Published : 24 Nov 2021 01:17 IST

భూమికి గొడుగులు

ఫంగస్‌. శిలీంధ్రం. పేరేదైనా బ్రెడ్డు, చాక్లెట్‌, బీరు, వైన్‌ వంటి చాలారకాల ఆహార ఉత్పత్తులకిది అత్యవసరం. మానవ చరిత్రను గతి తిప్పిన ఎన్నో మందుల తయారీలోనూ కీలకపాత్ర పోషించింది. పర్యావరణ పరిరక్షణకూ ఇతోధికంగా తోడ్పడుతోంది. మనకు ఇంతగా మేలు చేస్తున్న ఫంగస్‌ కథేంటో చూద్దామా!

ఫంగస్‌ అనగానే ఆహారం పాచి పోవటం, కుళ్లిపోవటమే గుర్తుకొస్తుంది. చాలామంది దీన్ని మొక్కగానూ భావిస్తుంటారు. నిజానికిది మొక్క కాదు. అలాగని జంతువూ కాదు. దానికదే ఓ ప్రత్యేకమైన ప్రాణి. దీని ఆహార సముపార్జన, మనుగడ తీరూ భిన్నమే. మొక్కల్లా కిరణజన్య సంయోగక్రియ జరపదు. జంతువుల్లా నోటితో ఆహారం తినదు. తన ఆహారాన్ని తనలోనే సృష్టించుకుంటుంది. ఆ మాటకొస్తే తన ఆహారంలోనే జీవిస్తుంది. ఎంజైమ్‌లను విడుదల చేసి, పోషకాలను విచ్ఛిన్నం చేస్తుంది. తర్వాత వాటినే శోషించుకొని బతుకుతుంది. ఈస్ట్‌, ఆకుపచ్చని బూజు, పుట్టగొడుగులు.. ఇవన్నీ ఫంగస్‌ రూపాలే. కొన్ని ఏక కణ జీవులైతే.. కొన్ని బహు కణ జీవులు. ఇవి నేల మీద, లోపల, సముద్రంలో, మంచి నీటిలో, ఎడారుల్లో.. ఎక్కడైనా ఉంటాయి.

ఫంగసే లేకపోతే?

ఇప్పుడంటే భూమ్మీద జంతువులు, చెట్లు ఆధిపత్యం చలాయిస్తున్నాయి గానీ ఫంగస్‌ లేకపోయి ఉంటే ప్రపంచం ఇలా ఉండేదే కాదు. ఆక్సిజన్‌తో కూడిన వాతావరణం ఏర్పడేదే కాదు. తొలిదశలో మొక్కలకు, చెట్లకు వేర్లు లేవు. నీటిని పట్టి ఉంచే శక్తి లేదు. అంటే నీరు లేకపోతే జీవించేవి కావన్నమాట. మొక్కలు నీటిని దాటుకొని వచ్చిన రోజుల్లో నేలలో సేంద్రియ పదార్థం లేకపోవటం వల్ల పోషకాలేవీ ఉండేవి కావు. ఇక్కడే ఫంగస్‌ కీలక పాత్ర పోషించింది. ఇది సేంద్రియ ఆమ్లాలను విడుదల చేస్తూ.. రాళ్లను, ఖనిజాలను కరిగించుకొని వృద్ధి చెందుతుంది. వీటిని తను వాడుకోవటమే కాదు, మొక్కలకూ అందించింది. వీటికి బదులుగా మొక్కల నుంచి కర్బనాన్ని పొందింది. ఈ రెండింటి మధ్య సంబంధంతోనే వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌, ఆక్సిజన్‌ మోతాదులు మారిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఫంగస్‌ లేకపోతే అడవులు ఏర్పడేవే కావు. గడ్డి తిని జీవించే ఆవుల వంటి జంతువులు ఫంగస్‌ లేకపోతే పేగుల్లో గడ్డిని జీర్ణం చేసుకోలేవు. అంటే ఫంగస్‌ లేకపోతే మనకు పాలు కూడా లభించవన్నమాట.


ఎన్నెన్నో ప్రయోజనాలు

* ఫంగస్‌ పులిసిపోయేలా చేస్తుంది. అందుకే బ్రెడ్డు తయారీలో ఈస్ట్‌ వాడుతుంటారు. చాక్లెట్‌, బీరు, వైన్‌ వంటి వాటి తయారీలోనూ ఈ పులిసిపోయే ప్రక్రియే కీలకం.

* ఫంగస్‌ నుంచి సేకరించిన ఎంజైమ్‌లు చాలాకాలంగా దుస్తులను శుభ్రం చేయటానికీ ఉపయోగపడుతున్నాయి.

* ఎంటొమోపాథోజెనిక్‌ ఫంగస్‌ను బయోఇంజినీరింగ్‌ ప్రక్రియ ద్వారా సహజ పురుగు మందులు తయారుచేయటానికి వినియోగించుకుంటున్నారు.

* గనుల్లో రాళ్ల నుంచి పెద్ద మొత్తంలో లోహాలను సేకరించటానికి కొన్నిరకాల ఫంగస్‌ తోడ్పడుతోంది.

* మొట్టమొదటి యాంటీబయోటిక్‌ పెన్సిలిన్‌ ఆవిష్కరణకు దారితీసింది ఫంగసే. అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ 1928లో తన ప్రయోగశాలలో దీన్ని గుర్తించారు. ప్రయోగపాత్రలో పెన్సిలియం నోటాటమ్‌ అనే మోల్డ్‌ ఒక రింగులా ఏర్పడి, అందులోని బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకోవటం గుర్తించారు.  ఇదే పెన్సిలిన్‌ ఆవిష్కరణకు దారితీసింది.

* కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్లు పుట్టుకొచ్చిందీ ఫంగస్‌ నుంచే. జపాన్‌ శాస్త్రవేత్త అకీరా ఎండో 1976లో పెన్సిలియం సిట్రినం అనే ఫంగస్‌ ఎంజైముల నుంచి స్టాటిన్‌ను రూపొందించారు. దీని పేరు కాంపాక్టిన్‌ లేదా మెవాస్టాటిన్‌. మనుషులకు ఇచ్చిన మొట్టమొదటి స్టాటిన్‌ ఇదే.

* ఫంగస్‌ నుంచి తీసిన రసాయనాలను కుంగుబాటు వంటి మానసిక సమస్యల చికిత్సలకు వాడుకోవటానికీ ఇప్పుడు అనుమతిస్తున్నారు.

* మైసీలియం అనే ఫంగస్‌తో చర్మాలనూ తయారుచేస్తున్నారు. జంతు చర్మం, ప్లాస్టిక్‌ ప్యాకేజీలకు ప్రత్యామ్నాయాలుగా ఇవి ఉపయోగపడుతున్నాయి.

* ఫ్యాషన్‌ రంగంలోనూ మున్ముందు పుట్టగొడుగులు ప్రధాన భూమిక పోషించొచ్చనీ అనుకుంటున్నారు. ఇప్పటికే వీటితో టోపీల వంటివి తయారుచేస్తున్నారు.


లయకారిణి

క్షీణించటం... ప్రాణులకు సంబంధించి ప్రధాన సహజ ప్రక్రియ ఇదే. సేంద్రియ పదార్థాలు క్షీణించకపోతే తిరిగి పుట్టుకొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే శక్తి నశించదు. ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుతుందంతే. ఇందులో ఫంగస్‌దే కీలక పాత్ర. ఉదాహరణకు- అడవిలో చెట్టు కూలిపోయిందనుకోండి. అది ఎండిపోతున్నకొద్దీ ఫంగస్‌ కాండంలోకి చొరబడి దాన్ని క్షీణింపజేస్తుంది. ముక్కలు ముక్కలుగా విడగొడుతుంది. ఇలా వేరే రూపంలోకి మారటానికి వీలు కల్పిస్తుంది. అంటే ఒకరకంగా ఫంగస్‌ను లయకారిణి అనుకోవచ్చు. ఫంగస్‌లో రకరకాలు ఉన్నప్పటికీ.. వీటిల్లో మనకు తెలిసినవి 10 శాతమే. అందువల్ల అంతరించి పోకముందే వీటిని గుర్తించి, అర్థం చేసుకోవటం ముఖ్యమని పరిశోధకులు గట్టిగా భావిస్తున్నారు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని