చందమామ భ్రాంతి!

చంద్రుడు ఉదయిస్తున్పప్పుడు ఎంత పెద్దగా కనిపిస్తాడో. మరి అర్ధరాత్రి చిన్నగా ఎలా అవుతాడు? నిజానికి చంద్రుడి సైజు ఏమీ మారదు. అయినా ఉదయిస్తున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు పెద్దగా ఎందుకు కనిపిస్తాడు?

Published : 27 Apr 2022 01:55 IST

చంద్రుడు ఉదయిస్తున్పప్పుడు ఎంత పెద్దగా కనిపిస్తాడో. మరి అర్ధరాత్రి చిన్నగా ఎలా అవుతాడు? నిజానికి చంద్రుడి సైజు ఏమీ మారదు. అయినా ఉదయిస్తున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు పెద్దగా ఎందుకు కనిపిస్తాడు? ఇదంతా మన మెదడు చేసే కనికట్టు! అదే చంద్ర భ్రాంతి! దీని అంతరార్థమేంటన్నది మహామహులే సరిగా విశ్లేషించలేకపోయారు.

భూమి, ఆకాశం కలిసినట్టు కనిపించే చోట మన కంటికి చంద్రుడు పెద్దగా కనిపించటం చూసే ఉంటారు. అదే చంద్రుడు ఆకాశంలోకి పైకి వస్తున్నకొద్దీ చిన్నగా అవటమూ గమనించే ఉంటారు. దీనికి కారణమేంటి? ‘ఏముంది.. ఉదయిస్తున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు చందమామ భూమికి దగ్గరగా ఉంటాడు. అందుకే పెద్దగా కనిపిస్తాడు.’ మనలో చాలామంది ఇలాగే అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. చంద్రుడి పరిమాణం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నమ్మబుద్ధి కావటం లేదా? చంద్రుడి పక్కన చూపుడు వేలును పెట్టి కొలిచి చూడండి. చంద్రుడు దాదాపు గోరంత సైజులో కనిపిస్తాడు. ఉదయిస్తున్నప్పుడు చూసినా, అర్ధరాత్రి చూసినా అంతే ఉంటాడు. కావాలంటే కాగితాన్ని గొట్టంలా మలచి అందులోంచి చూడండి. ఇంకా నమ్మబుద్ధి కాకపోతే చంద్రుడి వైపు వీపు పెట్టి నిల్చొని, ముందుకు వంగి కాళ్ల మధ్యలోంచి ఉదయిస్తున్న చంద్రుడిని చూడండి. పెద్దగా కనిపిస్తున్న చంద్రుడు కాస్తా చిన్నగా అయిపోతాడు. పోనీ మరో ప్రయత్నం చేస్తారా? కెమెరాను జూమ్‌ చేయకుండా ఉదయిస్తున్న చంద్రుడిని ఫొటో తీయండి. అర్ధరాత్రి కూడా అలాగే మరో ఫొటో తీసి, రెండింటినీ పోల్చి చూడండి. రెండింటిలోనూ ఆ పక్క నుంచి ఈ పక్కకు చంద్రుడి సైజు ఒకేలా ఉంటుంది. అయినా కంటికి పెద్దగా, చిన్నగా ఎందుకు కనిపిస్తాడు? అంతా మన మెదడు దృశ్య సమాచారాన్ని విడమరచుకునే క్రమంలోనే ఉంది కిటుకు. వేలాది సంవత్సరాలుగా ఇలాంటి భ్రాంతిని గమనిస్తున్నా దీనికి సంతృప్తికరమైన శాస్త్రీయ వివరణేదీ ఇంకా దొరకలేదంటే ఆశ్చర్యమే.

ఎందుకు పెద్దగా కనిపిస్తాడు?

ఆశ్చర్యంగా అనిపించినా ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం తెలియదనే చెప్పుకోవాలి. అరిస్టాటిల్‌, టోలమీ, డావించీ వంటి శాస్త్రవేత్తలూ ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించారు. కానీ ఇప్పటికీ సంతృప్తి కలిగించే శాస్త్రీయ వివరణ ఎవరూ ఇవ్వలేకపోయారు. మన మెదడు దృశ్య సమాచారాన్ని విడమరచుకునే తీరులోనే దీని లోగుట్టు దాగుండొచ్చన్నది కొందరి భావన. దూరంగా, దగ్గరగా ఉన్న వస్తువుల సైజును మెదడు ఎలా గ్రహిస్తుంది? క్షితిజరేఖ వద్ద ఉన్న వస్తువులను ఎంత దూరంలో ఉన్నట్టు భావిస్తుంది? ఇలాంటి అంశాలన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. చందమామ ఆకాశంలో ఎక్కడ ఉన్నా దూరంలో ఎలాంటి మార్పు ఉండదనే విషయం బహుశా మన మెదడుకు తెలిసి ఉండకపోవచ్చు. చంద్రుడికి ముందుండే వస్తువులూ సైజును అంచనా వేయటంలో పొరపాటు పడేలా చేస్తుండొచ్చన్నది ఒక ఆలోచన. అంటే ఉదయిస్తున్నప్పుడు చుట్టుపక్కల చెట్లు, పర్వతాలు, భవనాలు ఇలాంటివన్నీ చంద్రుడు మనకు దగ్గరగా ఉన్నాడనే భావన కలిగించొచ్చు. దీంతో సైజు పెద్దగా కనిపించేలా చేస్తుండొచ్చు. రైలు పట్టాల వంటి రెండు సమాంతర రేఖలు దూరంగా క్షితిజ రేఖ వద్ద కలిసే సమయంలో వాటి మధ్య దూరం తగ్గినట్టు అనిపిస్తుంటుంది కదా. నిజానికి దూరం ఏమీ తగ్గదు. కానీ మన మెదడు  మాత్రం వాటి మధ్య దూరం తగ్గినట్టుగా, పోనుపోను అవి కలుస్తున్నాయనే అనుకుంటుంది. కావాలంటే ఈ రేఖల మీద ఒక గీతను గీసి చూడండి. దూరంగా గీసిన గీత, దగ్గరగా గీసిన గీత రెండూ ఒకే సైజులో ఉంటాయి. అయినా మెదడు గీత సైజు మారినట్టే భావిస్తుంది. దీన్నే పోంజో ఇల్యూజన్‌ అంటారు. మరికొందరు ఎబింగస్‌ ఇల్యూజన్‌ను కూడా ప్రస్తావిస్తుంటారు. ఒకేలా ఉండే రెండు వస్తువులు వేర్వేరు సైజుల్లో కనిపించటం ఇందులోని విచిత్రం. దీనికి కారణం చుట్టుపక్కల వస్తువుల సైజు ప్రభావం. ఒక వృత్తాన్ని గీసి దాని చుట్టుపక్కల పెద్ద వృత్తాలను గీసి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. అది చిన్నగా కనపిస్తుంది. చుట్టుపక్కల చిన్న వృత్తాలను గీస్తే అదే పెద్దగా కనిపిస్తుంది. అందుకేనేమో ఉదయిస్నున్నప్పుడు పర్వతాలు, చెట్లు భవనాల వంటివి చిన్నగా ఉండటం వల్ల చంద్రుడు పెద్దగా కనిపిస్తుండొచ్చన్నది ఒక భావన. ఆకాశం మధ్యలోకి వచ్చినప్పుడు సైజును పోల్చుకోవటానికి వస్తువులేవీ ఉండవు కాబట్టి చిన్నగా కనిపిస్తుండొచ్చు. అలాగని ఇవి పూర్తిగా నిజమని నమ్మటానికీ వీల్లేదు. ఎందుకంటే అంతరిక్షంలో వ్యోమగాములు, విమానాలు నడిపే పైలెట్లు, సముద్ర ప్రయాణికులకు సైతం చిత్రంగా చంద్రభ్రాంతికి లోనవుతుంటారు. చుట్టుపక్కల పోల్చుకోవటానికి చిన్న వస్తువులేవీ లేకపోయినా చంద్రుడు పెద్దగానే కనిపిస్తుంటాడు! నక్షత్రశాలలో వృత్తాకార డోమ్‌లోనూ అంచుల వద్ద చంద్రుడు పెద్దగానే ఉంటాడు. అదీ విచిత్రం!

కళ్లు కేంద్రీకృతం కావటంతోనేనా?

కాస్త సంతృప్తి కలిగించే విశ్లేషణ ఏదైనా ఉందంటే అది కన్వర్జెన్స్‌ మైక్రాప్సియా. సాధారణంగా దేనినైనా చూస్తున్నప్పుడు మన కళ్లు కేంద్రీకృతం కావటాన్ని బట్టి మెదడు ఆయా వస్తువుల దూరాన్ని, సైజును అంచనా వేసుకుంటుంది. క్షితిజం వైపు చూసినప్పుడు చూపు దూరంగా కేంద్రీకృతమవుతుంది. దీంతో చాలా దూరంలో ఉన్న వస్తువులను చూస్తున్నట్టు మెదడు భావిస్తుంది. అందుకేనేమో చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు చాలా దూరంలో ఉన్నట్టుగా మెదడు భావిస్తుంది. దీంతో చంద్రుడు పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆకాశం మధ్యలోకి వచ్చినప్పుడు కళ్లు అంతగా కేంద్రీకృతం కావాల్సిన అవసరమేమీ ఉండదు. అందువల్ల ఇప్పుడు చంద్రుడు తక్కువ దూరంలో ఉన్నాడని మెదడు భావిస్తుంది. ఇంతకుముందు ఊహించినట్టు చంద్రుడు అంత పెద్దగా ఏమీ లేడని తీర్మానించుకుంటుంది. దీంతో చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇది నిజమేనని నమ్మలేకపోతున్నారా? సందేహం తీరలేదా? మీకే కాదు.. శాస్త్రవేత్తలకే సంతృప్తి కలగలేదు. అందుకే చాలామంది కారణమేదైతేనేం? అందంగా, పెద్దగా కనిపించే చంద్రుడిని చూస్తూ సంతోషంతో గడిపేస్తే పోలా అని అనుకుంటూ ఉంటారు.


రంగు సైతం భిన్నంగానే

చందమామ పరిమాణమే కాదు, దిగువ ఆకాశంలో రంగూ భిన్నంగానే కనిపిస్తుంది. ఆకాశం మధ్యలో ఉన్నప్పటికన్నా ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు మరింత పసుపు లేదా నారింజ వర్ణంలో కనిపిస్తుంటాడు. దీనికి కారణం చందుడ్రి కాంతి వాతావరణం ద్వారా ఎక్కువదూరం ప్రయాణం చేయటం. ఇలా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు పొట్టి, నీలి కాంతి దైర్ఘ్యాలు చెల్లాచెదరవుతాయి. పొడవైన, ఎర్రటి కాంతిదైర్ఘ్యాలే మిగులుతాయి. దీంతో నారింజ వర్ణం కనిపిస్తుంది. దుమ్ము లేదా కాలుష్యమూ మరింత ఎర్రగా కనిపించేలా చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని