Updated : 16 Mar 2022 16:07 IST

5జీ హుజూర్‌!

రోజురోజుకీ మొబైల్‌ విప్లవం కొత్తరూపు సంతరించుకుంటోంది. 1జీ, 2జీ, 3జీ, 4జీలు దాటుకొని 5జీలోకి అడుగుపెడుతోంది. డేటా మార్పిడి వేగాన్ని గణనీయంగా పెంచేసే,  వైర్‌లెస్‌ కనెక్షన్ల తీరుతెన్నులను సమూలంగా మార్చేసే ఇది శరవేగంగా దూసుకొస్తోంది. స్మార్ట్‌ నగరాల వసతులు, స్వయంచాలిత వాహనాల వంటి అధునాతన డేటా టెక్నాలజీలకు పెద్ద ఊపు నివ్వగలదని భావిస్తున్న దీని కథేంటో చూద్దామా!

వ్యవసాయ విప్లవం పంటలు, పొలాలకే పరిమితం కాలేదు. గ్రామాలు, రాజ్యాలు.. అనంతరం దేశాల స్థాపనకూ దారితీసింది. పారిశ్రామిక విప్లవం యంత్రాల ఆవిష్కరణ, వస్తూత్పత్తితోనే ఆగిపోలేదు. ఆర్థికాభివృద్ధి, వినూత్న ఆవిష్కరణల యుగానికీ పురుడు పోసింది. కంప్యూటర్లు బిట్స్‌, బైట్స్‌కే పరిమితం కాలేదు. ఇవి ప్రపంచ పురోగమనాన్ని మరో మలుపు తిప్పగా.. ఇంటర్నెట్‌ దీని వేగానికి మరింత ఆజ్యం పోసింది. ఫోన్లు కమ్యూనికేషన్‌ వ్యవస్థ తీరుతెన్నులనే మార్చేయగా.. స్మార్ట్‌ఫోన్‌ విప్లవం మన జీవన విధానాన్నే మార్చేసింది. మాటలతో, వీడియోలతో మనుషులను కలపటం దగ్గర్నుంచి.. ఇంటర్నెట్‌ అనుసంధానంతో అందరినీ కట్టిపడేసింది. సామాజిక సంబంధాలు, ఆఫీసు వ్యవహారాలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌లు, ఆర్థిక లావాదేవీలు.. అన్నింటినీ అరచేతిలో ఇమిడిపోయేలా చేసింది. దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఆఫీసులను కట్టేసి ఇంటికి వచ్చేయొచ్చు. డెస్క్‌టాప్‌ను షట్‌డౌన్‌ చేసి పక్కకు వెళ్లిపోవచ్చు. ల్యాప్‌టాప్‌ను వెంట తీసుకెళ్లినా కట్టేసే అవకాశమైతే ఉంది. మరి స్మార్ట్‌ఫోనో? నిరంతరం ఆన్‌లోనే ఉంటుంది, ఆన్‌లైన్‌లోనే ఉంచుతుంది. ఎక్కడికి వెళ్లినా వెంటే వస్తుంది. పడకగదిలోనూ మనతోనే ఉంటుంది. ఇలా ఇది మన శరీరంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. ఇప్పుడు మనకన్నా మన గురించి స్మార్ట్‌ఫోన్‌కే ఎక్కువ తెలుసన్నా అతిశయోక్తి కాదు. కమ్యూనికేషన్‌, జీపీఎస్‌, ప్రిడిక్టివ్‌ ఆల్గోరిథమ్‌ల పుణ్యమాని స్మార్ట్‌ఫోన్‌ మనల్ని ఓ సైబోర్గ్‌గానూ మార్చేసింది. 3జీ, 4జీతోనే ఇవన్నీ సాధ్యమైతే 5జీ రాకతో ఇంకెన్ని మార్పులు రానున్నాయో.

5జీ అంటే ఏంటి?

ఐదో తరం సెల్యులర్‌ డేటా టెక్నాలజీనే పొట్టిగా 5జీ అని పిలుచు కుంటున్నాం. తొలితరం అదే.. 1జీతో మాట్లాడుకోవటమే సాధ్యమైంది. 2జీ సంక్షిప్త సందేశాలకు తెరతీయగా.. 3జీ ఇంటర్నెట్‌తో కలిపేసింది. 4జీ బ్రాడ్‌బ్యాండ్‌కు మార్గం వేయగా.. 5జీ వీటన్నింటినీ అధిగమించి ఎల్లవేళలా ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయనుంది. ఇప్పటికే దీని ఫలితాలను కొంతవరకు చవి చూస్తున్నాం కూడా. ఒక్క ఫోన్‌తోనే కాదు, ఇంటర్నెట్‌తో అనుసంధానం కాగల అన్ని పరికరాలతోనూ వైర్‌లెస్‌గా నిరంతరం కలిపి ఉంచుతుంది. 5జీ ఒక్క పరిజ్ఞానం కాదు. పలు పరిజ్ఞానాల సముదాయం. దీన్ని క్వాల్‌కామ్‌, హువావీ, సామ్‌సంగ్‌, ఎరిక్సన్‌ వంటి పలు మొబైల్‌ కంపెనీలు కలిసి రూపొందించాయి. నెట్‌వర్క్‌ టవర్లు, ఇతర సదుపాయాల వంటివి నెలకొల్పటానికి ప్రపంచవ్యాప్తంగా స్థానిక సంస్థలు సైతం తోడ్పడ్డాయి.  

లాభాలు ఎన్నెన్నో

5జీ ప్రయోజనాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది డేటా బదిలీ వేగం గురించే. దీని గరిష్ఠ డౌన్‌లోడ్‌ వేగమెంతో తెలుసా? 10జీబీపీఎస్‌! సమాచార మార్పిడి మధ్య జాప్యం మిల్లీసెకండు కన్నా తక్కువే. ఇప్పటికిప్పుడే ఇంత వేగవంత డేటా అందుబాటులోకి రాకపోవచ్చు. కానీ ప్రస్తుత 4జీ నెట్‌వర్క్‌ సగటు వేగం కన్నా 100 రెట్లు ఎక్కువ వేగంతో డేటాను బదిలీ చేసే అవకాశమైతే ఉంది. ఇంతకీ ఇంత వేగం ఎలా సాధ్యమవుతుంది? 5జీని అందుబాటులోకి తెచ్చే రేడియో స్పెక్ట్రమ్‌ పూర్తిగా దీనికే పరిమతమై ఉండటం. ఈ స్పెక్ట్రమ్‌ను ప్రస్తుతం దేనికీ వాడుకోవటం లేదు. అందువల్ల ఇతర రేడియో సంకేతాలు విఘాతం కలిగించవు. మరో గొప్ప విషయం ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో పరికరాలు అనుసంధానం కావటం. ఎన్ని పరికరాలు కనెక్ట్‌ అయినా వేగం తగ్గకపోవటం. కాబట్టే ప్రస్తుత 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌తో సాధ్యం కాని కొత్త టెక్నాలజీలకు ఇది కొత్త ఉత్తేజాన్ని ఇవ్వగలదని భావిస్తున్నారు. స్వయంచాలిత బస్‌ లైన్లు, ట్రాఫిక్‌, విద్యుత్‌, నీటి వ్యవస్థల వంటి స్మార్ట్‌ నగరాల వసతుల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుందనటం నిస్సందేహం. కాకపోతే 5జీ నెట్‌వర్క్‌ పనిచేయటానికి ప్రత్యేక పరికరాలు అవసరం. పాత ఫోన్లు, ట్యాబ్లెట్లు దీంతో అనుసంధానం కాలేవు. ప్రస్తుతం అనుసంధానమై ఉన్నవన్నీ 5జీకి అప్‌గ్రేడ్‌ కావాల్సి ఉంటుంది.

5జీ.. సమాజాన్ని కట్టిపడేసే అనుసంధాన వారధి

మారిపోయే ప్రపంచం

5జీతో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌.. అంటే యంత్రాలు, పరికరాల మధ్య సమాచార మార్పిడి విస్తృతం కానుంది. దీంతో మానవ ప్రమేయమేదీ లేకుండానే కోట్లాది పరికరాలు ఒకదాంతో మరోటి అనుసంధానమవుతాయి. ఫలితంగా అధునాతన పారిశ్రామిక ప్రక్రియలు.. వ్యవసాయం, తయారీ రంగం, వాణిజ్య కమ్యూనికేషన్లకు సంబంధించి విప్లవాత్మక మార్పులు సాకారం కానున్నాయి.

* వీడియో సమావేశంలో పాల్గొంటున్నారు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారు. లేదూ చూస్తూ వింటున్నారు. ఇలాంటి సమయంలో మాటిమాటికీ వీడియో ప్రసారం ఆగిపోతుంటే? ఎవరికైనా విసుగు వస్తుంది. 5జీ వస్తే అలాంటి ఇబ్బందేమీ ఉండదు. అత్యంత వేగంతో కూడిన ఇంటర్నెట్‌ మూలంగా ఎన్ని పరికరాలతో ఎంత మంది వీడియో సమావేశంలో పాల్గొంటున్నా నిరాటంకంగా ప్రసారం సాగుతూనే ఉంటుంది.

* ఇంటి రక్షణ కోసం నిఘా కెమెరాలు అమర్చుకున్నారు. అవి నిరంతరం ఎప్పటికప్పుడు హైక్వాలిటీ వీడియోను రికార్డు చేస్తుంటే ఎంత బాగుంటుంది? ఇంట్లో సెన్సర్లతో కూడిన ఎయిర్‌ కండిషన్‌ లేదా లైట్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటికి ఎలాంటి ఆటంకం లేకుండా సంకేతాలు అందితే? మరింత బాగా పనిచేస్తాయి కదా. 5జీ రాకతో ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆఫీసులోంచే ఇంట్లోని పరికరాలను నిర్వహించుకోవచ్చు.

* ప్రస్తుతం ఆటోమేటెడ్‌ గోదాముల్లో సార్టర్లు, కన్వేయర్‌ బెల్టులు, ట్రక్‌ అన్‌లోడర్ల వంటివన్నీ తీగలతో అనుసంధానమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థతోనే నడుస్తున్నాయి. 5జీ అందుబాటులోకి వస్తే తీగలతో పనుండదు. మామూలు కన్ఫిగరేషన్‌తోనే గరిష్ఠ ఉత్పాదన సాధించొచ్చు. సమాచార మార్పిడిలో జాప్యం తగ్గటం వల్ల గోదాముల భద్రతా పెరుగుతుంది. ప్రపంచంలో ఏ మూలనుంచైనా గోదాముల్లోని పరికరాలను పనిచేయించొచ్చు.

* పరిశ్రమలు, ఆఫీసులు పూర్తిగా డిజిటల్‌ రూపంలోకి మారే రోజులు మరెంతో దూరంలో లేవు. దీంతో కార్మికులు, ఉద్యోగులు తమ పనుల నిర్వహణకు టెక్నాలజీ మీద ఆధారపడక తప్పదు. ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని చూస్తున్నాం. 5జీ అందుబాటులోకి వస్తే ఇది మరింత మెరుగవుతుంది. ఎక్కడో క్లౌడ్‌లో ఉన్న బ్యాక్‌ ఎండ్‌ వ్యవస్థతో అనుసంధానమయ్యే మొబైల్‌ వేదికలు ఇంకాస్త వేగంగా, సమర్థంగా పనిచేయటానికిది వీలు కల్పిస్తుంది.

* ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) నెట్‌వర్క్‌ అనుసంధాన భద్రతకు 5జీ ఎంతగానో తోడ్పడనుంది. ఇంట్లో, ఆఫీసుల్లో స్మార్ట్‌ పరికరాలు వేగంగా పనిచేయటానికిది వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు- ఇంట్లో ఐఓటీ పరిజ్ఞానంతో కూడిన ఫ్రిజ్‌, ఏసీ, వాషింగ్‌ మిషన్‌ల వంటివి ఉంటే బయట ఎక్కడున్నా ఫోన్‌ ద్వారానే పనిచేయించొచ్చు. అంటే ఆఫీసులో ఉండే ఇక్కడ వాషింగ్‌ మెషిన్‌ను ఆన్‌ చేయొచ్చు, ఆఫ్‌ చేయొచ్చు.

* వైద్యరంగంలో 5జీ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఉదాహరణకు- 5జీతో అనుసంధానమైన అంబులెన్సు చిన్న ఆసుపత్రిగా ఉపయోగపడొచ్చు. అవసరమైతే డాక్టర్లతో అంబులెన్స్‌ సిబ్బంది, పేషెంట్లు మాట్లాడొచ్చు. సమస్య తీవ్రతను గుర్తించి, అప్పటికప్పుడే చికిత్సలను సూచించొచ్చు. పరిస్థితిని పర్యవేక్షించొచ్చు. చాలా దూరాల నుంచి ఆసుపత్రులకు వచ్చేవారికిది ఎంతగానో ఉపయోగపడగలదు. రోబో శస్త్రచికిత్సల పద్ధతితో ప్రపంచంలో ఏమూల నుంచైనా తేలికగా ఆపరేషన్లు చేయొచ్చు.

* డిజిటల్‌ ప్రపంచంలో విహరించేలా చేసే మెటావర్స్‌ 5జీ రాకతో బాగా ఊపందు కుంటుంది. నిజ ప్రపంచం మాదిరిగానే అక్కడా అవతార్ల రూపంలో జీవించటం తేలికవుతుంది. ఇన్‌సెల్‌ వీఆర్‌, ఫుల్‌డ్రైవ్‌ వీఆర్‌, నెట్‌ఫ్లిక్స్‌ వీఆర్‌, గూగుల్‌ కార్డ్‌బోర్డు వంటి అప్లికేషన్లతో డిజిటల్‌ ప్రపంచ విహారం వినోద భరితంగా మారనుంది. బ్యాంకు లావాదేవీల దగ్గర్నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ వరకూ అక్కడే పూర్తి చేసుకోవచ్చు. ప్రపంచంలోని ప్రముఖ క్షేత్రాలను స్వయంగా సందర్శించిన అనుభూతీ పొందొచ్చు. ఇక ఆన్‌లైన్‌ గేమ్స్‌నైతే 5జీ శిఖర స్థాయికి తీసుకెళ్లగలదు. వేగం, దృశ్యాల స్పష్టత మూలంగా ఇతరులతో కలిసి ఆటలు ఆడుకోవటం సులభమవుతుంది. అనుభూతీ మెరుగవుతుంది.

* ప్రస్తుతం వ్యవసాయ రంగంలో సెన్సర్లు బాగా ఉపయోగపడుతున్నాయి. మొక్కల తీరుతెన్నులను, చీడపీడల దగ్గర్నుంచి ఎంత నీరు అవసరం? ఎప్పుడెప్పుడు ఎరువులు వేయాలి? అనేవీ గుర్తిస్తున్నాయి. 5జీతో ఇది మరింత విస్తృతమవుతుంది. డ్రోన్లతో పంటల పర్యవేక్షణ తేలికవుతుంది. ఎక్కడ్నుంచైనా పంటలు, పొలాలను పరిశీలించొచ్చు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని