చిన్న సీడీలోనే 500 టీబీ సమాచారం

ప్రపంచమంతా క్లౌడ్‌లో తేలిపోతున్న తరుణంలో ఫిజికల్‌ డేటా రోజులు తిరిగి రానున్నాయా? బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌతాంప్టన్‌ శాస్త్రవేత్తల ప్రయత్నం ఇలాంటి ఆలోచనలే రేకెత్తిస్తోంది.

Published : 10 Nov 2021 00:59 IST

ప్రపంచమంతా క్లౌడ్‌లో తేలిపోతున్న తరుణంలో ఫిజికల్‌ డేటా రోజులు తిరిగి రానున్నాయా? బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌతాంప్టన్‌ శాస్త్రవేత్తల ప్రయత్నం ఇలాంటి ఆలోచనలే రేకెత్తిస్తోంది. సిలికా గ్లాసుతో చేసిన ఒక చిన్న సీడీ డిస్క్‌ మీద 500 టెరాబైట్ల డేటాను స్టోర్‌ చేయటంలో విజయం సాధించారు మరి. 5డీ ఆప్టికల్‌ స్టోరేజీగా పిలుచుకునే ఈ పరిజ్ఞానంపై శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నారు. ఇందులో స్వల్ప, శక్తిమంత కాంతి ప్రచోదనాలను వెలువరించే ఫెమ్టోసెకండ్‌ లేజర్‌ సాయంతో గ్లాసు మీదుండే అతి సూక్ష్మ నిర్మాణాలపై డేటాను రాస్తారు. సెకండుకు 230 కేబీ వేగంతో సమాచారాన్ని రాయొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. అంటే వందలాది గిగాబైట్ల సమాచారాన్ని కూడా తక్కువ సమయంలోనే స్టోర్‌ చేసుకోవచ్చన్నమాట. దీంతో క్లౌడ్‌ స్టోరేజీ మీద ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం డిజిటల్‌ ప్రపంచం రోజురోజుకీ విస్తరిస్తోంది. దీర్ఘకాల స్టోరేజీకి డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వినూత్న పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్లౌడ్‌ ఆధారిత సేవలు చాలావరకు తాత్కాలిక డేటానే స్టోర్‌ చేసుకుంటాయి. అదే 5డీ డేటా స్టోరేజీ విధానంతో మ్యూజియంలు, గ్రంథాలయాలు, ప్రైవేటు సంస్థల సమాచారాన్ని దీర్ఘకాలం నిల్వ చేసుకోవచ్చు. అందుకే దీంతో పాత స్టోరేజీ రోజులు తిరిగి రానున్నాయని, సర్వర్లు పనిచేయటం మానేసినా సమాచారం కోల్పోకుండా చూసుకోవచ్చని అనుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని