
Headphones: మీరు హెడ్‌ఫోన్స్ సరిగా ధరిస్తున్నారా?
హెడ్‌ఫోన్స్‌తో సంగీతం వింటుంటే ఆ మజానే వేరు. స్టీరియో పద్ధతిలోనైతే వివిధ దిక్కుల నుంచి శబ్దం వస్తున్న అనుభూతి మనసును ఎక్కడితో తీసుకెళ్లిపోతుంది. హెడ్‌ఫోన్స్‌ను సరిగ్గా.. అంటే ఏ చెవికి సంబంధించిన స్పీకర్లను ఆ చెవిలో ఉండేలా చూసుకుంటేనే ఈ సంగీతాన్ని బాగా ఆస్వాదించగలం. దీనికి శాస్త్రీయమైన కారణమే ఉంది. శబ్దం నెమ్మదిగా కదులుతుంది. మనం పర్వతాల దగ్గరికి వెళ్లి గట్టిగా అరిస్తే కాసేపటికి మన అరుపే మనకు వినిపిస్తుంది కదా. ఈ ప్రతిధ్వనికి కారణం శబ్దం నెమ్మదిగా కదలటమే. దీని మూలంగానే శబ్దం కాస్త ముందు వెనకలుగా ఎడమ, కుడి చెవులకు చేరుకుంటుంది. ఈ తేడాను ఇంటరారల్ టైమ్ డిఫరెన్స్ అంటారు. అంటే ఎవరైనా మన ఎడమ చెవి వద్ద ఏదైనా మాట్లాడితే అది కుడి చెవికి చేరుకోవటానికి కాస్త సమయం పడుతుందన్నమాట. దీని ఆధారంగానే శబ్దం ఎడమ చెవిలోంచి చేరుతున్నట్టు మెదడు గుర్తిస్తుంది. స్టీరియో మ్యూజిక్ విధానం దీన్నే ఉపయోగించుకుంటుంది. దీంతో వేర్వేరు దిక్కుల నుంచి శబ్దం వస్తున్నట్టుగా భ్రమింప జేస్తుంది. అయితే స్టీరియోను బాగా ఆస్వాదించాలంటే ఏ చెవి స్పీకర్‌ను ఆ చెవికే ధరించాలి. అటుది ఇటైతే శబ్దమూ మారుతుంది. ఉదాహరణకు ముందు నుంచి వస్తున్నట్టు వినిపించాల్సిన శబ్దం వెనక నుంచి వస్తున్నట్టు వినిపించొచ్చు. మోనో ఆడియోలోనైతే ఎలాంటి మార్పు ఉండదు గానీ స్టీరియో మ్యూజిక్ అయితే అంత బాగా ఆస్వాదించలేం.