
మెయిల్ మరచిపోకుండా స్నూజ్
ముఖ్యమైన మెయిల్ వచ్చింది. అప్పటికప్పుడు దానికి సమాధానం ఇవ్వటం కుదరలేదు. తర్వాత జవాబిస్తామని అనుకున్నాం. ఏదో ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూకు ఇంకా వారం సమయముంది. ఆలోపు తేదీని మరచిపోతే? చాలాసార్లు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటాం. జీమెయిల్లోని స్నూజ్ ఆప్షన్‌తో వీటిని తేలికగా తప్పించుకోవచ్చు. ఇది ఎప్పట్నుంచో అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది పెద్దగా పట్టించుకోరు. అసలు కొందరికి స్నూజ్ ఫీచర్ ఉందనే సంగతి తెలియదన్నా అతిశయోక్తి కాదు. ఇది రిమైండర్‌గా బాగా ఉపయోగపడుతుంది. దీంతో ఆయా మెయిళ్లను నిర్ణయించుకున్న సమయానికి ఇన్‌బాక్స్‌లో ప్రత్యక్షమయ్యేలా చూసుకోవచ్చు. జీమెయిల్ వెబ్ వర్షన్లో స్నూజింగ్ చాలా తేలిక. ఈమెయిల్ చదువుతున్నప్పుడు పై భాగాన గడియారం గుర్తులో ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఏదైనా మెయిల్‌ను సెలెక్ట్ చేసినప్పుడు ఇన్‌బాక్స్ పై భాగాన కూడా చూడొచ్చు. మెయిల్ మీద రైట్ క్లిక్ చేసి, పాపప్ మెనూతోనూ సెలెక్ట్ చేసుకోవచ్చు. మెయిల్‌ను చూస్తున్నప్పుడు కీబోర్డులో బి బటన్‌ను నొక్కటం ద్వారానూ ఎంచుకోవచ్చు. ఫోన్‌లోనైతే మెయిల్ పైన కుడివైపు మూలలోని కోట్స్‌ను నొక్కాల్సి ఉంటుంది. స్నూజ్ను ఎంచుకున్నాక తేది, సమయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో అది ఆ సమయానికి కొత్త మెయిల్‌గా దర్శనమిస్తుంది. కావాలంటే ఎడమ వైపున కనిపించే స్నూజ్డ్ ఫీచర్ ద్వారా ముందే చూసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.