మెటావర్స్‌లోనూ తాకొచ్చు

వాస్తవం వాస్తవమే. కల్పన కల్పనే. అయితేనేం? నిజ ప్రపంచం మాదిరిగానే కాల్పనిక మెటావర్స్‌లోనూ భూములు కొనుక్కుంటున్నారు. అవతార్లను సృష్టించుకొని ఒకరితో మరొకరకు...

Updated : 30 Mar 2022 05:24 IST

వాస్తవం వాస్తవమే. కల్పన కల్పనే. అయితేనేం? నిజ ప్రపంచం మాదిరిగానే కాల్పనిక మెటావర్స్‌లోనూ భూములు కొనుక్కుంటున్నారు. అవతార్లను సృష్టించుకొని ఒకరితో మరొకరకు పలకరించుకుంటున్నారు. ఎన్నెన్నో సుందర దృశ్యాలను చూస్తున్నారు. కానీ ఆయా వస్తువులను, మనుషులను తాకిన అనుభూతి ఎలా కలుగుతుంది? మెటావర్స్‌ ప్రియులను కలవర పరుస్తున్నది ఇదే. ఇకపై ఇలా బెంగ పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మెటావర్స్‌లో విహరిస్తున్నప్పుడు స్పర్శ అనుభూతిని కలిగించే మణికట్టు బ్యాండును జపాన్‌కు చెందిన హెచ్‌2ఎల్‌ టెక్నాలజీ సంస్థ తయారుచేసింది. దీన్ని ధరిస్తే బంతి వంటి వాటిని ముట్టుకుంటే నిజంగానే తాకిన అనుభూతి కలుగుతుంది. పక్షులు చేతిని పొడుస్తుంటే చర్మానికి చురుకు చురుకుమనీ అనిపిస్తుంది. అంతేనా? ఇది విద్యుత్‌ ప్రచోదనలతో నొప్పి భావననూ కలిగిస్తుంది. బరువు, తాకిడి, వెనక్కి నెట్టటం వంటివీ తెలుస్తాయి. ఈ అనుభూతిని ప్రొప్రయోసెప్టివ్‌ జ్ఞానమని పిలుచుకుంటున్నారు. దీన్నే కైనెస్థీషియా అనీ అంటారు. మన శరీరం కదలికలను, చర్యలను, ప్రాంతాన్ని గుర్తించటానికి తోడ్పడేది ఇదే. మన ప్రతి కండరం కదలికలోనూ ఈ జ్ఞానం దాగుంటుంది. ఇదే లేకపోతే యథాలాపంగా తర్వాతి పని చేయటం సాధ్యమయ్యేది కాదు. తాజా పరికరంతో మన శరీర జ్ఞానం ఇప్పుడు కాల్పనిక ప్రపంచానికీ విస్తరించనుంది. దీంతో కాల్పనిక ప్రపంచం మరింత వాస్తవ రూపం ధరించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని