ఎరుపు సాగు

పంట దిగుబడి పెరగటానికి రకరకాల ఎరువులు వాడటం కొత్తేమీ కాదు. కానీ ఉచితంగా లభించే కాంతి సాయంతోనూ దిగుబడి పెంచుకోగలిగితే? తేలికైన పరిజ్ఞానంతో దీన్ని సుసాధ్యం చేయొచ్చని ఆస్ట్రేలియా పరిశోధకులు నిరూపిస్తున్నారు.

Published : 23 Feb 2022 01:18 IST

పంట దిగుబడి పెరగటానికి రకరకాల ఎరువులు వాడటం కొత్తేమీ కాదు. కానీ ఉచితంగా లభించే కాంతి సాయంతోనూ దిగుబడి పెంచుకోగలిగితే? తేలికైన పరిజ్ఞానంతో దీన్ని సుసాధ్యం చేయొచ్చని ఆస్ట్రేలియా పరిశోధకులు నిరూపిస్తున్నారు. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చటానికిది తోడ్పడగలదని భావిస్తున్నారు. పంటల రుచి, పోషకాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది తెలుసుకోవటానికి ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరమున్నప్పటికీ ప్రస్తుతానికైతే దిగుబడి విషయంలో మంచి ఫలితమే కనిపిస్తుండటం విశేషం.

మొక్కల ఎదుగుదలలో ఎండలోని ఎర్ర కాంతిదైర్ఘ్యాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. ఇవి పత్ర హరితాన్ని తయారుచేసుకునేలా ఆకులను ప్రేరేపిస్తాయి మరి. కిరణజన్య సంయోగక్రియకు పత్ర హరితమే కీలకం మరి. అందుకే కొన్ని వ్యవసాయ క్షేత్రాల్లో ఎర్ర ఎల్‌ఈడీ లైట్లతో పంట దిగుబడి పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. డెన్మార్క్‌లోని నోర్డిక్‌ హార్వెస్ట్‌ క్షేత్రంలో నిలువుగా 14 అంతస్థుల్లో పంటలను సాగు చేయటమే కాదు. దీని లోపల లేత గులాబీ రంగు కాంతిని వెలువరించే లైట్లనూ అమర్చారు. మొక్కలకు కార్బన్‌ డయాక్సైడ్‌ అందేలా ఏర్పాట్లు చేశారు. హానికర క్రిములు దరిజేరకుండా చేయటం వల్ల ఎలాంటి పురుగు మందుల అవసరమూ ఉండదు. మామూలు వ్యవసాయ క్షేత్రాలతో పోలిస్తే దీనికి 250 రెట్లు, హరిత పందిరి సాగుతో పోలిస్తే 80 రెట్ల తక్కువ నీరు అవసరమవుతుంది. అయితే ఇలాంటి ప్రత్యామ్నాయ సాగుకు చాలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎల్‌ఈడీ లైట్లను అమర్చుకోవటం ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇవి వెలగటానికి నిరంతరం విద్యుత్తు ఉండాలి. లైట్లు వెలిగినా సూర్యరశ్మి మాదిరిగా మొక్కలపై అంతటా ఒకేలా కాంతి పడదు. ఇలాంటి ఇబ్బందులను పరిష్కరించటానికే ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూసౌత్‌ వేల్స్‌ పరిశోధకులు ఎల్‌లీఫ్‌ అనే పారదర్శక ప్లాస్టిక్‌ పదార్థాన్ని సృష్టించారు.

ఏమిటిది? ఎలా పనిచేస్తుంది?

ఫ్లోరోసెంట్‌ రంగుతో కూడిన ఎల్‌లీఫ్‌ ఎండలోని పచ్చ కాంతిదైర్ఘ్యాలను (ఇవి మొక్కల ఎదగటానికి అంత ముఖ్యం కాదు) పాక్షికంగా గ్రహించి వాటిని ఎర్ర కాంతిదైర్ఘ్యాలుగా మారుస్తుంది. దీన్ని పందిరి వ్యవసాయ క్షేత్రంలో పైన అమర్చాల్సి ఉంటుంది. దీనిలోంచి కిందికి వచ్చే కాంతి లోపల పడిన తర్వాత లేత గులాబీ రంగులోకి మారుతుంది. దీని మూలంగా పంటల దిగుబడి 37% పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు. అందుకే ఇప్పుడు వివిధ రకాల పంటలపై దీన్ని విస్తృతంగా పరీక్షించటం ఆరంభించారు. దీనికి ఖర్చు తక్కువ కావటం, ఇప్పటికే ఉన్న పందిరి వ్యవసాయ క్షేత్రాల్లో తేలికగా అమర్చుకునే వీలుండటం వల్ల మున్ముందు బాగా ఆదరణ పొందగలదని భావిస్తున్నారు.

ఇబ్బందులేవీ ఉండవా?

ఎల్‌లీఫ్‌తో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ఆకుపచ్చని కాంతిని తొలగించి మొక్కలకు మరింత ఎక్కువ ఎర్ర కాంతిని అందిస్తే కొన్ని పంటలకు హాని కలగొచ్చు. దీని కింద సాగు చేసిన లెట్యూస్‌ ఆకులకు ఒకింత నారింజ వన్నె వచ్చినట్టు గుర్తించారు. పంటపై పడే కాంతి మారటం వల్ల వీటిల్లోని కెరొటినాయిడ్లు, ఇతర వర్ణద్రవ్యాల్లో మార్పులు తలెత్తటం దీనికి కారణమయ్యిండొచ్చని భావిస్తున్నారు. పోషకాలు, రుచిలోనూ ఏవైనా మార్పులు జరిగాయేమో చూడటానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. తృణధాన్యాల పంటలపై ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదీ ఇంకా తేలలేదు. ఏదేమైనా పంట దిగుబడి పెరగటం మాత్రం కొత్త ఆశలు రేపుతోంది.

విస్తృత పరీక్షలు

వివిధ పంటలకు అనుగుణంగా రకరకాల రంగులను రూపొందించటంపైనా పరిశోధకులు కృషి చేస్తున్నారు. ప్రపంచంలో ఆయా చోట్ల మాత్రమే పండే పంటలనూ దీంతో స్థానికంగా సాగు చేసుకునే వీలుంటుందని భావిస్తున్నారు. ఉదాహరణకు- ఇండోనేషియాలో పండే డచ్‌ స్ట్రాబెర్రీ దిగుబడిని ఎల్‌లీఫ్‌తో పెంచటం సాధ్యమేనని ఇటీవల నిరూపించారు. పగటి వేళ తక్కువగా ఉండే వాతావరణాన్ని అనుకరిస్తూ ఎండలోని ఎర్ర కాంతిదైర్ఘ్యాలను మరింత ఎర్రగా మార్చటం ద్వారా దీన్ని సాధించారు. అంటే నెదర్లాండ్స్‌లోనూ ఇండోనేషియాలో మాదిరి వాతావరణం ఉన్నట్టుగానే మొక్కలు భావించేలా బురిడీ కొట్టించారన్నమాట. ఇది విస్తృతంగా ఉపయోగపడుతున్నట్టు తేలితే ఏ పంటనైనా ఎక్కడైనా పండించుకునే వీలుంటుంది. దీంతో రవాణా ఖర్చులూ గణనీయంగా తగ్గుముఖం పడతాయి.


సముద్ర నీటి వరి!

ది సముద్ర తీర ప్రాంతం. నీరంతా ఉప్పుమయం. మట్టిలో క్షార గుణం కారణంగా పంటలు పండటం దాదాపు అసాధ్యం. మున్ముందు ఇలాంటి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఉప్పు నీటితోనూ సాగు చేయగల వరిని చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. ‘సముద్ర నీటి వరి’గా పిలుచుకుంటున్న ఇది ఆహార భద్రత కల్పించటానికి దోహదం చేయగలదని భావిస్తున్నారు.

రోజురోజుకీ భూతాపం, సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అందుకే సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు నీటితో సాగు చేయగల పంటల ఆవశ్యకత కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చైనా శాస్త్రవేత్తలు అడవిలో పెరిగే వరి ధాన్యంపై దృష్టి సారించారు. ఉప్పు, క్షార గుణాలనూ తట్టుకునే ఇందులో ఒక జన్యువు అతిగా వ్యక్తమవుతుంటుంది. దీంతోనే కొత్త సముద్ర నీటి వరిని సృష్టించారు. దీన్ని అక్కడి పంట పొలాల్లో పరీక్షించగా ఒక ఎకరానికి 4.6 మెట్రిక్‌ టన్నుల దిగుబడి రావటం విశేషం. ప్రామాణిక వరి వంగడాల సగటు జాతీయోత్పత్తితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ!

ఉప్పును తట్టుకొని మనగలిగే వరి మీద చైనా 1950ల్లోనే అధ్యయనాలు ఆరంభించింది. కానీ చైనా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త యువాన్‌ లాంగ్‌పింగ్‌ 2012లో దీని కోసం అన్వేషణ మొదలెట్టిన తర్వాతే సముద్ర నీటి వరి అనే పదం విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడ 2016లో ఆరు ప్రాంతాల్లో ఉప్పు నీటిని తట్టుకునే వరి రకాల సాగుపై పరీక్షలు ఆరంభించారు. ఓ ప్రత్యేక పరిశోధన కేంద్రాన్నీ నెలకొల్పారు. 67 లక్షల హెక్టార్ల బంజరు భూమిలో 3కోట్ల టన్నుల వరిని పండించాలనేదీ దీని లక్ష్యం. ఇలాంటి వరితో 8కోట్లకు పైగా మందికి ఆహార భద్రత కల్పించాలని భావిస్తున్నారు. వాతావరణ మార్పుతో దీన్ని ఇంకాస్త త్వరగా సాధించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మన భూ వాతావరణ ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేరకు పెరిగితే ఈ శతాబ్దం చివరికి సముద్ర మట్టాలు 59 సెంటీమీటర్లు పెరగొచ్చని అంచనా. ఇది సముద్ర తీర ప్రాంతాలకు పెను ముప్పుగా వాటిల్లుతుంది. సాధారణంగా ఉప్పుతో కూడిన మట్టిలో వరి పండించాలంటే సంప్రదాయ పద్ధతిలో మంచి నీటిని పారించి ఉప్పు మోతాదు తగ్గిస్తుంటారు. దీనికి పెద్దమొత్తంలో మంచి నీరు అవసరం. అంత కష్టపడ్డా దిగుబడి అంతంతే. కొత్త సముద్ర నీటి వరి వంగడంతో ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా సాగు చేసుకోవటానికి వీలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని