ఈమెయిల్‌ ట్రాక్‌లో పడకుండా..

ఇన్‌బాక్స్‌లో మనకు తెలియని, అవసరం లేని ఈమెయిల్స్‌ ప్రత్యక్షమవటం తరచూ చూసేదే. వీటిల్లో ఆయా వస్తువుల, సేవల ప్రచారానికి సంబంధించినవే ఎక్కువ. అయితే స్పామర్లు, ఫిషర్స్‌ సైతం ఇలాంటి మెయిళ్లతో వల విసురుతుంటారు. మెయిల్‌ చిరునామా సరైనదేనా? మెయిళ్లను చదువుతున్నారా? అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. కొన్నిసార్లు ఇది చిక్కుల్లో పడేయొచ్చు.

Updated : 02 Mar 2022 06:29 IST

ఇన్‌బాక్స్‌లో మనకు తెలియని, అవసరం లేని ఈమెయిల్స్‌ ప్రత్యక్షమవటం తరచూ చూసేదే. వీటిల్లో ఆయా వస్తువుల, సేవల ప్రచారానికి సంబంధించినవే ఎక్కువ. అయితే స్పామర్లు, ఫిషర్స్‌ సైతం ఇలాంటి మెయిళ్లతో వల విసురుతుంటారు. మెయిల్‌ చిరునామా సరైనదేనా? మెయిళ్లను చదువుతున్నారా? అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. కొన్నిసార్లు ఇది చిక్కుల్లో పడేయొచ్చు.

పరిచిత ఈమెయిళ్లను చాలామంది యథాలాపంగానే తెరుస్తుంటారు. తమకు సంబంధించినవి కాకపోయినా ఆసక్తి కొద్దీ ఏముందోనని చూస్తుంటారు. కానీ ఇలాంటి మెయిళ్లలో ఎక్కడో ఒకచోట అదృశ్యంగా ఒక పిక్సెల్‌తో కూడిన చిన్న ఇమేజ్‌ ట్రాకర్‌ ఉంటుందనే సంగతి తెలుసుకోలేరు. మెయిల్‌ను క్లిక్‌ చేయగానే ఇది మనకు సంబంధించిన బోలెడంత డేటాను సేకరిస్తుంది. మెయిల్‌ను ఎప్పుడు ఓపెన్‌ చేశారు? చదివారా, లేదా? మెయిల్‌లోని లింకులను క్లిక్‌ చేశారా? ఇలాంటి వివరాలన్నింటినీ పంపించినవారికి చేరవేస్తుంది. మరి ఇలాంటి ఈమెయిల్‌ ట్రాకింగ్‌ నుంచి తప్పించుకోవటమెలా? దీనికి తేలికైన మార్గం- మెయిల్‌ను తెరచినప్పుడు అందులోని ఫొటోలు వాటంతటవే డౌన్‌లోడ్‌ కాకుండా చూసుకోవటం. నిజానికి చాలా బ్రౌజర్లు ఇందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తాయి. పర్మిషన్స్‌ను మార్చుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇది తీవ్రమైన చర్య. ఒకరకంగా ఇది ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ను ‘చప్పిడి కూడు’లా మార్చేస్తుంది. అయినా సరే అనుకుంటే ప్రయత్నించి చూడొచ్చు. గూగుల్‌ క్రోమ్‌ వాడేవారు పైన కుడివైపు చివరన నిలువు మూడు చుక్కలను నొక్కి, సెటింగ్స్‌లోకి వెళ్లాలి. సెక్యూరిటీ అండ్‌ ప్రైవసీ విభాగం ద్వారా సైట్‌ సెటింగ్స్‌లోకి వెళ్లాలి. కిందికి స్క్రోల్‌ చేసి ఇమేజెస్‌ విభాగం కింద ‘అడిషనల్‌ పర్మిషన్స్‌’ మీద క్లిక్‌ చేయాలి. ఇమేజెస్‌ పేజీ మీద ‘డోన్ట్‌ అలో సైట్స్‌ టు షో ఇమేజెస్‌’ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. ఏవైనా సైట్ల ఇమేజ్‌లు కనిపించాలనుకుంటే ఆయా సైట్లను జోడించుకునే వెసులుబాటూ ఉంటుంది.

ఎక్స్‌టెన్షన్ల సాయం

ఈమెయిల్‌ ట్రాకింగ్‌ను అడ్డుకోవటానికి మంచి పద్ధతి యాంటీ ట్రాకింగ్‌ బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్లను ఇన్‌స్టాల్‌ చేసుకోవటం. పిక్సెల్‌ బ్లాక్‌, పిక్సెల్‌ బ్లాక్‌ 2, ట్రాకర్‌ వంటివి జీమెయిల్‌ ట్రాకింగ్‌ను నిలువరించటానికి ఉపయోగపడతాయి. వీటిని క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి పొందొచ్చు. ఇవి ఈమెయిళ్లలోని ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించి, అడ్డుకుంటాయి. ట్రాకింగ్‌ పిక్సెల్‌ను గుర్తించగానే మెయిల్‌ను పంపించినవారి పేరు పక్కన ఎర్రటి కన్ను గుర్తు కనిపించేలా చేస్తాయి. క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఎడ్జ్‌ వంటి బ్రౌజర్లకు ‘క్లియర్‌ యూఆర్‌ఎల్‌’ యాడ్‌ ఆన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవి బ్రౌజర్‌లో నిక్షిప్తమై పోతాయి. బ్రౌజర్‌, ఇన్‌బాక్స్‌లోని ప్రతీ లింక్‌ నుంచి ట్రాకింగ్‌ చెత్తను నిశ్శబ్దంగా తొలగించేస్తాయి. https://docs.clearurls.xyz/1.22.0/ నుంచి వీటిని యాడ్‌ చేసుకోవచ్చు.\

* రీడ్‌ రిసీప్ట్స్‌, ఇతర ఈమెయిల్‌ ట్రాకింగ్‌ పిక్సెల్స్‌ను అడ్డుకోవటానికి ‘అగ్లీ ఈమెయిల్‌’ అనే ఓపెన్‌-సోర్స్‌ జీమెయిల్‌ ఎక్స్‌టెన్షన్‌ సైతం ఉపయోగపడుతుంది. ఇది ఇన్‌బాక్స్‌ను స్కాన్‌ చేసి, పిక్సెల్స్‌తో కూడిన ఈమెయిళ్లు ఉన్నాయేమో గమనిస్తుంది. పిక్సెల్‌ ఉన్నట్టు గుర్తిస్తే మెయిళ్లను కనుగుడ్డు ఆకారంతో లేబుల్‌ చేస్తుంది. పిక్సెల్‌ను అడ్డుకుంటుంది. ఫైర్‌ఫాక్స్‌ వాడేవారు దీన్ని https://addons.mozilla.org/en-US/firefox/search/?q=ugly%20email. నుంచి యాడ్‌ చేసుకోవచ్చు.

ఈమెయిల్‌ క్లయింట్లతో..

ఎక్స్‌టెన్షన్లు వద్దనుకుంటే ఇమేజ్‌లు వాటంతటవే డౌన్‌లోడ్‌ కాకుండా ఈమెయిల్‌ క్లయింట్లను కన్ఫిగర్‌ చేసుకోవచ్చు. వెబ్‌ బ్రౌజర్‌లో జీమెయిల్‌ను తెరచి, పైన కుడివైపున గేర్‌ గుర్తును క్లిక్‌ చేయాలి. జనరల్‌ ట్యాబ్‌ కింద ‘సీ ఆల్‌ సెటింగ్స్‌’ మీద క్లిక్‌ చేయాలి. కిందికి స్క్రోల్‌ చేసి, ఇమేజెస్‌ విభాగంలో ‘ఆస్క్‌ బిఫోర్‌ డిస్‌ప్లేయింగ్‌ ఎక్స్‌టర్నల్‌ ఇమేజెస్‌’ బాక్స్‌ను ఎంచుకోవాలి.

* మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌ వాడేవారైతే బ్రౌజర్‌లో సైన్‌ ఇన్‌ కావాలి. గేర్‌ గుర్తును నొక్కి సెటింగ్స్‌లోకి వెళ్లాలి. తర్వాత ‘వ్యూ ఆల్‌ అవుట్‌లుక్‌ సెటింగ్స్‌’ మీద క్లిక్‌ చేయాలి. ఎడమవైపు కనిపించే జాబితాలో ‘జనరల్‌’ విభాగంలో ‘ప్రైవసీ అండ్‌ డేటా’ను ఎంచుకోవాలి. కిందికి స్క్రోల్‌ చేస్తే ‘ఎక్స్‌టర్నల్‌ ఇమేజెస్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇందులో ‘ఆల్వేస్‌ యూజ్‌ ద అవుట్‌లుక్‌ సర్వీస్‌ టు లోడ్‌ ఇమేజెస్‌’ పక్కన చెక్‌ మార్కును పెట్టుకోవాలి. ఇది పూర్తిగా పిక్సెల్‌ ట్రాకింగ్‌ను అడ్డుకోలేదు కానీ ఇతరత్రా మార్గాల్లో భద్రత కల్పిస్తుంది.


యాపిల్‌ పరికరాల్లో తేలికగా..

గోప్యతను కాపాడే విషయంలో యాపిల్‌ హైడ్‌ మై ఈమెయిల్‌, ప్రైవేట్‌ రిలే వంటి ఫీచర్లతో ఎప్పుడూ ముందంజలోనే ఉంది. ఐఫోన్‌, మ్యాక్‌ఓఎస్‌లోని మెయిల్‌ యాప్‌కు చెందిన ‘ప్రొటెక్ట్‌ మెయిల్‌ యాక్టివిటీ’ ఫీచర్‌ పిక్సెల్‌ ట్రాకింగ్‌ను నిలువరించటానికి బాగా ఉపయోగపడుతుంది. మ్యాక్‌ఓఎస్‌లో మెయిల్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, మెనూ ద్వారా మెయిల్‌ మీద క్లిక్‌ చేయాలి. ప్రిఫరెన్స్‌లోకి వెళ్లి వ్యూయింగ్‌ ట్యాబ్‌ కింద ఉండే ‘లోడ్‌ రిమోట్‌ కంటెంట్‌ ఇన్‌ మెసేజెస్‌’ను అన్‌చెక్‌ చేయాలి. అదే ఐఫోన్‌, ఐప్యాడ్‌లోనైతే సెటింగ్స్‌ ద్వారా మెయిల్‌లోకి వెళ్లాలి. ప్రైవసీ ప్రొటెక్షన్‌ విభాగంలో ‘ప్రొటెక్ట్‌ మెయిల్‌ యాక్టివిటీ’ని టర్న్‌ ఆన్‌ చేసుకోవాలి. ఇవి ఐపీ చిరునామాను అదృశ్యం చేయటం వంటి చర్యలతో రక్షణ కల్పిస్తాయి. మెసేజెస్‌ను ఓపెన్‌ చేయకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ నుంచే పనిచేస్తాయి. అనుచిత మెయిళ్లను పంపించేవారి కంటపడకుండా చూస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని