Updated : 01 Dec 2021 06:33 IST

భూ రక్షణ కోసం..

విశాల విశ్వంలో భూమికి ఎప్పుడైనా ప్రమాదం ముంచుకురావొచ్చు. గ్రహ శకలాలు, తోకచుక్కలు ఎక్కడ్నుంచైనా ఢీకొట్టొచ్చు. అందుకే శాస్త్రవేత్తలు అనుక్షణం అంతరిక్షాన్ని జల్లెడ పడుతుంటారు. నిరంతరం శోధిస్తూ, నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పూ లేదు గానీ నిజంగానే ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే? దాన్ని ఎదుర్కోవటమెలా? ఇందుకు సన్నద్ధం కావటం కోసమే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గ్రహ రక్షణ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. భూమిని ఢీకొట్టే అవకాశం గల గ్రహ శకలాలను ఉపగ్రహం సాయంతో దారి మళ్లించే పనికి పూనుకొంది.

గ్రహ శకలాలు, తోక చుక్కలు మన భూమికి ఎప్పటికైనా ప్రమాదమే. ఇవి కొన్నిసార్లు గతి తప్పి భూమిని ఢీకొట్టొచ్చు. సుమారు 140 మీటర్ల వ్యాసార్థంతో కూడి, సూర్యుడి నుంచి భూమికి మధ్య గల దూరంలో 5% కన్నా తక్కువ దూరంలోకి వచ్చే వాటిని ‘భారీ ప్రమాదకర వస్తువు’గా పరిగణిస్తారు. నిజానికివి చాలాసార్లు భూమికి ఎలాంటి హాని కలిగించవు. సాధారణంగా భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతాయి. కానీ పెద్ద గ్రహ శకలాలతో ముప్పు లేకపోలేదు. భారీ గ్రహ శకలం ఒకటి ఢీకొట్టటం వల్లనే భూమిపై డైనోసార్లు అంతరించిపోయాయి. వచ్చే వందేళ్లలో భూమిని ఏదో ఒక గ్రహ శకలం ఢీకొట్టొచ్చని శాస్త్రవేత్తల అంచనా. గమనించాల్సి విషయం ఏంటంటే- ఇలాంటి వినాశకర గ్రహ శకలాల్లో మనకు తెలిసినవి 40 శాతమే. మిగతావన్నీ అజ్ఞాతంగానే ఉండిపోయాయి. అంటే వీటితో ఎప్పుడైనా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశముందనే అర్థం. మరి ప్రమాదం వాటిల్లే వరకు చూడకుండా వాటిని మధ్యలోనే తప్పించేస్తే మేలు కదా. ఇలాంటి ప్రణాళికతోనే నాసా ఇటీవల డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌(డార్ట్‌) వ్యోమనౌకను ప్రయోగించింది. ఇది వచ్చే సంవత్సరం డైమార్ఫోస్‌ అనే అంతరిక్ష రాయిని ఢీకొట్టనుంది. అలాగని డార్ట్‌ దీన్ని తుత్తునియలు చేయదు. ఒక వైపు నుంచి నెట్టి దారి మళ్లిస్తుందంతే. మనకు హాని చేయకుండా వేరే కక్ష్యలోకి ప్రవేశించేలా చేస్తుంది. డైమార్ఫోస్‌ కక్ష్యలోనే 65803 డీడైమోస్‌ అనే మరో గ్రహ శకలం తిరుగుతోంది. మున్ముందు ఇవి రెండూ భూ కక్ష్యను దాటే సమయంలో భూమిని ఢీకొట్టే అవకాశముంది. సుమారు కిలోమీటరు వ్యాసార్థం గల 65803 డీడైమోస్‌ ఒకవేళ భూమిని తాకితే పెద్ద ప్రమాదమే సంభవిస్తుంది. దీని కన్నా డైమార్ఫోస్‌ చిన్నగా ఉంటుంది. అందుకే డార్ట్‌తో దీన్ని దారి మళ్లించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది విజయవంతమైతే డీడైమోస్‌నూ ఇలాగే వేరే కక్ష్యలోకి ప్రవేశించేలా చేయటానికి మార్గం సుగమమవుతుంది.

తేలికైన పని కాదు

అంతరిక్షంలో చిన్న వస్తువును ఉపగ్రహాలతో చేరుకోవటం అంత తేలికైన పనికాదు. దాన్ని కచ్చితంగా గుర్తించి, ప్రయోగించాల్సి ఉంటుంది. అందుకే డార్ట్‌ ప్రయోగం శాస్త్రవేత్తలకు ఓ సవాల్‌ అని అనుకోవచ్చు. సుమారు 500 కిలోల బరువు గల ఇది సెకండుకు 6.6 కిలోమీటర్ల వేగంతో డైమార్ఫోస్‌ను ఢీకొట్టనుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆటోమేటెడ్‌. అంటే అన్ని వ్యవస్థలు తమకు తామే పనిచేస్తాయన్నమాట. దీన్ని 68 లక్షల మైళ్ల దూరం నుంచి నాసా శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తుండటం గమనార్హం. డార్ట్‌ నౌక డైమార్ఫోస్‌ను చేరుకుంటే.. భూమ్మీది నుంచి ప్రయోగించిన ఉపగ్రహాలు చేరుకున్న అత్యంత చిన్న అంతరిక్ష వస్తువు ఇదే కానుంది. డార్ట్‌ ఢీకొట్టిన తర్వాత డైమార్ఫోస్‌ గమనాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు. డార్ట్‌ ఉపగ్రహం లిసియాక్యూబ్‌ అనే మరో ఉపగ్రహాన్నీ మోసుకెళ్తోంది. డైమార్ఫోస్‌ను ఢీకొట్టాక డార్ట్‌ ముక్కలు ముక్కలవుతుంది కదా. దీన్ని లిసియాక్యూబ్‌ 54 కిలోమీటర్ల దూరం నుంచి వీక్షిస్తూ.. డైమార్ఫోస్‌ను తాకిన తర్వాత వెలువడే వ్యర్థాలను లెక్కిస్తుంది.

డైమార్ఫోస్‌ 11.9 గంటలకు ఒకసారి డీడైమోస్‌ను చుట్టి వస్తుంది. డార్ట్‌ చేరుకునే సరికి దీని వేగం కేవలం 73 సెకండ్లు పెరిగితే ప్రయోగం సఫలమైనట్టే. ఇది విజయవంతమైతే పెద్ద గ్రహ శకలాలనూ ఇలాగే దారి మళ్లించటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అప్పుడు మానవాళి సంరక్షణకు కొత్త ఆయుధం లభించినట్టేనని అనుకోవచ్చు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని