చంద్రుడి చెట్లు!

వ్యోమనౌకతో అంతరిక్షంలోకి   పంపించిన విత్తనాలను వివిధ చోట్ల నాటారు. వీటిల్లో 83 మొలకెత్తి, చెట్లుగా పెరిగాయి.చాలారకాల చెట్ల గురించి వినే ఉంటారు. చూసే ఉంటారు. మరి చంద్రుడి చెట్ల గురించి తెలుసా? అవేంటి అంటారా? చంద్రుడి మీదికి

Updated : 16 Feb 2022 06:54 IST

వ్యోమనౌకతో అంతరిక్షంలోకి   పంపించిన విత్తనాలను వివిధ చోట్ల నాటారు. వీటిల్లో 83 మొలకెత్తి, చెట్లుగా పెరిగాయి.

చాలారకాల చెట్ల గురించి వినే ఉంటారు. చూసే ఉంటారు. మరి చంద్రుడి చెట్ల గురించి తెలుసా? అవేంటి అంటారా? చంద్రుడి మీదికి తీసుకెళ్లి, తిరిగి తెచ్చిన విత్తనాల నుంచి పుట్టుకొచ్చిన చెట్లు! అందుకే వీటిని మూన్‌ ట్రీస్‌ అని పిలుచుకుంటారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 1971లో చంద్రుడి మీదికి అపోలో 14 వ్యోమనౌకను పంపించింది. ఇది చంద్రుడిని 34 సార్లు చుట్టి, తిరిగి భూమికి చేరుకుంది. ఈ వ్యోమనౌకతో నాసా మరో చిత్రమైన ప్రయోగాన్నీ చేపట్టింది. వ్యోమగాములతో పాటు 400-500 విత్తనాలనూ అంతరిక్షంలోకి పంపించింది. ఇద్దరు వ్యోమగాములు చంద్రుడి మీద దిగి నడవగా.. ఒకరు వ్యోమనౌకలోనే ఉండిపోయారు. విత్తనాలు వ్యోమనౌకలోని పెట్టెలోనే ఉంచారు. భూమికి తిరిగి వచ్చాక శుభ్రం చేస్తుండగా పెట్టె పేలిపోయింది. దీంతో చాలా విత్తనాలు దెబ్బతిన్నాయి. మిగిలిన విత్తనాలను అమెరికా, యూరప్‌లోని వివిధ దేశాల్లో నాటారు. వీటిల్లో 83 విత్తనాలు మొలకెత్తి చెట్లుగా మారాయి. గురుత్వాకర్షణ రహిత స్థితికి గురైనవి మామూలు విత్తనాల మాదిరిగానే మొలకెత్తుతాయా? వీటి నుంచి పుట్టుకొచ్చిన చెట్లు భూమి మీద మొలచిన చెట్ల మాదిరిగానే ఎదుగుతాయా? అనేది పరిశీలించటం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. అయితే వీటి గురించి నాసాతో పాటు అంతా మరచిపోయారు. కానీ ఒక మాజీ వ్యోమగామి 1996లో వ్యక్తిగత ఆసక్తితో ఆరా తీసి మొత్తం 80 చంద్రుడి చెట్లను గుర్తించారు. వీటిల్లో 21 చెట్లు అప్పటికే చనిపోయాయి. తర్వాత మరో 3 చెట్లనూ వెతికి పట్టుకోగలిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని