అంతరిక్షం టు అవని

వీటి మధ్య ఒక సారూప్యత ఉంది. అదేంటో తెలుసా? ఇవన్నీ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, అలాగే నాసా కోసం ఇతరత్రా సంస్థలు రూపొందించిన పరిజ్ఞానాలతో తయారైన పరికరాలు, విధానాలే. అంతరిక్ష ప్రయోగాల కోసం తయారుచేసినప్పటికీ అనంతరం జన బాహుళ్యం వాడకంలోకి వచ్చినవే. వీటి గురించి నాసా ఏటా స్పిన్‌ఆఫ్‌ పేరుతో ప్రత్యేక సంచికలో ప్రస్తావిస్తుంటుంది. ఈ క్రమంలో తాజా సంచికను వెలువరించింది. ఇందులో మున్ముందు పరిశ్రమలు, సంస్థలకు బదలాయించటానికి సిద్ధంగా

Updated : 02 Feb 2022 09:52 IST

వైరస్‌ల వ్యాప్తిని అరికట్టే ఎయిర్‌ ప్యూరిఫయర్లు
గడ్డకట్టించే చలిలోనూ వెచ్చగా ఉంచే దుస్తులు
గదిలో నిట్ట నిలువుగా చేసే వ్యవసాయం
ఉష్ణోగ్రతను నియంత్రించే ప్రత్యేక సూట్లు

.. వీటి మధ్య ఒక సారూప్యత ఉంది. అదేంటో తెలుసా? ఇవన్నీ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, అలాగే నాసా కోసం ఇతరత్రా సంస్థలు రూపొందించిన పరిజ్ఞానాలతో తయారైన పరికరాలు, విధానాలే. అంతరిక్ష ప్రయోగాల కోసం తయారుచేసినప్పటికీ అనంతరం జన బాహుళ్యం వాడకంలోకి వచ్చినవే. వీటి గురించి నాసా ఏటా స్పిన్‌ఆఫ్‌ పేరుతో ప్రత్యేక సంచికలో ప్రస్తావిస్తుంటుంది. ఈ క్రమంలో తాజా సంచికను వెలువరించింది. ఇందులో మున్ముందు పరిశ్రమలు, సంస్థలకు బదలాయించటానికి సిద్ధంగా ఉన్న పరిజ్ఞానాల గురించీ వివరించింది. ప్రజలకు ఉపయోగపడగల వీటిల్లో కొన్నింటి విశేషాలేంటో చూద్దాం.


గుండెలయే పాస్‌వర్డ్‌

ఫోన్లు ఓపెన్‌ చేయటానికి వేలిముద్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటం చూస్తున్నదే. దీనికి బదులు గుండెలయతోనే ఆయా పరికరాలు ఓపెన్‌ అయితే? హార్ట్‌బీట్‌ఐడీ ఇలాంటిదే. బయోమెట్రిక్‌ ఐడెంటిటీ వెరిఫికేషన్‌ కోసం నాసా ఈ భవిష్యత్‌ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించింది. ఇది గుండెలయ తరంగాలతో ముడిపడిన విద్యుత్‌ సంకేతాల ఆధారంగా ఆయా వ్యక్తులను గుర్తిస్తుంది. వేలిముద్రల మాదిరిగానే మన గుండె కొట్టుకునే తీరూ భిన్నంగానే ఉంటుంది. దీన్ని కొన్ని స్టాటిస్టికల్‌ కొలమానాలతో పట్టుకోవచ్చు. ఇందుకోసం పరిశోధకులు దాదాపు 192 కొలమానాలను గుర్తించారు. ఇవి ఆయా వ్యక్తులను కచ్చితంగా పోల్చుకుంటాయి. ఒక్క ఫోన్లకే కాదు.. కంప్యూటర్‌, బ్యాంకు ఖాతాల పాస్‌వర్డ్‌ల వంటి వాటికీ వాడుకోవచ్చు. ఇది అందుబాటులోకి వస్తే సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లకు కాలం చెల్లినట్టే. హ్యాకర్ల బెడద కూడా తప్పుతుంది.


క్లౌడ్‌ రక్షణకు కొత్త సాఫ్ట్‌వేర్‌

ప్రస్తుతం క్లౌడ్‌, గ్రిడ్‌ కంప్యూటింగ్‌ వంటి వాటి ద్వారా కంప్యూటర్‌ ఆధారిత వ్యవస్థలు ఎంతగా విస్తరించాయో చెప్పనవసరం లేదు. అందుకే ఇవి తమకు తాము నియంత్రించుకోవటానికి అటనామిక్‌ సామర్థ్యాల అవసరమూ పెరుగుతోంది. ఈ దిశగానే శాస్త్రవేత్తలు కొత్తరకం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. మన శరీరంలో అవసరం లేనప్పుడు కణాలు తమకు తాము పనిచేయటం మానేస్తుంటాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ సరిగ్గా దీన్నే అనుకరిస్తుంది. ఒకదాంతో మరోటి అనుసంధానమై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే ఉపగ్రహాల భద్రతకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మొదట్లో అంతరిక్ష అవసరాలకే ఉద్దేశించినా తర్వాత క్లౌడ్‌, గ్రిడ్‌ ఆధారిత వ్యవస్థలతో కూడిన పరికరాలకూ విస్తరించారు. కంప్యూటర్‌ భద్రత, అంతరిక్ష ప్రయోగాలు, వాణిజ్య ఉపగ్రహ వ్యవస్థల వంటి రంగాల్లో దీన్ని వాడుకోవచ్చు.


స్వీయ మరమ్మతు అల్యూమినియం

లోహానికి పగుళ్ళు పడినా తిరిగి యథాస్థితికి వస్తే? చాలా బాగుంటుంది కదా. అందుకే కెనడీ స్పేస్‌ సెంటర్‌ పరిశోధకులు తనకు తానే మరమ్మతు చేసుకునే వినూత్న అల్యూమినియం మిశ్రమ పదార్థాన్ని రూపొందించారు. దీనిలో ఆకారాన్ని గుర్తుపెట్టుకునే రీఇన్‌ఫోర్స్‌మెంట్స్‌, నెమ్మదిగా కరిగే పదార్థాలుంటాయి. ఇవి వేడెక్కినప్పుడు పగుళ్ల వంటివి ఉంటే దగ్గరకు వచ్చి, అతుక్కుంటాయి. కరిగిన లోహం పగుళ్లలోకి చేరుకుంటుంది. ఇలా తనకు తానే మరమ్మతు అవుతుంది. విమానాల తలుపులు, ఫ్రేముల వంటి వాటి తయారీకిది ఎంతగానో ఉపయోగపడుతుంది. పగుళ్లు పడితే గాల్లో ప్రయాణిస్తున్నప్పుడే మరమ్మతు అవుతాయి మరి. పగుళ్లను సరిచేయటం కష్టమైన చోట్ల కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.


కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి ఇంధనం

వాతావరణంలోకి వెలువడక ముందే కార్బన్‌ డయాక్సైడ్‌ను ఒడిసి పట్టి ఇంధనంగా మారిస్తే? ఇటు భూమి వేడెక్కకుండా చూసుకోవచ్చు. అటు ఇంధన అవసరాలనూ తీర్చుకోవచ్చు. శిలాజ ఇంధనాల వాడకం తగ్గటం వల్ల వాతావరణ కాలుష్యమూ తగ్గుతుంది. ఏమ్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఇంజినీర్లు రూపొందించిన చవకైన పరికరం చేసే పని ఇదే. అతి పలుచటి మెటల్‌ ఆక్సైడ్‌ పొరలతో కూడిన ఇది ఫొటోఎలక్ట్రోకెమికల్‌ కణాన్ని సృష్టిస్తుంది. దీంతో కార్బన్‌ డయాక్సైడ్‌ను పరిశ్రమల వద్దే సేకరించొచ్చు. అనంతరం ఇంధనంగా మార్చుకోవచ్చు. ఇది అన్ని వాహనాలకు ఉపయోగపడుతుంది. తయారీ కోసం పూర్తిగా సౌరశక్తిని వాడుకోవటం వల్ల కాలుష్యమూ వెలువడదు. కార్బన్‌ను ఒడిసిపట్టే పరిజ్ఞానాలకు, ఫొటోఎలక్ట్రోకెమెస్ట్రీ, వాహన పరిశ్రమ, మెటీరియల్‌ సైన్సెస్‌ వంటి రకరకాల రంగాల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు.


ముడుచుకునే రోబో

చంద్రుడు, అంగారకుడి ఉపరితలాలపై ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు. సొరంగాలు, ఇరుకు గుహల వంటి చోట్లకు వెళ్లటం వ్యోమగాములకు కుదరదు. అడుగు పెడితే ఏమవుతుందో? ప్రమాదం ముంచుకురావచ్చు. ఇలాంటి ఉపద్రవాలను తప్పించుకోవటానికే వినూత్నమైన రోబోను తయారుచేశారు. దీని పేరు ఎ-పఫర్‌ (అటనమస్‌ పాప్‌ అప్‌ ఫ్లాట్‌ ఫోల్డింగ్‌ ఎక్స్‌ప్లోరర్‌ రోబో). ఓరిగామీ స్ఫూర్తితో రూపొందించిన ఇది అవసరమైనప్పుడు తనకు తానే ముడుచుకోగలదు. తిరిగి యథాస్థితికి రాగలదు. అంతరిక్షంలోనే కాదు.. భూమ్మీద గుహల వంటి చోట్ల రక్షణ కార్యకలాపాలకూ వాడుకోవచ్చు. చమురు, గ్యాస్‌ అన్వేషణ రంగంలోనూ ఉపయోగపడుతుంది.


పాక్షిక పోషక సరఫరా వ్యవస్థ

విత్తనం మొలకెత్తటానికి, మొక్కలు పెరగటానికి వాతావరణం సరిగా ఉండాలి. మరీ వేడిగా గానీ మరీ తడిగా గానీ ఉండకూడదు. అందుకే అంతరిక్షంలో మొక్కలను పెంచటం చాలా కష్టమైన పని. దీన్ని సుసాధ్యం చేయటానికి కెనడీ స్పేస్‌ సెంటర్‌ పాక్షిక పోషక సరఫరా వ్యవస్థను (పాండ్స్‌) తయారుచేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మొక్కలకు నీరు, పోషకాలు సరిగా అందేలా చూడటం దీని ఉద్దేశం. ఇది విత్తనాలను, మొక్కలను నాటిన కుండీలకు ఒత్తుల వంటి వాటి ద్వారా నీరు, పోషకాలను చేరవేస్తుంది. ఇలా నిరంతరం నీరు, పోషకాలు అందటం వల్ల మొక్కలకు ఆక్సిజన్‌ సరఫరా కూడా మెరుగవుతుంది. దీన్ని భూమ్మీద వాడుకోవటానికీ సిద్ధంగా ఉంచారు. వాణిజ్యపరంగా భవనాల్లో వ్యవసాయం చేయటానికి.. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణిత శాస్త్రాల విద్యార్థులకు ఉపకరణంగానూ ఉపయోగపడగలదు.


దుమ్ము పట్టని తామర పొర

అంతరిక్షంలో చంద్రుడు, తోకచుక్కలు, ఇతర గ్రహాల వంటి వాటి మీద పేరుకునే దుమ్ము చాలా ప్రమాదకరం. ఇది అంతరిక్ష వాహనాలకు చెందిన సున్నితమైన ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రోబోటిక్‌ ప్రయోగాలకు అంటుకుంటే వాటినీ దెబ్బతీస్తుంది. వ్యోమగాములు లోపలికి పీల్చుకుంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ ఇబ్బందిని తొలగించటానికి గొడార్డ్‌ స్పేస్‌ ఫ్లయిట్‌ సెంటర్‌ పరిశోధకులు వినూత్నమైన తామరాకు మాదిరి నానో-టెక్చర్డ్‌ పదార్థాన్ని రూపొందించారు. పారదర్శకంగా ఉండే దీన్ని ఎలాంటి వస్తువులు, పరికరాల మీదైనా చల్లుకోవచ్చు. అప్పుడది పొరలాగా ఏర్పడి దుమ్ము అంటుకోనీయకుండా కాపాడుతుంది. నీటిని సైతం అంటుకోనీయదు. దీన్ని అంతరిక్ష ప్రయోగాలు, విమానాలకే కాదు.. దుస్తులు, వాహనాలు, ఔషధాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, భవనాలు, సౌర విద్యుత్‌ పరికరాల వంటి వాటికీ వాడుకోవచ్చు. తేలికగా శుభ్ర పరచటానికి వీలుకాని పరికరాలకు ఇదెంతగానో ఉపయోగపడుతుంది.


నీటిలో స్వయం విద్యుత్‌ వాహనం

ది నీటిలోపల ప్రయాణించే వాహనం. తనకు తానే విద్యుత్‌ తయారుచేసుకుంటుంది. ఈ వినూత్న పరిజ్ఞానంతో కూడిన వాహనాన్ని జెట్‌ ప్రొపల్షన్‌ లేబరేటరీ పరిశోధకులు రూపొందించారు. ఇది సముద్ర జలాల ఉష్ణోగ్రతల మధ్య తేడాలను వినియోగించుకుంటూ ముందుకు కదులుతుంది. నీటిలో ప్రయాణిస్తూనే, పక్కలకు ఒరుగుతున్నప్పుడు ప్రొపెలర్‌ టర్బయిన్‌ ఆన్‌ అవుతుంది. దీంతో విద్యుత్తు తయారవుతుంది. ఈ విద్యుత్తును బ్యాటరీ రిఛార్జ్‌కూ వాడుకోవచ్చు. ఫలితంగా నీటిలోంచి బయటకు రాకుండా ఏళ్లకొద్దీ లోపలే ఉండొచ్చు. ఒకవేళ వేగంగా ముందుకు కదలాలంటే ప్రొపెలర్‌ను ఆఫ్‌ చేసుకోవచ్చు కూడా. సముద్ర, భూ విజ్ఞాన శాస్త్రాల అధ్యయనానికి.. నీటిలోపల నిఘా అవసరాలకు దీన్ని వాడుకోవచ్చు.


కీటక నిరోధక పొర

యంత్రాలకు కీటకాలు అతుక్కుపోతే పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంది. వీటిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే విమానాల సామర్థ్యమూ తగ్గుతుంది. ఈ సమస్యను తప్పించటానికి లాంజ్లే రీసెర్చ్‌ సెంటర్‌ పరిశోధకులు నీటిని వికర్షించే జిగురు పదార్థాలను ఆవిష్కరించారు. వీటిని పరికరాల మీద రాస్తే కీటక నిరోధక పొరగా ఉపయోగపడగలవు. బలంగా, మన్నికగా ఉండటం వల్ల చాలాకాలం పనిచేస్తాయి. విమాన యంత్రాలు, గాలి మరల వంటి వాటికి కీటకాలు అతుక్కొని, దెబ్బతినకుండా ఇవి కాపాడతాయి.


మంటలకు కాలకుండా..

టెంట్‌లో ఉన్నారు. హఠాత్తుగా బయట అగ్ని ప్రమాదం జరిగింది. కానీ టెంట్‌కు ఏమీ కాలేదు. సురక్షితంగా అలాగే ఉంది.  అదెలా? లాంజ్లే రీసెర్చ్‌ సెంటర్‌ పరిశోధకులు రూపొందించిన బ్లాంకెట్‌ అందుబాటులోకి వస్తే ఇది సాధ్యమే. ఇది 2,000 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రతలోనూ చెక్కు చెదరదు. వివిధ పొరలతో కూడిన ఇది చాలా తేలికగా ఉంటుంది. ఎటైనా తేలికగా వంగుతుంది. అగ్ని ప్రమాదం నుంచి పరికరాలు, వ్యక్తులను కాపాడటానికిది ఎంతగానో తోడ్పడగలదు. అపార్ట్‌మెంట్లలో గోడలకు రక్షణ పొరగానూ ఉపయోగపడగలదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని