Apple New iOS: నవ యాపిల్‌!

మరో కొత్త యాపిల్‌ ప్రపంచం ఆవిష్కృతమైంది. మూడు నెలల క్రితం బీటా వర్షన్‌గా ఆరంభం అయినప్పట్నుంచే ఆసక్తి రేపుతున్న ఐఓఎస్‌ 15.4 ఇప్పుడు యాపిల్‌ ప్రియులందరికీ అందుబాటులోకి వచ్చింది.

Updated : 23 Mar 2022 12:55 IST

మరో కొత్త యాపిల్‌ ప్రపంచం ఆవిష్కృతమైంది. మూడు నెలల క్రితం బీటా వర్షన్‌గా ఆరంభం అయినప్పట్నుంచే ఆసక్తి రేపుతున్న ఐఓఎస్‌ 15.4 ఇప్పుడు యాపిల్‌ ప్రియులందరికీ అందుబాటులోకి వచ్చింది. బీటా వర్షన్‌లోనే కొత్త ఫీచర్లు ఆకట్టుకోగా తుది అప్‌డేట్‌తో మరింత ఆకర్షణీయంగా మారింది. వీటిల్లో కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లు ఇవీ..


ట్యాప్‌ చేస్తే చెల్లింపు

ఒక్క ట్యాప్‌తోనే చెల్లింపులు చేయటానికి వీలు కల్పించే ‘ట్యాప్‌ టు పే’ ఫీచర్‌ మరో ప్రత్యేకం. చిన్న దుకాణాలు, పెద్ద షాపింగ్‌ మాళ్ల వంటివి నడిపేవారు తమ ఐఫోన్లతో యాపిల్‌ పే చెల్లింపులను అంగీకరించటానికిది వీలు కల్పిస్తుంది. అదనపు హార్డ్‌వేరేదీ అవసరం లేదు. ఈ కాంటాక్ట్‌లెస్‌ ఫీచర్‌ కోసం యాపిల్‌ సంస్థ వీసా, మాస్టర్‌కార్డు, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి ముఖ్యమైన పేమెంట్‌ నెట్‌వర్క్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్‌ ఫోన్లతో, ఐఫోన్లతో దుకాణాల్లో డబ్బు చెల్లిస్తూనే ఉన్నాం కదా. ఇందులో ప్రత్యేకత ఏముందంటారా? ట్యాప్‌ టు పే ఫీచర్‌కు ఎన్‌ఎఫ్‌సీ పరిజ్ఞానంతో కూడిన పీఓఎస్‌ పరికరంతో పనుండదు. అంటే ఐఫోనే పీఓఎస్‌ పరికరంగా మారుతుందన్నమాట. ఉదాహరణకు- మనం ఏదైనా కొన్నామనుకోండి. దుకాణదారు ఐఫోన్‌కు దగ్గరగా మన ఐఫోన్‌ లేదా యాపిల్‌ వాచ్‌ను పెట్టి యాపిల్‌ పే, కాంటాక్ట్‌లెస్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు, ఇతర డిజిటల్‌ వాలెట్ల ద్వారా నేరుగా డబ్బు చెల్లించొచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. అయితే పాత ఐఫోన్లతో (ఐఫోన్‌ 6, 6ఎస్‌, 7, 7 ప్లస్‌, 8, 8 ప్లస్‌ మోడళ్లకు) మాత్రం ఇలాంటి చెల్లింపులు కుదరవు.


కొత్త ఎమోజీలు

వినూత్న, వినోదాత్మక ఎమోజీలంటే ఇష్టపడేవారికి తాజా అప్‌డేట్‌ మరింత కనువిందు చేయనుంది. కొత్తగా 37 ఎమోజీలు అందుబాటులోకి రానున్నాయి మరి. కరుగుతున్న ముఖం, నోటి మీద చేతులు ఆనించి ఒక కన్ను తెరచి ఉండటం, అర ముఖంతో కూడిన సెల్యూట్‌, చుక్కల గీతల వృత్తంతో ముఖం, మూతి విరుపు, ఎడమ వైపు చూపించే చేయి, కుడివైపు చూపించే చేయి, ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపటం, పెదవి కొరుక్కోవటం, కిరీటం ధరించిన తల, గర్భిణి, కోరల్‌, తామరపువ్వు, కిడ్నీ బీన్స్‌.. ఇలా రకరకాల భావాలను వ్యక్తీకరించుకోవటానికి అవసరమైన ఎమోజీలు వచ్చి చేరాయి. బుడగలు, ఐడీ కార్డు, ఎక్స్‌రే వంటి చిత్రమైన ఎమోజీలు కూడా ఆకట్టుకోనున్నాయి.


యూనివర్సల్‌ కంట్రోల్‌

మ్యాక్‌ మీద పనిచేస్తున్నారు. ఐప్యాడ్‌లో ఏదో ముఖ్యమైన సమాచారం ఉంది. మ్యాక్‌ తెర మీది నుంచే ఐప్యాడ్‌లోని ఫైళ్లను చూడాలని అనుకుంటున్నారు. ఒకప్పుడైతే ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఐఓఎస్‌ 15.4 బీటా వర్షన్‌ ఉన్నవారే వాడుకునేవారు. ఇప్పుడు అందరికీ బీటా వర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో మరో యాపిల్‌ పరికరాన్ని రెండో తెరగా వాడుకోవటానికి వీలవుతుంది. ఒకే కీబోర్డు, మౌజ్‌తో తేలికగా ఫైళ్లను ఒక పరికరం నుంచి మరో పరికరానికి మార్చుకోవచ్చు. ఒకే తెర మీద పనులు చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకోవాలంటే రెండు పరికరాల్లోనూ ఒకే యాపిల్‌ ఐడీతో ఐక్లౌడ్‌కు సైన్‌ ఇన్‌ కావాల్సి ఉంటుంది. వైర్‌లెస్‌గా వాడుకోవాలంటే రెండు పరికరాల్లోనూ బ్లూటూత్‌, వైఫై సదుపాయం ఉండాలి. హ్యాండాఫ్‌ టర్న్‌ ఆన్‌ చేసుకోవాలి. పరికరాలు 10 మీటర్ల లోపు దూరంలో ఉండాలి.


పాస్‌వర్డ్‌ మేనేజర్‌గా కీచెయిన్‌

ఐఓఎస్‌ 15.4, ఐప్యాడ్‌ఓఎస్‌ 15.4 అప్‌డేట్‌తో ఐక్లౌడ్‌ కీ చెయిన్‌ మరింత మెరుగైంది. నోట్స్‌ దగ్గర్నుంచి పాస్‌వర్డ్‌ల వరకూ దేన్నయినా ఇందులో సేవ్‌ చేసుకోవచ్చు. ఒకరకంగా ఇది పాస్‌వర్డ్‌ మేనేజర్‌గానూ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. వెబ్‌సైట్లు, లాగిన్‌ వివరాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో దాచుకోవచ్చు. అంతేకాదు, కొత్త పాస్‌వర్డ్‌ను సేవ్‌ చేసేటప్పుడు యూజర్‌నేమ్‌ దానంతటదే యాడ్‌ కాకపోతే జోడించుకోవాలని సూచిస్తుంది.


యానిమేషన్‌ మెరుగ్గా

ఐఫోన్‌ 13 ప్రో సిరీస్‌ మోడళ్లలో 120 హెర్ట్జ్‌ ప్రోమోషన్‌ డిస్‌ప్లేలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ పలు థర్డ్‌ పార్టీ యాప్‌ల విషయంలో ఐఓఎస్‌ దీన్ని 60 హెర్ట్జ్‌కే పరిమితం చేసేసింది. కోర్‌ యానిమేషన్‌లో బగ్‌ ఉండటమే దీనికి కారణం. తాజా అప్‌డేట్‌తో యాపిల్‌ దీన్ని పరిష్కరించింది. దీంతో అన్ని థర్డ్‌ పార్టీ యాప్‌ల్లో యానిమేషన్లు మెరుగవుతాయి. ముఖ్యంగా లిస్ట్‌లు స్క్రోల్‌ చేస్తున్నప్పుడు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగుతాయి.


నోట్స్‌తో లైవ్‌ టెక్స్ట్‌ సమ్మిళితం

ఐఓస్‌ 15 వాడేవారికి లైవ్‌ టెక్స్ట్‌ ఫీచర్‌ కొత్తేమీ కాదు. ఇది ఫోన్‌ కెమెరాతో టెక్స్ట్‌ను క్యాప్చర్‌ చేసి, ఇతర యాప్స్‌లో పేస్ట్‌ చేయటానికి వీలు కల్పిస్తుంది. నోట్స్‌, రిమైండర్‌తోనూ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. తాజా అప్‌డేట్‌తో ఇది మరింత మెరుగైంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్కాన్‌ టెక్స్ట్‌ కమాండ్‌ గురించి. యాప్‌లో పాప్‌ అయ్యే దీన్ని ఎంచుకుంటే పుస్తకాలు, ఫొటోల వంటి వాటి నుంచి టెక్స్ట్‌ను క్యాప్చర్‌ చేయొచ్చు. ఇది నోట్‌ లేదా రిమైండర్‌లో వెంటనే కనిపిస్తుంది. కావాలంటే మొత్తం టెక్స్ట్‌నూ ఇన్‌సర్ట్‌ చేసుకోవచ్చు.


ఇతర ఫీచర్లు

* భద్రత పరంగా 39 లోపాలను యాపిల్‌ సవరించింది.

* యాపిల్‌ మ్యూజిక్‌లోని పాటలు, ఆల్బమ్‌లకు షేర్‌ షీట్‌లో షేర్‌ ప్లే ఆప్షన్‌ అందుబాటులోకి వస్తుంది.

* యాపిల్‌ క్రెడిట్‌ కార్డు గలవారు యాపిల్‌ కార్డు విడ్జెట్‌ ద్వారా ఇప్పుడు బ్యాలెన్స్‌, ఖర్చు వివరాలను తెలుసుకోవచ్చు.

* షార్ట్‌కట్స్‌ ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇష్టమైన ఆటోమేషన్లు రన్‌ చేసుకోవచ్చు.

*  పాడ్‌కాస్ట్స్‌కు యాడ్‌ అయిన ఫిల్టర్‌ సాయంతో అన్‌ప్లేడ్‌ అండ్‌ డౌన్‌లోడెడ్‌ విభాగాలను వేరు చేసి చేసుకోవచ్చు.్తంది కాబట్టి మాస్కు ధరించాల్సిన అవసరం లేదు. తర్వాత తెర కింద కనిపించే ‘డన్‌’ బటన్‌ మీద నొక్కాలి. దీంతో ఫేస్‌ ఐడీ సెటప్‌ మారిపోతుంది. మాస్కు లేకపోయినా ముఖాన్ని గుర్తిస్తుంది.


మాస్కు ధరించినా ఫోన్‌ ఓపెన్‌

ఐఫోన్‌ను త్వరగా, ఇబ్బందులు లేకుండా ఓపెన్‌ చేయటానికి ఫేస్‌ ఐడీ మంచి మార్గం. ముఖం చూపిస్తే చాలు ఓపెన్‌ అయిపోతుంది. కరోనా నేపథ్యంలో మాస్కు ధరించటం దీనికి బ్రేక్‌ వేసింది. ఐఫోన్‌ తాజా అప్‌డేట్‌తో ఈ ఇబ్బంది తొలగిపోయింది. మాస్కు ధరించినా ముఖాన్ని గుర్తించే ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాస్‌కోడ్‌ ఎంటర్‌ చేయటం లేదా మాస్కు తీసి ముఖాన్ని చూపించాల్సిన అవసరం తప్పుతుంది. కాకపోతే ఇది ఐఫోన్‌ 12, ఆపై మోడళ్లలోనే అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఫోన్‌ను ఐఓఎస్‌ 15.4కు అప్‌డేట్‌ చేసుకోవాలి. తర్వాత..

* ఐఫోన్‌ సెటింగ్స్‌ యాప్‌ ఓపెన్‌ చేసి ఫేస్‌ ఐడీ అండ్‌ పాస్‌కోడ్‌ ఆప్షన్‌ మీద ట్యాప్‌ చేయాలి. పాస్‌కోడ్‌ ఎంటర్‌ చేయాలి.- ‘ఫేస్‌ ఐడీ విత్‌ ఎ మాస్కు’ మీద నొక్కి, ‘యూజ్‌ ఫేస్‌ ఐడీ విత్‌ ఎ మాస్క్‌’ మీద ట్యాప్‌ చేయాలి.

* తర్వాత ‘గెట్‌ స్టార్టెడ్‌’ ఎంచుకోవాలి. మామూలుగా ఫేస్‌ ఐడీ కోసం చేసినట్టుగానే ముఖాన్ని వివిధ కోణాల్లో స్కాన్‌ చేయాలి. ఇది ప్రధానంగా కళ్లనే స్కాన్‌ చేస్తుంది కాబట్టి మాస్కు ధరించాల్సిన అవసరం లేదు. తర్వాత తెర కింద కనిపించే ‘డన్‌’ బటన్‌ మీద నొక్కాలి. దీంతో ఫేస్‌ ఐడీ సెటప్‌ మారిపోతుంది. మాస్కు లేకపోయినా ముఖాన్ని గుర్తిస్తుంది.

* అద్దాలు కూడా ధరిస్తున్నట్టయితే తిరిగి ‘ఫేస్‌ ఐడీ అండ్‌ పాస్‌కోడ్‌’లోకి వెళ్లి ‘యాడ్‌ గ్లాసెస్‌’ను ఎంచుకోవాలి. ఇది అద్దాలు ఎలా ఉంటాయో గుర్తించి సేవ్‌ చేస్తుంది. దీంతో మాస్కు, అద్దాలు రెండు ధరించినా ముఖాన్ని గుర్తిస్తుంది.

* ఐఫోన్‌ 12, ఆపై మోడళ్లు లేవని బాధపడుతున్నారేమో. యాపిల్‌ వాచ్‌ ఉంటే మాస్కు ధరించినా ఫోన్‌ను ఓపెన్‌ చేయొచ్చు. నిజానికి మాస్కు ఉన్నా ముఖాన్ని గుర్తించటానికి ఇప్పటివరకు అన్ని ఐఫోన్లకు అందుబాటులో ఉన్న ఫీచర్‌ ఇదే. కొత్త అప్‌డేట్‌తో ఐఫోన్‌ 12, ఆపై మోడళ్లకు యాపిల్‌ వాచ్‌ అవసరం తప్పినట్టయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని