ఇ-ముక్కు.. పార్కిన్సన్స్‌ను పట్టిస్తుంది!

కుక్కలు వాసనతో నేరగాళ్లను పట్టించటం తెలిసిందే. వాసనతో జబ్బులనూ గుర్తించగలిగితే? అదెలా సాధ్యమంటారా? అయితే చైనా శాస్త్రవేత్తలు సృష్టించిన ఎలక్ట్రానిక్‌ ‘ముక్కు’ గురించి తెలుసుకోవాల్సిందే. ఇది కేవలం వాసనతోనే పార్కిన్సన్స్‌ జబ్బును పసిగడుతుంది మరి.

Updated : 02 Mar 2022 06:17 IST

కుక్కలు వాసనతో నేరగాళ్లను పట్టించటం తెలిసిందే. వాసనతో జబ్బులనూ గుర్తించగలిగితే? అదెలా సాధ్యమంటారా? అయితే చైనా శాస్త్రవేత్తలు సృష్టించిన ఎలక్ట్రానిక్‌ ‘ముక్కు’ గురించి తెలుసుకోవాల్సిందే. ఇది కేవలం వాసనతోనే పార్కిన్సన్స్‌ జబ్బును పసిగడుతుంది మరి.

కొన్నేళ్ల క్రితం ఒకామె వాసనతో పార్కిన్సన్స్‌ జబ్బును గుర్తించటం సంచలనం కలిగించింది. అప్పట్నుంచే శాస్త్రవేత్తలకు దీనిపై ఆసక్తి కలిగింది. చర్మం మీద రసాయనాల వాసనతో పార్కిన్సన్స్‌ జబ్బును పసిగట్టే పరికరాన్ని రూపొందించాలని కృషి చేస్తున్నారు. ఎట్టకేలకు ఇటీవల సాధ్యమైంది. పార్కిన్సన్స్‌ జబ్బులో చేతులు, తల వణుకుతుంటాయి. నడవటం కష్టమవుతుంది. కొందరిలో మతిమరుపు, కుంగుబాటు వంటివీ కనిపిస్తుంటాయి. ప్రస్తుతానికి దీన్ని నయం చేసే చికిత్స లేదు. కానీ తొలిదశలో గుర్తించి, చికిత్స తీసుకుంటే రోజువారీ పనులు హాయిగా చేసుకోవటానికి వీలుంటుంది. చిక్కేంటంటే- వణుకు వంటి లక్షణాలు మొదలయ్యేవరకూ జబ్బును గుర్తించలేకపోవటం. అప్పటికే కోలుకోలేనంతగా నష్టం జరిగిపోతుంది. సాధారణంగా పార్కిన్సన్స్‌ జబ్బు గలవారిలో చర్మంలోని తైలగ్రంథులు నూనె పదార్థాన్ని (సీబమ్‌) ఎక్కువగా విడుదల చేస్తాయి. ఎంజైమ్‌లు, హార్మోన్ల వంటివీ అధికంగా విడుదలవుతాయి. ఇవన్నీ కలిసి ఒకరకమైన వాసనను పుట్టిస్తాయి. దీనిలోని రసాయనాలను విశ్లేషిస్తే జబ్బును ముందుగానే పట్టుకోవచ్చు. ఇ-ముక్కు చేసే పని ఇదే. గ్యాస్‌ క్రోమటోగ్రఫీ విశ్లేషణ విధానం, ఉపరితల శబ్దతరంగ సెన్సర్‌, మిషిన్‌ లెర్నింగ్‌ ఆల్గోరిథమ్‌తో శాస్త్రవేత్తలు దీన్ని తయారుచేశారు. వాసనలోని రసాయనాలను గ్యాస్‌ క్రోమటోగ్రఫీ వేరు చేస్తుంది. వాయువులోని రసాయనాలు శబ్దతరంగాలను తాకినప్పుడు సెన్సర్‌ వీటిని లెక్కిస్తుంది. ఆల్గోరిథమ్‌లు ఆయా వాసనల్లోని తేడాలను పసిగడతాయి. ఇలా ఇవన్నీ కలిసి పార్కిన్సన్స్‌ జబ్బును గుర్తిస్తాయి. ఇది 70.8% కచ్చితత్వంతో పనిచేస్తుండటం విశేషం. ఈ పరికరం చిన్నగా ఉండటం వల్ల ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లొచ్చు. అందుకే ఇది ఏదో ఒకరోజు ఆసుపత్రుల్లో నిర్ధరణ పరికరంగా అన్నిచోట్లా దర్శనమివ్వగలదని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని