గురుత్వాకర్షణ అంటే?

విశ్వంలో ప్రాథమికమైన నాలుగు బలాల్లో గురుత్వాకర్షణ శక్తి ఒకటి. మిగతావి విద్యుదయస్కాంత శక్తి, బలహీన అణుశక్తి, బలమైన అణుశక్తి. ద్రవ్యరాశి లేదా శక్తి కలిగిన రెండు వస్తువుల మధ్య ఆకర్షణ గుణమే

Updated : 08 Dec 2021 06:18 IST

విశ్వంలో ప్రాథమికమైన నాలుగు బలాల్లో గురుత్వాకర్షణ శక్తి ఒకటి. మిగతావి విద్యుదయస్కాంత శక్తి, బలహీన అణుశక్తి, బలమైన అణుశక్తి. ద్రవ్యరాశి లేదా శక్తి కలిగిన రెండు వస్తువుల మధ్య ఆకర్షణ గుణమే గురుత్వాకర్షణ. వస్తువులు నేల మీద పడటమే కాదు.. నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరగటం, చంద్రుడి మూలంగా సముద్రాల్లో అలలు లేవటం వంటివన్నీ దీని ఫలితమే. చాలా ప్రాచుర్యం పొందినప్పటికీ గురుత్వాకర్షణ మొదట్నుంచీ శాస్త్రవేత్తలకు పెద్ద చిక్కుముడిగానే తోచింది. వస్తువులు కింద ఎందుకు పడతాయనేదానిపై ప్రాచీన శాస్త్రవేత్తలు రకరకాలుగా అభిప్రాయపడుతుండేవారు. ఏ వస్తువులైనా విశ్వ కేంద్రం వైపు ఆకర్షితమవుతాయన్నది గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ భావన. విశ్వానికి కేంద్రం భూమి  మధ్యలో ఉంది కాబట్టి వస్తువులు కింద పడతాయని ఆయన నమ్మకం. తర్వాత ఈ భావనకు కాలం చెల్లింది. గ్రహాలు సంచరించే మార్గాలను బట్టి సౌర మండలానికి సూర్యుడే కేంద్రమని తోస్తోందని నికొలస్‌ కొపర్నికస్‌ సూత్రీకరించారు. అనంతరం ఐజాక్‌ న్యూటన్‌ తొలిసారిగా గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. రెండు వస్తువుల మధ్య ఆకర్షణనే గురుత్వాకర్షణగా వర్ణించారు. వందేళ్ల తర్వాత ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ తన సాపేక్ష సిద్ధాంతం ద్వారా గురుత్వాకర్షణను మరో కోణంలో విశదీకరించారు. ఇది ఆకర్షణ గానీ బలం గానీ కాదన్నారు. వస్తువుల మూలంగా అంతరిక్ష-కాలంలో తలెత్తే వంపు పరిణామంగా దీన్ని పేర్కొన్నారు. షీటు మధ్యలో పెద్ద బంతిని పెట్టామనుకోండి. ఆ షీటు మీదున్న చిన్న వస్తువులు అక్కడ ఏర్పడిన వంపు వైపు రావటం ఆరంభిస్తాయి కదా. అంతరిక్ష-కాలం వంపుతోనూ ఇలాగే జరుగుతుందన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని