సహకరించదని తాజా అధ్యయనం పేర్కొంటోంది. దీంతో గత అధ్యయనాల అంచనాలు తప్పని తేలినట్టయ్యింది. స్విట్జర్లాడ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ జెనీవా, నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ కాంపీటెన్స్‌ ఇన్‌ రీసెర్చ్‌ ప్లానెట్స్‌ పరిశోధకులు ఇటీవల కంప్యూటర్‌ సిమ్యులేషన్‌ ద్వారా అధ్యయనం చేశారు. ఒకప్పుడు శుక్రుడి వాతావరణం చల్లగా ఉండి ఉంటుందా? భూమి, శుక్రుడి వాతావరణాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ క్రమంలో సముద్రాలు ఏవైనా పుట్టుకొచ్చాయా? అనే విషయాలను పరిశీలించారు. శుక్రుడి వాతావరణంలో నీటి ఆవిరి గడ్డ కట్టటానికి అనువైన పర్యావరణ పరిస్థితులు లేవని తేల్చారు. అంటే నీరు వాన చినుకులుగా మారి, శుక్రుడి మీద కురవటానికి అవసరమైనంత తక్కువ ఉష్ణోగ్రతలు అక్కడ ఎన్నడూ లేవన్నమాట. దీంతో నీరు వాయురూపంలోనే వాతావరణంలో ఉండిపోయింది. సముద్రాలేవీ ఏర్పడలేదు. దీనికి ముఖ్య కారణం శుక్రుడికి రాత్రి వైపు భాగంలో ఏర్పడే మేఘాలు పెద్దఎత్తున గ్రీన్‌హౌజ్‌ ప్రభావాన్ని సృష్టించటం. ఫలితంగా శుక్రుడు అనుకున్నంత త్వరగా చల్లబడటం లేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదృష్టం కొద్దీ మనం బతికిపోయాం గానీ లేకపోతే భూమి కూడా శుక్రుడిలాగే మారిపోయి ఉండేది. భూమి ఇప్పటికన్నా సూర్యుడికి కాస్త దగ్గరలో ఉన్నా, సూర్యుడు ఒకింత చల్లబడకపోయినా మన వాతావరణం ఇలా ఉండేదే కాదు. సూర్యుడి రేడియేషన్‌ బలహీనపడటం వల్లనే నీరు గడ్డకట్టేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవే వర్షాలకు, సముద్రాలు ఏర్పడటానికి దారితీశాయి. ఒకవేళ సూర్యుడి రేడియేషన్‌ మరింత బలహీనపడినట్టయితే భూమి మంచుగడ్డలా మారిపోయి ఉండేది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని