తొలి యూట్యూబ్‌ వీడియో ఇలా..

యూట్యూబ్‌ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. వినోదాత్మక, విచిత్ర వీడియోలకైనా.. విజ్ఞానదాయక వీడియోలకైనా నిలయం ఇదే. సంగీతం, పాటలు, సినిమాలు, సీరియళ్లు, వంటలు, వార్తా కథనాలు, ప్రత్యక్ష ప్రసారాలు.. ఒకటేమిటి సమస్త

Published : 20 Apr 2022 01:52 IST

యూట్యూబ్‌ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. వినోదాత్మక, విచిత్ర వీడియోలకైనా.. విజ్ఞానదాయక వీడియోలకైనా నిలయం ఇదే. సంగీతం, పాటలు, సినిమాలు, సీరియళ్లు, వంటలు, వార్తా కథనాలు, ప్రత్యక్ష ప్రసారాలు.. ఒకటేమిటి సమస్త దృశ్య మాధ్యమ వేదికగా యూట్యూబ్‌ సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. ఇదంతా సరే గానీ మీకు మొట్టమొదటి యూట్యూబ్‌ వీడియో గురించి తెలుసా?

ది 2005. సామాజిక మాధ్యమాలు అంతగా అభివృద్ధి కాని రోజులవి. తక్షణం వీడియోలను షేర్‌ చేయటమనేది కలలోని మాట. అలాంటి సమయంలోనే పేపల్‌ సంస్థ మాజీ ఉద్యోగులు చాద్‌ హర్లే, స్టీవ్‌ చెన్‌, జావేద్‌ కరీమ్‌ సంయుక్తంగా యూట్యూబ్‌ను సృష్టించారు. అందులో ముందుగా ఏదో ఒక వీడియో పోస్ట్‌ చేయాలని అనుకున్నారు. అలా నిర్వహించిన మొదటి ప్రయత్నమే వైరల్‌గా మారిపోయింది. చరిత్రను సృష్టించింది. ఇంతకీ ఆ తొలి యూట్యూబ్‌ శీర్షికేంటో తెలుసా? ‘మీ ఎట్‌ ద జూ’. ఇందులో సాన్‌ డీగో జూలోని ఏనుగుల ముందు జావేద్‌ కరీం నిల్చొని.. బెరుకుబెరుకుగా తడబడుతూ వాటి గురించి వివరించటం కనిపిస్తుంది. ఇది యూట్యూబ్‌ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది. సీరియస్‌ అంశాలే కాదు.. దేనికి సంబంధించిన విషయాలనైనా అప్పటికప్పుడు షేర్‌ చేసుకోవచ్చనే విషయాన్ని అన్యాపదేశంగా చెప్పటం అందరికీ నచ్చింది. అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీన్ని 22.6 కోట్లకు పైగా మంది వీక్షించారు. ఈ వీడియోను జావేద్‌ స్నేహితుడు ఒకరు రికార్డు చేశారు. దేన్ని రికార్డు చేస్తున్నానో అతడికి తెలియదు. కానీ నెల తర్వాత జావేద్‌ అతడికి ఒక లింక్‌ను షేర్‌ చేశారు. దాన్ని చూస్తూనే విస్తుపోయారు. తను రికార్డు చేసిన చిన్న వీడియోను ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఒకేసారి చూస్తున్నారనే అనుభూతే అతడిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని