కాంటాక్ట్స్‌ యాప్‌ సరికొత్తగా..

స్మార్ట్‌ఫోన్‌ కాంటాక్ట్స్‌ యాప్‌ను మనం పెద్దగా పట్టించుకోం. మామూలు అడ్రస్‌ బుక్‌గానే పరిగణిస్తుంటాం. కానీ కాస్త మనసు పెడితే యాపిల్‌ ఐఓఎస్‌ 15, గూగుల్‌ ఆండ్రాయిడ్‌ 12 ఫోన్లలోని డిఫాల్ట్‌

Updated : 30 Mar 2022 05:23 IST

స్మార్ట్‌ఫోన్‌ కాంటాక్ట్స్‌ యాప్‌ను మనం పెద్దగా పట్టించుకోం. మామూలు అడ్రస్‌ బుక్‌గానే పరిగణిస్తుంటాం. కానీ కాస్త మనసు పెడితే యాపిల్‌ ఐఓఎస్‌ 15, గూగుల్‌ ఆండ్రాయిడ్‌ 12 ఫోన్లలోని డిఫాల్ట్‌ వర్షన్‌ కాంటాక్ట్స్‌ యాప్‌ను మరింత బాగా వాడుకోవచ్చు. మనకు ఇష్టమైనవారి వివరాలను ఇందులో జోడించటానికి కొద్దిగా సమయం కేటాయిస్తే చాలు. ప్రత్యేక రింగ్‌టోన్ల దగ్గర్నుంచి ప్రయాణ సూచికలు, పుట్టినరోజు రిమైండర్‌ వరకూ రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు.

కార్డుతో పరిచయం
యాపిల్‌ ఐఓఎస్‌ కాంటాక్ట్స్‌ యాప్‌లో, ఆండ్రాయిడ్‌ పరికరాల్లో గూగుల్‌ ఉచిత కాంటాక్ట్స్‌ యాప్‌లోని కార్డు సౌలభ్యముంది. ఇందులో వ్యక్తిగత వివరాలు జోడించుకుంటే ఫోన్‌ అసిస్టెంట్‌ను వాడుకునేటప్పుడు ఎంతగానో ఉపయోగపడతాయి. సఫారీ, క్రోమ్‌ బ్రౌజర్లలో ఆటో-ఫిల్‌ ఫీచర్లకూ వాడుకోవచ్చు. ఉదాహరణకు- పర్సనల్‌ కాంటాక్ట్‌ కార్డులో కుటుంబసభ్యులతో మన సంబంధాన్ని జోడించామనుకోండి. సిరి లేదా గూగుల్‌ అసిస్టెంట్‌కు ‘కాల్‌ డాడ్‌’ అని ఆదేశిస్తే నాన్నకు ఫోన్‌ చేసి పెడతాయి. ఇందుకోసం మాటల ద్వారానూ ఒకసారి సంబంధాన్ని అసిస్టెంట్‌ యాప్‌ల్లో ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ఐఫోన్‌లో కాంటాక్ట్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి పర్సనల్‌ కార్డును చూడొచ్చు. ఒకవేళ ఇది జాబితాలో పైన కనిపించకపోతే ‘ప్లస్‌’ గుర్తును ట్యాప్‌ చేసి సెట్‌ చేసుకోవాలి. కార్డును ఎంచుకొని ‘ఎడిట్‌’ బటన్‌ను క్లిక్‌ చేయాలి. ‘యాడ్‌ రిలేటెడ్‌ నేమ్‌’ను ట్యాప్‌ చేసి, కుటుంబసభ్యులతో సంబంధాన్ని సూచించే లేబుల్‌ను ఎంచుకోవాలి. ‘మెడికల్‌ ఐడీ’ విభాగంలోనైతే అత్యవసర సమయంలో కాంటాక్ట్‌ కావాల్సినవారినీ జోడించుకోవచ్చు. ఇది స్క్రీన్‌ లాక్‌ అయినప్పుడు తెర మీద కనిపిస్తుంది.

* గూగుల్‌ కాంటాక్ట్స్‌లోనైతే కార్డు కోసం గూగుల్‌ అకౌంట్‌ ప్రొఫైల్‌ గుర్తు మీద ట్యాప్‌ చేయాలి. ‘కాంటాక్ట్స్‌ యాప్‌ సెటింగ్స్‌’ను క్లిక్‌ చేయాలి. ‘యువర్‌ ఇన్ఫో’ ద్వారా ‘ఎడిట్‌ కాంటాక్ట్‌’లోకి వెళ్లి వివరాలు ఎంటర్‌ చేయాలి. ఇక ఇందులో అత్యవసర కాంటాక్ట్స్‌ విషయానికి వస్తే- గూగుల్‌ పిక్సెల్‌ మోడళ్లకు చెందిన చాలా ఫోన్లలో గూగుల్‌ ఉచిత పర్సనల్‌ సేఫ్టీ యాప్‌లో కాంటాక్ట్‌ వివరాలను జత చేసుకోవచ్చు.

కొత్తవారి జోడింపు
ఐఫోన్‌ లేదా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో కాంటాక్ట్‌ను క్రియేట్‌ చేయటానికి ముందుగా కాంటాక్ట్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. ప్లస్‌ గుర్తును క్లిక్‌ చేసి వివరాలు ఎంటర్‌ చేయాలి. దీనికి సోషల్‌ మీడియా హ్యాండిళ్లు, ఫొటోలు, ముద్దు పేర్లు (ప్రకృతి ప్రేమికుడు, తెలుగు అభిమాని వంటివి), పుట్టినరోజుల వంటివన్నీ ఇందులో చేర్చుకోవచ్చు. ఇందులో యాడ్‌ చేసిన పుట్టినరోజు తేదీలు ఐఫోన్‌ బర్త్‌డేస్‌ క్యాలెండర్‌, గూగుల్‌ కాలెండర్‌ యాప్‌లోకీ జత అవుతాయి.

కాంటాక్ట్స్‌ ఎడిట్‌
కావాలంటే కాంటాక్ట్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. కొత్తవారిని జోడించుకోవచ్చు. ఐఫోన్‌లో ఆయా కాంటాక్ట్‌లను ఎంచుకొని పైన కుడివైపు మూలన కనిపించే ‘ఎడిట్‌’ బటన్‌ను ట్యాప్‌ చేయాలి. ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనైతే కింద కుడివైపు మూలలోని ‘ఎడిట్‌ కాంటాక్ట్‌’ బటన్‌ను క్లిక్‌ చేయాలి. కొత్త వివరాలు జతచేసుకోవాలి. మున్ముందు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా ఆ ప్రయాణం ఎక్కడ్నుంచి సాగుతుందో కూడా జోడించుకోవచ్చు. ఫొటో గుర్తును నొక్కి ఫోన్‌లోని ఫొటోను ఎంచుకొని ప్రొఫైల్‌ ఫొటోగా సెట్‌ చేసుకోవచ్చు. ఐఫోన్‌ కాంటాక్ట్‌ ఎడిటింగ్‌తో ఆయా వ్యక్తులకు ప్రత్యేక రింగ్‌టోన్‌ను, టెక్ట్స్‌ టోన్‌ను అసైన్‌ చేసుకోవచ్చు. ఒకవేళ కాంటాక్ట్‌ను డిలీట్‌ చేయాలనుకుంటే తెర కిందికి స్క్రోల్‌ చేసి, ‘డిలీట్‌ కాంటాక్ట్‌’ను ట్యాప్‌ చేయాలి. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని గూగుల్‌ కాంటాక్ట్స్‌లో పైన కుడివైపున కనిపించే మూడు చుక్కల గుర్తును నొక్కి, మోర్‌ మెనూలోకి వెళ్లాలి. సెలెక్ట్‌ బటన్‌ ద్వారా జాబితాలోని వివరాలను ఎంచుకోవాలి. తిరిగి మోర్‌ మెనూను ట్యాప్‌ చేసి మెర్జ్‌ను ఎంచుకోవాలి.

అప్‌డేట్‌ చేశాక..
ఒకసారి కాంటాక్ట్స్‌ అప్‌డేట్‌ చేశామంటే అవసరానికి తగ్గట్టు వాడుకోవచ్చు. ఉదాహరణకు- ఇష్టమైనవారి కాంటాక్ట్‌లను త్వరగా గుర్తించటానికి ఐఫోన్‌ తెర మీద ఐఓఎస్‌ విడ్జెట్‌ను యాడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్‌ కాంటాక్ట్స్‌ మెనూ నుంచి హోం స్క్రీన్‌కు కాంటాక్ట్‌ షార్ట్‌కట్స్‌ను సేవ్‌ చేసుకోవచ్చు.

కార్డు షేర్‌ ఆప్షన్‌తో ఇతరులకు టెక్స్ట్‌ లేదా ఈమెయిల్‌ కాంటాక్ట్‌ వివరాలను తేలికగా పంపుకోవచ్చు. ఆయా కాంటాక్ట్‌లను ఓపెన్‌ చేయమని ఫోన్‌ అసిస్టెంట్‌కు చెప్పొచ్చు. షార్ట్‌ కట్స్‌తో వీడియోకాల్‌ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్‌ రూపంలో డబ్బు చెల్లించొచ్చు. ఇలా ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఎవరికైనా కాల్‌ చేయమని, మెసేజ్‌ పంపించమని అసిస్టెంట్‌కు ఆదేశాలు ఇవ్వచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని