యాపిల్‌ హెల్త్‌కు టీకా సర్టిఫికెట్‌ జోడింపు

కొవిడ్‌-19 టీకా సర్టిఫికెట్‌కు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికిది తప్పనిసరైంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల సేవలు పొందటానికిది అత్యవసరంగా మారింది. అందువల్ల దీన్ని ఎల్లవేళలా వెంట ఉంచుకోవాల్సి

Published : 02 Feb 2022 01:06 IST

కొవిడ్‌-19 టీకా సర్టిఫికెట్‌కు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికిది తప్పనిసరైంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల సేవలు పొందటానికిది అత్యవసరంగా మారింది. అందువల్ల దీన్ని ఎల్లవేళలా వెంట ఉంచుకోవాల్సి వస్తోంది. మరి టీకా సర్టిఫికెట్‌ రికార్డులను స్మార్ట్‌ఫోన్‌లో సేవ్‌ చేసి పెట్టుకుంటే? అవసరమైనప్పుడు చూపించటానికి వీలుంటుంది కదా. ఇందుకోసం ఐఫోన్‌ వినియోగదారులకు యాపిల్‌ సంస్థ ఐఓఎస్‌ 15.1 అప్‌డేట్‌తో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో కొవిడ్‌ టీకా సర్టిఫికెట్‌ డిజిటల్‌ ప్రతిని, పరీక్షల పత్రాలను హెల్త్‌ యాప్‌లో దాచుకోవచ్చు, టీకా స్టేటస్‌ను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇది యాపిల్‌ వాలెట్‌లో టీకా కార్డునూ సృష్టిస్తుంది. అధికారిక ముద్రతో కూడి ఉండటం వల్ల టీకా, పరీక్షల రికార్డులు పత్రాల మాదిరిగానే డిజిటల్‌ రికార్డులూ ఉపయోగపడతాయి.

ఎలా జోడించుకోవాలి?

వైద్య సంస్థలు టీకా, పరీక్షల పత్రాలకు క్యూఆర్‌ కోడ్‌నూ జతచేస్తున్నాయి. దీంతో తేలికగానే హెల్త్‌ యాప్‌లో వీటిని పొందు పరచుకోవచ్చు.

ఐఫోన్‌లో కెమెరా యాప్‌ను ఓపెన్‌ చేసి, క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.

క్యూఆర్‌ కోడ్‌ను ఫోన్‌ గుర్తించగానే తెర మీద హెల్త్‌ యాప్‌ నోటిఫికేషన్‌ కనిపిస్తుంది.

నోటిఫికేషన్‌ మీద నొక్కి ‘యాడ్‌ టు వాలెట్‌ అండ్‌ హెల్త్‌’ను ఎంచుకోవాలి. తర్వాత డన్‌ బటన్‌ మీద ట్యాప్‌ చేయాలి. దీంతో టీకా వివరాలు యాపిల్‌ హెల్త్‌ యాప్‌లో సేవ్‌ అవుతాయి.

కొన్ని వైద్య సంస్థలు ఫైళ్లను డౌన్‌లోడ్‌ చేసుకోవటానికీ అనుమతిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డౌన్‌లోడ్‌ లింక్‌ మీద ట్యాప్‌ చేసి, యాడ్‌ టు వాలెట్‌ అండ్‌ హెల్త్‌’ను ఎంచుకోవాలి.

ఇప్పటికే కొవిడ్‌ రికార్డులను యాపిల్‌ హెల్త్‌ యాప్‌లో జోడించుకున్నా కూడా వీటిని యాపిల్‌ వాలెట్‌కు జతచేసుకోవచ్చు. ఇందుకోసం హెల్త్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, కింద ఎడమ వైపున కనిపించే ‘సమ్మరీ’ని ట్యాప్‌ చేయాలి. ‘వ్యాక్సినేషన్‌ రికార్డు’ కింద కనిపించే ‘యాడ్‌ టు వాలెట్‌’ను ఎంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని