ఎగిసింది సౌర జ్వాల

సూర్యుడి ఉపరితలం నుంచి జ్వాలలు వెలువడటం కొత్తేమీ కాదు. ఇటీవల కూడా అలాంటివి ఎగిసిపడ్డాయి. వీటిని సోలార్‌ డైనమిక్‌ అబ్జర్వేటరీ ఉపగ్రహం అత్యంత స్పష్టంగా ఫొటోలు, వీడియోలు తీసింది కూడా. ఈసారి ఎగిసిపడినవి ‘ఎం’ రకం జ్వాలలు.

Updated : 06 Apr 2022 16:05 IST

సూర్యుడి ఉపరితలం నుంచి జ్వాలలు వెలువడటం కొత్తేమీ కాదు. ఇటీవల కూడా అలాంటివి ఎగిసిపడ్డాయి. వీటిని సోలార్‌ డైనమిక్‌ అబ్జర్వేటరీ ఉపగ్రహం అత్యంత స్పష్టంగా ఫొటోలు, వీడియోలు తీసింది కూడా. ఈసారి ఎగిసిపడినవి ‘ఎం’ రకం జ్వాలలు. అంటే మధ్యస్థ జ్వాలలన్నమాట. గత వారంలో తీవ్ర తరగతికి చెందిన ‘ఎక్స్‌’ రకం జ్వాలలూ ఎగిసిపడ్డాయి. వీటి మూలంగా భూమి మీద కొద్దిసేపు షార్ట్‌వేవ్‌ రేడియో తరంగాలకు అంతరాయమూ ఏర్పడింది. ఇంతకీ సౌర జ్వాలల కథేంటి?

అంతరిక్ష వాతావరణం మన వాతావరణం మాదిరిగా ఉండదు. సూర్యుడి నుంచి నిరంతరం విద్యుదావేశిత రేణువులు, అయస్కాంత క్షేత్రం వెలువడుతూ ఉంటాయి. భూ అయస్కాంత క్షేత్రాన్ని ఢీకొడుతూ వస్తాయి. ఇవి మామూలుగా ఉంటే పెద్దగా ఇబ్బందేమీ కలిగించవు. కానీ కొన్నిసార్లు కోట్లాది టన్నుల విద్యుదావేశిత రేణువులు సెకనుకు 1,800 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంటాయి. సాధారణంగా సౌర జ్వాలలు తగ్గుముఖం పట్టాక ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అప్పుడు సౌర పదార్థం, రేడియేషన్‌ అంతరిక్షంలోకి పెద్దఎత్తున వెలువడుతుంటాయి. దీన్నే కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ (సీఎంఈ) అంటారు. ఇది కొన్నిసార్లు భూ వాతావరణాన్ని తాకి, సౌర తుపాను లేదా భూఅయస్కాంత తుపానుకు (జియోమాగ్నెటిక్‌ స్టార్మ్‌) దారితీయొచ్చు.

అతి తీవ్రంగానూ..

సీఎంఈ కొన్నిసార్లు చాలా తీవ్రంగానూ ఉండొచ్చు. తీవ్రమైన సీఎంఈ 1859లో ఎగిసిపడింది. ఇది 17.5 గంటల తర్వాత భూమిని చేరుకొని, సౌర తుపానుకు దారితీసింది. దీని ప్రభావంతో ఉత్తరార్ధగోళంలో ఏర్పడిన రంగుల తెరలు దక్షిణాన కరేబియా ప్రాంతంలోనూ కనిపించటం విశేషం. టెలిగ్రాఫ్‌ తీగలు మండిపోయి, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్‌ వ్యవస్థ బాగా దెబ్బతింది. 1989, మార్చి 13న కూడా తీవ్ర సౌరజ్వాలలతో భూఅయస్కాంత క్షేత్రం అస్తవ్యస్తమైంది. దీని మూలంగా కెనడాలోని క్యూబెక్‌లో 9 గంటల సేపు విద్యుత్‌ ప్రసారానికి అంతరాయం కలిగింది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఎదురైతే ఎంతో నష్టం వాటిల్లి ఉండేది. ప్రస్తుతం కమ్యూనికేషన్‌, అంతర్జాల వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమై ఉండేవి. ఉపగ్రహాలు, వ్యోమనౌకలకూ సౌర తుపాను తీవ్ర విఘాతం కలిగిస్తుంది. అందుకే దీన్ని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు గమనిస్తూ ఉంటారు. సౌర తుపాను ఎగిసిపడే అవకాశముంటే ముందే హెచ్చరిస్తారు. ఇది వ్యోమగాముల రక్షణకు బాగా ఉపయోగపడుతుంది.

అక్కడ్నుంచే ఎక్కువ

సూర్యుడి వెలుపలి వాతావరణమైన కరోనా నుంచి జ్వాలలు వెలువడతాయి. సూర్యుడి మీద ఏఆర్‌2975 అనే ప్రాంతం నుంచే ఎక్కువగా జ్వాలలు ఎగిసిపడుతుంటాయి. ఇది అయస్కాంత సంక్లిష్ట ప్రాంతమని, దీంతో ఇక్కడి హైడ్రోజన్‌ అణువులు అస్థిరత్వానికి గురై తరచూ జ్వాలలు ఏర్పడుతుంటాయన్నది శాస్త్రవేత్తల భావన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని