అయస్కాంత బురద రోబో!

అదొక రోబో. బురద ముద్దలా కనిపించే దీన్ని రోబో అంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది చేసే పనులు చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. సన్నటి ఇరుకు దారుల్లోకి సర్రుమని జారిపోతుంది. వస్తువులను పట్టేసుకుంటుంది. పగిలిపోయిన సర్క్యూట్లను....

Published : 20 Apr 2022 02:02 IST

దొక రోబో. బురద ముద్దలా కనిపించే దీన్ని రోబో అంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది చేసే పనులు చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. సన్నటి ఇరుకు దారుల్లోకి సర్రుమని జారిపోతుంది. వస్తువులను పట్టేసుకుంటుంది. పగిలిపోయిన సర్క్యూట్లను సరిచేస్తుంది. శరీరంలోకి పంపించామనుకోండి. పొరపాటున మింగిన నట్లు, బోల్టుల వంటి వాటిని బయటకు తీసుకొస్తుంది. ఇది అయస్కాంతంతో కూడుకొని ఉంటుంది మరి. వస్తువులను పట్టుకొనే సాగే రోబోలు, ఇరుకు సందుల్లోకి చొచ్చుకొళ్లే ద్రవ ఆధారిత రోబోలు ఇప్పటికే ఉన్నాయి. కానీ ఈ రెండు గుణాలు కలగలిసినవి చాలా తక్కువ. ఈ కొరతను తీర్చటానికే హాంకాంగ్‌లోని చైనీస్‌ యూనివర్సిటీకి చెందిన లి ఝాంగ్‌ బృందం వినూత్నంగా ఆలోచించింది. నియోడైమియమ్‌ అయస్కాంత రేణువులను బోరాక్స్‌, పాలీవినైల్‌ ఆల్కహాల్‌తో కలిపి బురద ముద్దలాంటి రోబోను రూపొందించింది. ఇందులో అయస్కాంత రేణువులు ఉండటం వల్ల బయటి నుంచి అయస్కాంత క్షేత్రంతో తోచినట్టుగా కదిలించొచ్చు. అయస్కాంత రేణువుల మీద సిలికాన్‌ పూతను పూయటం వల్ల ఇవి చేతికి అంటుకోవు. పొరపాటును మింగిన బ్యాటరీని కడుపులోంచి వెలికి తీయటం, చిన్న తీగ ముక్కను పట్టుకోవటం, మిల్లీమీటరంత సందుల్లోకి దూరటం వంటి పనులను తేలికగా నిర్వహిస్తున్నట్టు పరీక్షల్లో బయటపడింది. మధ్యలో ఎక్కడైనా విడిపోయినా తిరిగి ఒకదగ్గరికి వస్తుండటం విశేషం. అంటే ఇది ద్రవం మాదిరిగా పారుతూ ముందుకు సాగటమే కాదు, ఆక్టోపస్‌ కాళ్ల మాదిరిగా ఒకదగ్గరకు ముడుచుకొని వస్తువులనూ పట్టుకోగలదన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని