Telegram: టెలిగ్రామ్‌ ‘సీక్రెట్‌’ గురించి తెలుసా?

టెలిగ్రామ్‌ యాప్‌ అనగానే మెసేజ్‌లు, ఫొటోలు, ఫైళ్లు పంపుకోవటం.. కాల్స్‌ చేసుకోవటమే గుర్తుకొస్తాయి. ఇవేకాదు, ఇందులో ఇంకా ఎన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఒకటి రహస్య (సీక్రెట్‌)

Updated : 24 Mar 2022 13:11 IST

టెలిగ్రామ్‌ యాప్‌ అనగానే మెసేజ్‌లు, ఫొటోలు, ఫైళ్లు పంపుకోవటం.. కాల్స్‌ చేసుకోవటమే గుర్తుకొస్తాయి. ఇవేకాదు, ఇందులో ఇంకా ఎన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఒకటి రహస్య (సీక్రెట్‌) ఛాట్‌. మరింత భద్రత, గోప్యత కోరుకునేవారికిది ఎంతో ఉపయోగపడుతుంది. సీక్రెట్‌ ఛాట్‌లోని మెసేజ్‌లన్నీ ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయ్యి ఉంటాయి. అంటే మెసేజ్‌ను పంపించినవారు, అందుకున్నవారు మాత్రమే చదవగలరన్నమాట. పైగా వీటిని ఇతరులకు ఫార్వర్డ్‌ చేయటానికీ ఉండదు. మెసేజ్‌ను డిలీట్‌ చేస్తే అది అవతలివారి సీక్రెట్‌ ఛాట్‌లోనూ కనుమరుగవుతుంది. అంతేనా? మీడియా ఫైళ్లను నిర్ణీత కాలం తర్వాత వాటంతటవే డిలీట్‌ అయ్యేలా (సెల్ఫ్‌-డిస్ట్రక్షన్‌) కూడా ముందే నిర్ణయించుకోవచ్చు. ఈ ఫీచర్‌తో పంపిన మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, ఫైళ్లను అవతలివారు చదివిన లేదా తెరచిన తర్వాత ఎంతసేపు వరకు ఉండాలనేది మనమే నిర్ణయించుకోవటానికి వీలవుతుంది. ఇవి నిర్ణీత గడువు ముగియగానే మన యాప్‌లోనూ, అవతలివారి యాప్‌లోనూ.. రెండింటిలోనూఅదృశ్యమైపోతాయి. మరి ఈ సీక్రెట్‌ ఛాట్‌ను   సెట్‌ చేసుకోవటమెలా?

టెలిగ్రామ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, కాంటాక్ట్‌ చేయాలని అనుకునేవారి ప్రొఫైల్‌ను తెరవాలి.

ప్రొఫైల్‌ పక్కన అడ్డంగా కనిపించే మూడు చుక్కల గుర్తును ట్యాప్‌ చేయాలి.

‘స్టార్ట్‌ సీక్రెట్‌ ఛాట్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఇలా ఒకరితో ఎన్ని సీక్రెట్‌ ఛాట్‌లైనా సృష్టించుకోవచ్చు. అయితే ఇవి ఆయా పరికరాలకే ప్రత్యేకమనే విషయాన్ని మరవరాదు. ఒక పరికరంలో ఎవరితోనైనా సీక్రెట్‌ ఛాట్‌ ఆరంభిస్తే అది అందులోనే ఉంటుంది. ఆ పరికరంలో యాప్‌ నుంచి లాగవుటైతే సీక్రెట్‌ ఛాట్స్‌ అన్నీ పోతాయి.

సెల్ఫ్‌-డిస్ట్రక్షన్‌ సెటప్‌ ఇలా..

సీక్రెట్‌ ఛాట్‌ను ఓపెన్‌ చేసి, కుడివైపు నిలువు గీతల మీద నొక్కాలి. ఇందులోని గడియారం గుర్తును క్లిక్‌ చేసి ‘సెట్‌ సెల్ఫ్‌ డిస్ట్రక్ట్‌ టైమర్‌’ను ఎంచుకోవాలి. నిర్ణీత సమయాన్ని ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత మనం పంపిన మెసేజ్‌, ఫైళ్లను అందుకున్నవారి తెర మీద టైమ్‌ తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. సమయం ముగియగానే ఫైళ్లు అదృశ్యమవుతాయి. టైమర్‌ను సెట్‌ చేసిన తర్వాత పంపించిన ఫైళ్లు మాత్రమే వాటంతటవి డిలీట్‌ అవుతాయి. అంతకు ముందు పంపించినవి అలాగే ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని