Updated : 26 Jan 2022 05:42 IST

ఆలోచనలే ఆదేశాలు!

అదొక కోతి. పేరు పేజర్‌. కంప్యూటర్‌ తెర మీద పాంగ్‌ ఆట ఆడేస్తోంది. మౌజ్‌లాంటివేవీ కదిలించకుండానే!
అతడి పేరు ఫిలిప్‌ ఓకీఫే. అమీట్రోఫిక్‌ లాటెరల్‌ స్క్లెరోసిస్‌ (ఏఎల్‌ఎస్‌) మూలంగా కండరాలు చచ్చుబడ్డాయి. అయినా కూడా కంప్యూటర్‌ మీద నిమిషానికి 18 పదాలు రాయగలడు!
- ఇవేమీ కల్పనలు కావు. బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్ఫేస్‌ ప్రయోజనాలకు మచ్చు తునకలు. మెదడును కంప్యూటర్‌తో అనుసంధానం ఈ పరిజ్ఞానం ఇటీవల కొత్తపుంతలు తొక్కుతోంది.

బ్రెయిన్‌ మిషిన్‌ ఇంటర్ఫేసెస్‌ (బీఎంఐ). బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్ఫేసెస్‌ (బీసీఐ). పేరేదైనా వీటి ఉద్దేశం ఒక్కటే. మెదడును కంప్యూటర్‌ వంటి బయటి పరికరాలతో అనుసంధానం చేయటం. దీంతో ఆలోచనల ద్వారానే కృత్రిమ చేయి వంటివాటిని కదిలించొచ్చు. మొబైల్‌ ఫోన్‌ను నియంత్రించొచ్చు. ఇంట్లో లైట్లు వేయొచ్చు. తలుపులు తెరవచ్చు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నెన్నో పనులు చేయొచ్చు. అందుకే దీనిపై చాలాకాలంగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. మెదడు కణాల ద్వారా అందే సమాచారాన్ని అనువాదం చేసే ఎలక్ట్రోడ్లను తలకు అమర్చటంపై 70ల్లోనే అధ్యయనాలు మొదలయ్యాయి. మొదట్లో కోతులపై ప్రయోగాలు నిర్వహించారు. 20ల తొలినాళ్లలో మనుషులపై ప్రయోగాలు మొదలెట్టారు. పక్షవాతం, పార్కిన్సన్స్‌, వినికిడిలోపం వంటి జబ్బులను జయించటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు సాగించారు. కానీ అన్నీ ప్రయోగాలకే పరిమితమయ్యాయి. పైగా ఎలక్ట్రోడ్లను అమర్చటానికి తలకు రంధ్రాలు చేయాల్సి వస్తుంది. వినూత్న పరిజ్ఞానాల ఆవిష్కరణతో ఇప్పుడు బయటి నుంచే మెదడు తరంగాలను చదవటం సాధ్యమవుతోంది. న్యూరేబుల్‌ సంస్థ రూపొందించిన బీసీఐ ఎనేబుల్డ్‌ హెడ్‌ఫోన్స్‌ దీనికో చక్కని ఉదాహరణ. సాఫ్ట్‌ఈఈజీ సెన్సర్లతో కూడిన ఇది బయటినుంచే మెదడు పనితీరును పసిగడుతుంది. కెర్నెల్‌ సంస్థ తయారుచేసిన బ్రెయిన్‌ మెజర్‌మెంట్‌ వ్యవస్థ కూడా ఇలాంటిదే. ఇలాంటి పరిజ్ఞానాలన్నీ కొత్త ఆలోచనలకు దారి చూపుతున్నాయి.

ఏంటీ పరిజ్ఞానం?

మన మెదడు పనిచేసే తీరును బట్టి బీసీఐ పరిజ్ఞానం పనిచేస్తుంది. మన మెదడులో బోలెడన్ని నాడీకణాలుంటాయి. ఇవి తోకల్లాంటి డెండ్రయిటిస్‌, యాక్సాన్ల ద్వారా ఒకదాంతో మరోటి అనుసంధానమవుతాయి. ఆలోచించటం, కదలటం, ఊహించుకోవటం, జ్ఞాపకం పెట్టుకోవటం.. ఇలా మనం ఏ పని చేసినా నాడీకణాలు విద్యుత్‌ సంకేతాల ద్వారా ఒకదాంతో మరోటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంటాయి. నిజానికి వీటి ప్రసారాలను బయటకు రాకుండా నాడుల మీదుండే పొర అడ్డుకుంటుంది. అయితే కొన్ని దీనిలోంచి బయటకు వస్తుంటాయి. వీటిని గుర్తించి, పట్టుకోవటమే బీసీఐ పరిజ్ఞానంలో కీలకాంశం. తలలో, లేదా తల మీద అమర్చిన ఎలక్ట్రోడ్ల ద్వారా వీటిని సంగ్రహించి, ఆయా పరికరాలకు మెదడు సంకేతాలను బదలాయించి పనిచేసేలా చూడటం దీని ఉద్దేశం.


భావాలతో పదాలు

బీసీఐ పరిజ్ఞానం విషయంలో ఇటీవల మరో గొప్ప ముందడుగు పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫిలిప్‌ ఓకీఫే ఆలోచనలను టెక్స్ట్‌ రూపంలోకి మార్చటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అతడికి ముందుగా మెదడులో శరీర కదలికలను ప్రేరేపించే భాగంలో స్టెంట్రోడ్‌ అనే పరికరాన్ని అమర్చారు. దీన్ని ఆయా అక్షరాలకు సంబంధించిన మెదడు పనితీరును గుర్తించే ప్రోగ్రామ్‌తో కూడిన కంప్యూటర్‌కు అనుసంధానం చేశారు. దీంతో చేత్తో రాస్తున్నట్టు ఊహించుకుంటున్న సమయంలో తెర మీద ఆయా పదాలు ప్రత్యక్షం కావటం గమనార్హం. ఇవి 95% కచ్చితత్వంతో ఉండటం విశేషం. పైగా నిమిషానికి 95 అక్షరాల వేగంతోనూ రాయగలిగాడు కూడా. ఇది వృద్ధులు స్మార్ట్‌ఫోన్‌ మీద టైప్‌ చేసే వేగంతో దాదాపు సమానం!


అటు నుంచి ఇటు

ప్పటివరకూ పరిశోధనలన్నీ మెదడు నుంచి పుట్టుకొచ్చే ఆలోచనలతో పరికరాలను పనిచేయించటం మీదే దృష్టి సారించాయి. మరి ఆయా పరికరాల నుంచి అందే సమాచారాన్నీ మెదడు స్వీకరించేలా చేస్తే? ఇలాంటి పరిజ్ఞానంతోనే పేజర్‌ కోతి పాంగ్‌ ఆట ఆడటం సాధ్యమైంది. ఈ ప్రాజెక్టును చేపట్టింది మరెవరో కాదు. ఎలాన్‌ మస్క్‌, ఆయన స్థాపించిన న్యూరాలింక్‌ సంస్థే. భవిష్యత్తు అంతా మెదడు స్టిమ్యులేషన్‌, ఆగ్మెంటేషన్లదే అన్నది న్యూరాలింక్‌ ప్రగాఢ నమ్మకం. కృత్రిమ మేధ మానవ మేధస్సును అధిగమించిన తర్వాత మనిషి మనుగడ కొనసాగటానికి ఇదొక్కటే అవకాశమన్నదీ మస్క్‌ వాదన. అందుకే మూడ్‌ వంటివాటిని నియంత్రించాలని న్యూరాలింక్‌ లక్ష్యంగా పెట్టుకొంది. ఆకలి, దాహం వంటి భావనలనే కాదు.. మాట, భాష, లెక్కల నైపుణ్యాలనూ నియంత్రించటం మీద దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రత్యేక చిప్‌ను రూపొందిస్తోంది. దీన్ని మనిషి మెదడులో అమర్చితే బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌తో అనుసంధానం కావొచ్చు. అంటే మనిషి ఒక సైబోర్గుగా అవతరిస్తాడన్నమాట. తీవ్రమైన వెన్నెముక గాయాలతో బాధపడేవారికి ఈ సంవత్సరంలో న్యూరాలింక్‌ చిప్‌ను అమర్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పేజర్‌ కోతికి చిప్‌ను అమర్చి పరీక్షించారు. ముందుగా కోతికి జాయ్‌స్టిక్‌తో వీడియోగేమ్‌ ఆడటం నేర్పించారు. బాగా ఆడితే పండు గుజ్జును బహుమతిగా ఇవ్వటం అలవాటు చేశారు. ఈ క్రమంలో ఆయా కదలికలకు తోడ్పడుతున్న నాడుల సమాచారాన్ని న్యూరాలింక్‌ రికార్డు చేస్తుంది. తర్వాత జాయ్‌స్టిక్‌ను కోతికి ఇవ్వకుండా పక్కనపెట్టారు. అయితేనేం? న్యూరాలింక్‌ సాయంతో కోతి తన ఆలోచనల ద్వారానే పాంగ్‌ ఆట ఆడేయటం విశేషం.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని