కంప్యూటర్‌ మీద ఫోన్‌ తెర

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ తెరను పీసీ, మ్యాక్‌ మీద చూడాలని అనుకుంటున్నారా? ఇందుకోసం ఉచిత మార్గముంది. దీంతో కంప్యూటర్‌కు ఫోన్‌ తెరను తేలికగా షేర్‌ చేసుకోవచ్చు.పీసీకి కనెక్టయిన ప్రొజెక్టర్‌తో ప్రజెంటేషన్‌ ఇస్తుండొచ్చు. లేదూ పెద్ద తెర మీద ఫొటోలు

Published : 09 Feb 2022 00:30 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ తెరను పీసీ, మ్యాక్‌ మీద చూడాలని అనుకుంటున్నారా? ఇందుకోసం ఉచిత మార్గముంది. దీంతో కంప్యూటర్‌కు ఫోన్‌ తెరను తేలికగా షేర్‌ చేసుకోవచ్చు.

పీసీకి కనెక్టయిన ప్రొజెక్టర్‌తో ప్రజెంటేషన్‌ ఇస్తుండొచ్చు. లేదూ పెద్ద తెర మీద ఫొటోలు చూడాలని అనుకుంటుండొచ్చు. యాప్‌ డెవలపర్లయితే మాటిమాటికీ ఫోన్‌ వంక చూడాల్సిన పనిలేకుండా కోడ్‌ ఫలితాలను చెక్‌ చేసుకోవాలని భావించొచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే పీసీ మీద  ఆండ్రాయిడ్‌ తెరను చూసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంటుంది. ఫోన్‌లో ఎలాంటి ఇన్‌స్టలేషన్లతో పనిలేకుండా తేలికగా, త్వరగా దీన్ని చేసుకోవచ్చు. ఎస్‌సీఆర్‌సీపీవై సాఫ్ట్‌వేర్‌ ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. దీంతో యూఎస్‌బీ ద్వారా ఉచితంగా పీసీ మీద ఫోన్‌ తెరను చూసుకోవచ్చు. ఇది విండోస్‌, మ్యాక్‌ఓఎస్‌, లైనక్స్‌.. ఇలా అన్నిరకాల డెస్క్‌టాప్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లకు పనికొస్తుంది. పీసీ మీద మొబైల్‌ డిస్‌ప్లే అవుతుండగా స్క్రీన్‌ రికార్డింగు కూడా చేసుకోవచ్చు. లైనక్స్‌ వాడేవారైతే ఎస్‌సీఆర్‌సీపీవైతో ఫోన్‌ తెరను వెబ్‌క్యామ్‌గానూ ఉపయోగించుకోవచ్చు.

  ఎలా చేయాలి?

* ముందుగా పీసీలో ఇంటర్నెట్‌ ద్వారా https://github.com/Genymobile/scrcpy వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. కిందికి స్క్రోల్‌ చేస్తూ ఆయా ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు తగిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. జిప్‌ ఫైల్‌ను ఎక్స్‌ట్రాక్ట్‌ చేసుకొని, ఫోల్డర్‌లో పెట్టుకోవాలి.

కావాలంటే ఎస్‌సీఆర్‌సీపీవైతో వైర్‌లెస్‌గానూ ఫోన్‌ తెరను పీసీతో కనెక్ట్‌ చేయొచ్చు. కాకపోతే రెండు పరికరాలూ ఒకే వైఫైతో కనెక్ట్‌ అయ్యిండాలి. ఇందుకు ఎయిర్‌డ్రాయిడ్‌ యాప్‌ను రెండింటిలోనూ డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. లేదా క్రోమ్‌లో ఎయిర్‌డ్రాయిడ్‌ బ్రౌజర్‌ యాప్‌నైనా వాడుకోవచ్చు. తర్వాత పీసీలో, ఫోన్‌లో ఎయిర్‌డ్రాయిడ్‌లో రిజిస్టర్‌ చేసుకొని, లాగిన్‌ కావాలి.

* ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఎయిర్‌డ్రాయిడ్‌లో ‘మీ’ విభాగం ద్వారా ‘సెక్యూరిటీ అండ్‌ రిమోట్‌ ఫీచర్స్‌’లోకి వెళ్లాలి. ‘స్క్రీన్‌ మిర్రరింగ్‌’ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి.

* యూఎస్‌బీ కేబుల్‌తో ఫోన్‌ను, పీసీని కనెక్ట్‌ చేయాలి.

* ఫోన్‌లో యూఎస్‌బీ డీబగింగ్‌ మోడ్‌ను ఎనేబుల్‌ చేసుకుంటేనే కనెక్షన్‌ సాధ్యమవుతుంది. కాబట్టి ముందే ఫోన్‌ను ఈ మోడ్‌లో ఉంచుకోవాలి.

* తర్వాత పీసీలోని ఫోల్డర్‌లో ఎస్‌సీఆర్‌సీపీవై యాప్‌ను రన్‌ చేయాలి. దీంతో పీసీ మీద ఫోన్‌ తెర దానంతటదే ప్రత్యక్షమవుతుంది. ఫోన్‌ తెర మీద మనం చేసే పనులు పీసీ మీదా కనిపిస్తాయి. పీసీలోనూ ఫోన్‌ తెరను మౌజ్‌తో కదిలించొచ్చు. టచ్‌ స్క్రీన్‌ అయితే చేత్తోనూ కదిలించొచ్చు.

వైర్‌లెస్‌గానూ..

* పీసీలో ‘ఎయిర్‌డ్రాయిడ్‌ వెబ్‌’ ద్వారా మిర్రరింగ్‌ను ఎంచుకోవాలి.

* ఫోన్‌లో అవసరమైన అనుమతి ఇచ్చి ‘స్టార్ట్‌ నౌ’ బటన్‌ను క్లిక్‌ చేయాలి. దీంతో ఫోన్‌ తెర పీసీ మీద కనిపిస్తుంది. యూఎస్‌బీ కన్నా ఇది మరింత తేలికైన పద్ధతి. పైగా ఇందులో ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌, కాంటాక్ట్‌ కాపీ, రిమోట్‌ టెక్స్టింగ్‌, బ్యాకప్స్‌ వంటి ఫీచర్లూ అందుబాటులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని