
15,200 కోట్ల టన్నుల మంచి నీరు!
ఆ మధ్యన అంటార్కిటికా నుంచి విడిపోయిన ఏ68ఏ అనే భారీ మంచు ముక్క కరగటం వల్ల సముద్రాల్లోకి ఏకంగా 15,200 కోట్ల టన్నుల నీరు చేరింది! ఉపగ్రహాలు అందించిన చిత్రాలను పరిశీలించి శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. ఏ68ఏ అంటార్కిటికాలోని లార్సెన్-సి ఐస్ షెల్ఫ్ నుంచి 2017లో విడిపోయింది. అప్పుడు దీని వైశాల్యం 5,719 కిలోమీటర్లు. అప్పట్లో దీన్ని భూమ్మీద అతి పెద్ద మంచు ముక్కగా భావించేవారు. దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు 4వేల కి.మీ. ప్రయాణిస్తూ సౌత్ జార్జియా ద్వీపం సమీపంలోకి వచ్చింది. చల్లటి నీటితో కూడిన డ్రేక్ పాసేజ్ నుంచి వేడి నీరు గల స్కాటియా సముద్రంలోకి వస్తున్నకొద్దీ వేగంగా కరగటం ఆరంభించింది. గత సంవత్సరం ఏప్రిల్ వరకల్లా పూర్తిగా కరిగిపోయింది. అదృష్టవశాత్తు ముందే నీరుగా మారటం మూలంగా సముద్రమార్గానికి అడ్డు తగల్లేదు. ఇలాంటి మంచుగడ్డలోని మంచి నీరు ఉప్పునీటితో కలవటం వల్ల నీటిలోని పోషకాల తీరు మారుతుంది. దీంతో ఆ ప్రాంతంలో కొత్త ప్లాంక్‌టన్ పుట్టుకొచ్చే అవకాశముందని, ఇది అక్కడి ఆహారం చట్రంలో మార్పులు తేవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.