పాత ఫోన్‌ ప్రక్షాళన!

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ పాతదై ఉండొచ్చు. దాన్ని అమ్మేసి కొత్తది కొనుక్కోవాలని అనిపించొచ్చు. లేదూ ఎవరికైనా ఫోన్‌ను ఇచ్చేస్తుండొచ్చు. ఇలాంటప్పుడు డేటాను పూర్తిగా తొలగించుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీ రీసెట్‌ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారేమో. ఫ్యాక్టరీ రీసెట్‌ చేసినా సమాచారం ఇతరుల చేతికి చిక్కే అవకాశం లేకపోలేదు. మరి ఫోన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయటమెలా?

Updated : 16 Feb 2022 03:24 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ పాతదై ఉండొచ్చు. దాన్ని అమ్మేసి కొత్తది కొనుక్కోవాలని అనిపించొచ్చు. లేదూ ఎవరికైనా ఫోన్‌ను ఇచ్చేస్తుండొచ్చు. ఇలాంటప్పుడు డేటాను పూర్తిగా తొలగించుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీ రీసెట్‌ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారేమో. ఫ్యాక్టరీ రీసెట్‌ చేసినా సమాచారం ఇతరుల చేతికి చిక్కే అవకాశం లేకపోలేదు. మరి ఫోన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయటమెలా?

ప్పుడప్పుడు ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ చేయటం మంచి పద్ధతే. దీంతో ఫోన్‌లోని చెత్త అంతా తొలగిపోతుంది. ఫోన్‌ ఖాళీ అయ్యి మరింత స్పేస్‌ అందుబాటులోకి వస్తుంది. ఫోన్‌ స్టోరేజీలో గానీ ఎస్‌డీ కార్డులో గానీ మాల్వేర్‌, బగ్స్‌, వైరస్‌లతో కూడిన హానికర ఫైళ్లు ఉన్నా తొలగిపోతాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను అమ్మినప్పుడు కూడా చాలామంది చేసే పని ఇదే. ఫ్యాక్టరీ సెటింగ్స్‌ను రీసెట్‌ చేయటం వల్ల ఫోన్‌ తిరిగి సరికొత్తగా, ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చినప్పటి మాదిరిగానే తయారవుతుంది. ఫోన్‌ ఈమెయిళ్లు, టెక్స్ట్‌ సందేశాలు, ఫొటోలు, వీడియోలు అన్నీ కనుమరుగవుతాయి. కాకపోతే ఇక్కడ ఓ తిరకాసు ఉంది. తొలగించిన ఈమెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లు, ఫొటోలు, సెల్ఫీల వంటి వాటిని మామూలు సాఫ్ట్‌వేర్‌తోనూ తిరిగి వెలికి తీసే అవకాశముంది. వీటిల్లో ఏదైనా వ్యక్తిగత, ముఖ్యమైన సమాచారం ఉన్నట్టయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అందువల్ల ఫ్యాక్టరీ రీసెట్‌ చేసినా కూడా ఫోన్‌లోని డేటా ఇతరుల చేతికి చిక్కకుండా, సంరక్షించుకోవటం రోజురోజుకీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. సాధారణంగా మనం పరికరంలోంచి ఏదైనా ఫైల్‌ను డిలీట్‌ చేసినప్పుడు అది ట్రాష్‌ లేదా బిన్‌లోకి చేరుతుంది. దీంతో అది పూర్తిగా డిలీట్‌ అయిపోయిందనే చాలామంది భావిస్తుంటారు. నిజానికి డిలీట్‌ అయినప్పటికీ దీని ప్రతిరూపం క్లౌడ్‌లో అలాగే ఉంటుంది. ముఖ్యంగా గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ డిలీట్‌ చేసిన ఫొటోలు, వీడియోలను 60 రోజుల వరకు స్టోర్‌ చేసి పెడుతుంది. ట్రాష్‌లోంచి వీటిని మనకు మనం తొలగించకపోతే తిరిగి వెలికి తీసే అవకాశముంది.

ఫోన్‌ను ఎన్‌క్రిప్షన్‌ చేసుకోవాలి

ఫ్యాక్టరీ రీసెట్‌ చేసిన తర్వాత కూడా సమాచారం వేరేవాళ్లకు చిక్కకుండా చూసుకోవటానికి ఇతరత్రా పద్ధతులూ ఉన్నాయి. ముందుగా ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్‌ చేసుకోవాలి. దీంతో డేటా అంతా ముక్కలు ముక్కలవుతుంది. లాక్‌ అవుతుంది. పాస్‌వర్డ్‌ లేకపోతే దీన్ని చదవటానికి కుదరదు. ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మల్లోతో కూడిన పరికరాలు చాలావరకు ఎన్‌క్రిప్షన్‌ భద్రతతోనే కూడుకొని ఉంటాయి. అయితే కొన్ని పాత వర్షన్‌ పరిరకాల్లో ఇది ఉండకపోవచ్చు. ఒకవేళ ఆండ్రాయిడ్‌ 5.0 లాలీపాప్‌, అంతకన్నా తక్కువ ఎండ్‌ ఫోన్‌ను వాడుతున్నట్టయితే ఎన్‌క్రిప్షన్‌ను సపోర్టు చేస్తుందో లేదో చూసుకోవాలి. ఇందుకోసం సెటింగ్స్‌ ద్వారా సెక్యూరిటీ విభాగంలోకి వెళ్లి ‘ఎన్‌క్రిప్ట్‌ ఫోన్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇది పూర్తి కావటానికి గంట, అంతకన్నా ఎక్కువ సమయమే పట్టొచ్చు. కాబట్టి ఫోన్‌ను ఛార్జింగ్‌ పెట్టుకొని ఉంచుకోవటం మంచిది. ఫోన్‌ ఎన్‌క్రిప్ట్‌ అయ్యాక యథావిధిగా ఫ్యాక్టరీ రీసెట్‌ చేసుకోవాలి.

యాప్స్‌ సాయం

సున్నితమైన సమాచారాన్ని పరికరం నుంచి శాశ్వతంగా తొలగించుకోవటానికి ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ లేదా ఫైల్‌ మేనేజర్‌ యాప్‌ల సాయమూ తీసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్ల కోసం ఉచిత ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్లు చాలానే ఉన్నాయి. అయితే గూగుల్‌కు చెందిన ఫైల్‌ యాప్‌ను ఉపయోగించటం మంచిది. ఫైల్‌ యాప్‌ నుంచి ఫొటో లేదా వీడియోను ఎంచుకొని, ట్రాష్‌ బటన్‌ను నొక్కాలి. లేదూ మూడు చుక్కలను నొక్కి, డిలీట్‌ను ఎంచుకోవాలి. తర్వాత కన్‌ఫర్మ్‌ చేసుకొని డిలీట్‌ చేసుకోవాలి. ఎన్‌క్రిప్షన్‌ను సపోర్టు చేయని పాత వర్షన్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్ల విషయంలో ఐష్రెడ్డర్‌, ష్రెడ్డిట్‌, డేటా ఎరేజర్‌ వంటి యాప్స్‌ వాడుకోవచ్చు. ఇవన్నీ ప్లేస్టోర్‌లో ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించటం చాలా తేలిక. అన్నీ పేటెంట్‌ కలిగి ఉన్నవే. సైనిక భద్రత ప్రమాణాలకు అనుగుణమైనవే.

పీసీతో మరింత సురక్షితంగా..

ఇంకా సురక్షితంగా ఆండ్రాయిడ్‌ ఫైళ్లను డిలీట్‌ చేయాలనుకుంటే విండోస్‌ పీసీ సాయం తీసుకోవచ్చు. యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేయాలి. ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ను తెరచి, ‘దిస్‌ డివైస్‌’ను ఎంచుకోవాలి. ఫోన్‌ డ్రైవ్‌ గుర్తు మీద డబుల్‌ క్లిక్‌ చేయాలి. కొన్నిసార్లు ఈ డ్రైవ్‌ ఖాళీగా ఉన్నట్టు కనిపించొచ్చు. ఇలాంటి సమయంలో సెటింగ్స్‌లోకి వెళ్లి కనెక్టెడ్‌ డివైస్‌ ద్వారా ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. డిలీట్‌ చేయాల్సిన ఫైళ్లను ఎంచుకొని తొలగించుకోవచ్చు. ఒకవేళ ఫొటోలు లేదా వీడియోలను డిలీట్‌ చేయాలనుకుంటే డీసీఐఎం ఫోల్డర్‌ను ఓపెన్‌ చేసి, కెమెరా విభాగంలోకి వెళ్లాలి. ఎంచుకున్న ఫొటో, వీడియో మీద రైట్‌ క్లిక్‌ చేయాలి. డిలీట్‌ ఆప్షన్‌ను ఎంచుకొని శాశ్వతంగా డిలీట్‌ చేసుకోవచ్చు. డిలీట్‌ అయిన ఫైళ్లు రీసైకిల్‌ బిన్‌లోకి చేరకుండానే కనుమరుగై పోతాయి.


జంక్‌ డేటా ఓవర్‌రైట్‌

తొలగిపోయిన డేటాను మరింత నిరుపయోగంగానూ మార్చుకోవటం మంచిది. కొత్త జంక్‌ డేటాతో ఓవర్‌రైట్‌ అయ్యేలా చేయటం ద్వారా దీన్ని సాధించొచ్చు. ఫ్యాక్టరీ రీసెట్‌ అయ్యాక ఎలాంటి గూగుల్‌ ఖాతాతో సైనిన్‌ కాకుండా పరికరాన్ని సెటప్‌ చేసుకోవాలి. ఫోన్‌ స్టోరేజీ అంతా నిండుకునేంతవరకు హై రెజల్యూషన్‌లో వీడియోలను రికార్డు చేయాలి. తర్వాత మరోసారి ఫ్యాక్టరీ రీసెట్‌ చేయాలి. అప్పుడు డేటాను తిరిగి పొందటం దాదాపు అసాధ్యమై పోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని