అంగారకుడి మీద ఏడాది!

మొత్తం 47.1 కోట్ల కిలోమీటర్ల దూరం. ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం. క్షేమంగా దిగుతుందో లేదోననే సంశయం. అన్నింటినీ అధిగమించి పర్‌సివియెరెన్స్‌ రోవర్‌ అంగారకుడి మీద దిగింది. చూస్తుండగానే ఏడాది పూర్తి చేసుకుంది.

Published : 23 Feb 2022 01:29 IST

మొత్తం 47.1 కోట్ల కిలోమీటర్ల దూరం. ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం. క్షేమంగా దిగుతుందో లేదోననే సంశయం. అన్నింటినీ అధిగమించి పర్‌సివియెరెన్స్‌ రోవర్‌ అంగారకుడి మీద దిగింది. చూస్తుండగానే ఏడాది పూర్తి చేసుకుంది. తనతో ఇంజెన్యూటీ హెలికాప్టర్‌నూ తీసుకెళ్లిన ఇది 50 గిగావాట్లకు పైగా డేటాను సేకరించింది. ఎన్నెన్నో కొత్త విషయాలను తెలియజేసింది. వీటిల్లో కొన్ని విశేషాలు ఇవీ..


లక్షకు పైగా ఫొటోలు

అంగారకుడి మీద కాలు పెట్టినప్పట్నుంచీ పర్‌సివియెరెన్స్‌ కెమెరాలు నిరంతరంగా ఫొటోలు తీస్తూనే ఉన్నాయి. దీనికి అమర్చిన 23 కెమెరాలు ఈ పనిలోనే నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు లక్షకు పైగానే ఫొటోలు తీశాయి! నీటి ప్రవాహం మూలంగా అంగారకుడి ఉపరితలం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవటానికివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అక్కడ అతి పురాతన సూక్ష్మజీవుల ఆనవాళ్లను గుర్తించటానికీ ఈ ఫొటోలు దోహదం చేయనున్నాయని ఆశిస్తున్నారు. పర్‌సివియెరెన్స్‌ తీసిన ఫొటోలను నాసా అందరికీ అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు వీటిని ఓపెన్‌ గ్యాలరీలో పోస్ట్‌ చేస్తూనే ఉంది. వీటిల్లో అన్నింటికన్నా ముఖ్యంగా ఇంజెన్యూటీతో కలిసి ఇటీవల తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.


3డీ పటం రూపకల్పన

అంగారకుడి మీద ఇంజెన్యూటీ హెలికాప్టర్‌ ఇప్పటివరకు 19 సార్లు విజయవంతంగా చక్కర్లు కొట్టింది. తాజాగా ఫిబ్రవరి 8న ఎగిరి, ఇంకా తాను పటిష్ఠంగానే ఉన్నానని చాటుకుంది. ఇతర గ్రహం మీద ఎగిరిన మొట్టమొదటి విమాన వాహనం ఇదే. దీనికి రెండు కెమెరాలున్నాయి. వీటి సాయంతోనే ఇంజెన్యూటీ హైరెజల్యూషన్‌ ఫొటోలు తీస్తోంది. అంతేకాదు, అంగారకుడి 3డీ పటాన్నీ రూపొందిస్తోంది.


నమూనాల సేకరణ

ఇప్పటివరకు పర్‌సివియెరెన్స్‌ అంగారకుడి రాయి, వాతావరణం నుంచి 6 నమూనాలను సేకరించింది. గత సంవత్సరం సెప్టెంబరులో అంగారకుడి ఉపరితలాన్ని తొలచి, రాతి లోపలి నుంచి నమూనాను తీసుకొని ఒక ట్యూబులో భద్రపరచింది. ఒక వ్యోమనౌక ఇతర గ్రహం మీద నమూనాలను సేకరించటం ఇదే తొలిసారి. అందుకే రోవర్‌ ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఇక్కడి శాస్త్రవేత్తలు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.


నీటి జాడ నిర్ధరణ

అంగారకుడి మీద ఒకప్పుడు నీరు ఉండేదనే విషయాన్నీ పర్‌సివియెరెన్స్‌ నిర్ధరించింది. ప్రస్తుతం ఎండిపోయి, గాలులకు కోసుకుపోయిన జెజెరో అనే అగ్ని పర్వత బిలం వద్ద త్రిభుజాకారంలోని ఒండ్రు ప్రాంతాన్ని ఇది పరిశీలించిది. ఒకప్పుడిది సరస్సని, 370 కోట్ల ఏళ్ల క్రితం 120 మైళ్ల పొడవైన నది నుంచి దీనిలోకి నీరు వచ్చి చేరేదని తేలింది. నది తీర ప్రాంతం చాలావరకు ప్రశాంతంగా ఉండేదని భావిస్తున్నారు. కానీ భారీ వరదలు వచ్చిన జాడలు కనిపించాయి. వాతావరణంలో గణనీయమైన మార్పులు దీనికి కారణమై ఉండొచ్చని అనుకుంటున్నారు. దీనిలోంచి రోవర్‌ త్వరలో నమూనాలు సేకరించనుంది. వీటిల్లో జీవుల ఆనవాళ్లు ఉండొచ్చని ఆశిస్తున్నారు.


లావా ఆనవాళ్లు

పర్‌సివియెరెన్స్‌ పరిశీలిస్తున్న ప్రాంతాల్లో ‘సీటా’ ఒకటి. చుట్టుపక్కల పరిసరాలను బట్టి మొదట్లో దీనికి మూలం అవక్షేపం అని భావించారు. కానీ రోవర్‌ ఓ చిన్న పరికరం సాయంతో ఇక్కడి రాళ్ల ఉపరితలాన్ని తొలచి చూడగా.. అది అగ్నిశిల ఖనిజాలతో కూడుకొని ఉన్నట్టు బయటపడింది. అందువల్ల ఒకప్పుడు శిలాద్రవం ప్రవహించటం దీనికి కారణం కావొచ్చని అనుకుంటున్నారు. ఈ రాళ్లలో వివిధ రకాల లవణాలూ ఉన్నట్టు తేలింది.


సేంద్రియ అణువుల గుర్తింపు

రోవర్‌కు జోడించిన షెర్లాక్‌ పరికరం కొన్ని రాళ్లలో కర్బనంతో కూడిన సేంద్రియ రసాయనాలు ఉన్నట్టు గుర్తించింది. అరిగిపోయిన రాళ్ల లోపలే కాదు.. దుమ్ములో కూరుకుపోయి అరగని రాళ్లలోనూ కర్బనంతో కూడిన అణువులు ఉన్నట్టు బయటపెట్టింది. అంతమాత్రాన అక్కడ జీవుల ఉనికి ఉన్నట్టు కాదు. జీవులతో సంబంధంలేని ప్రక్రియలు సైతం సేంద్రియ అణువులను సృష్టించొచ్చు.   ఇవి వేటికి సంబంధించినవి అనేది భూమికి వచ్చిన తర్వాత నమూనాలను పరిశీలిస్తే గానీ బయటపడదు. ఈ నమూనాలు చాలా ఏళ్లు శాస్త్రవేత్తల మెదళ్లకు పని కల్పించొచ్చని అనుకుంటున్నారు.


ఆక్సిజన్‌ సృష్టి

పర్‌సివియెరెన్స్‌ రోవర్‌లో అన్నింటికన్నా ఆసక్తికరమైన ప్రయోగం ఆక్సిజన్‌ తయారీ. ఇందుకోసం మార్స్‌ ఆక్సిజన్‌ ఇన్‌-సిటు రిసోర్స్‌ యుటిలైజేషన్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (మోక్సీ) పరికరాన్ని రోవర్‌కు జోడించారు. బంగారు రంగులో, కారు బ్యాటరీ సైజులో ఉండే ఇది అక్కడి వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి ఆక్సిజన్‌ను తయారు చేయటం విశేషం. మున్ముందు మనుషులు అక్కడికి వెళ్తే శ్వాసించటానికి అనువైన గాలిని సృష్టించుకోటానికి మోక్సీ సాయం చేస్తుందన్నమాట. ఇది వాతావరణం నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహించి, దాన్ని శుద్ధిచేసి వేడి చేస్తుంది. దీంతో కార్బన్‌ డయాక్సైడ్‌.. ఆక్సిజన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌గా విడిపోతుంది. ఆక్సిజన్‌ను పట్టి ఉంచి, కార్బన్‌ మోనాక్సైడ్‌ను తిరిగి వాతావరణంలోకి వదిలేస్తుంది. ఇది ఒక గంటలో 5.4 గ్రాముల శుద్ధ ఆక్సిజన్‌ను పుట్టించి చరిత్ర సృష్టించింది. ఈ ఆక్సిజన్‌ ఒకరు సుమారు 10 నిమిషాల సేపు శ్వాస తీసుకోవటానికి సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని