డిజిటల్‌ లోకంలో ఎన్‌ఎఫ్‌టీ విప్లవం!

ఎన్‌ఎఫ్‌టీలు. ఇంటర్నెట్‌ అంతా వీటితోనే మార్మోగుతోంది. వీటిని అమ్ముతూ ఎంతోమంది కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుత డిజిటల్‌ ఆర్ట్‌ యుగంలో ఇవి విశేష ప్రాచుర్యం పొందుతున్నాయి. మనదేశంలోనూ కొందరు ప్రముఖ సినిమా నటులు, సంగీత దర్శకులు తమ కళారూపాలను ఎన్‌ఎఫ్‌టీల రూపంలో విక్రయించటం ఆరంభించారు. ఇంతకీ ఎన్‌ఎఫ్‌టీలంటే ఏంటి? వీటి కథాకమామీషు ఏంటి?

Published : 27 Apr 2022 01:55 IST

ఎన్‌ఎఫ్‌టీలు. ఇంటర్నెట్‌ అంతా వీటితోనే మార్మోగుతోంది. వీటిని అమ్ముతూ ఎంతోమంది కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుత డిజిటల్‌ ఆర్ట్‌ యుగంలో ఇవి విశేష ప్రాచుర్యం పొందుతున్నాయి. మనదేశంలోనూ కొందరు ప్రముఖ సినిమా నటులు, సంగీత దర్శకులు తమ కళారూపాలను ఎన్‌ఎఫ్‌టీల రూపంలో విక్రయించటం ఆరంభించారు. ఇంతకీ ఎన్‌ఎఫ్‌టీలంటే ఏంటి? వీటి కథాకమామీషు ఏంటి?

టీవల బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీల వన్నె కాస్త మసకబారింది కానీ ఆర్థికంగా ఇవి పెద్ద విప్లవాన్నే తీసుకొచ్చాయి. మామూలు డబ్బులా ప్రభుత్వాలు, బ్యాంకుల నియంత్రణలో లేకపోవటం వల్ల వీటిపై కొన్ని దేశాలు ఆంక్షలు విధించే పనిలో పడటమూ చూస్తున్నదే. క్రిప్టోకరెన్సీకి ఆధారం బ్లాక్‌చెయిన్‌ పరిజ్ఞానం. ఇది డేటాబేస్‌లాంటి వర్చువల్‌ లెడ్జర్‌లో నిల్వ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లు దీన్ని నిర్వహిస్తుంటాయి. ఈ వ్యవస్థలన్నీ సంయుక్తంగా నోడ్స్‌ (బ్లాక్స్‌) ద్వారా ఇంటర్నెట్‌ మీద సమాచారాన్ని షేర్‌ చేసుకుంటాయి. ఒకసారి బ్లాక్‌చెయిన్‌లో నమోదైన సమాచారాన్ని.. అంటే విలువ, తేదీ, సమయం వంటి వాటిని మార్చటం అసాధ్యం. ఇదే క్రిప్టోకరెన్సీలకు ఎనలేని విశ్వసనీయతను తెచ్చిపెడుతోంది. ఎన్‌ఎఫ్‌టీల మీద ఆకర్షణ పెరగటానికీ కారణం ఇదే. ఎందుకంటే ఇవీ బ్లాక్‌చెయిన్‌ పరిజ్ఞానంతోనే ముడిపడి ఉంటాయి మరి. నాన్‌-ఫంజిబుల్‌ టోకెన్లనే ముద్దుగా ఎన్‌ఎఫ్‌టీలని పిలుచుకుంటున్నారు. చాలామంది వీటిని క్రిప్టోకరెన్సీలుగా భావిస్తుంటారు. కానీ చాలా తేడానే ఉంది. నాన్‌-ఫంజిబుల్‌ అంటే మార్చుకోవటానికి వీలుకానిదని. దానికదే ప్రత్యేకమైనది. మ్యూజియంలో చూసే మోనాలిసా చిత్రపటం కావొచ్చు. డిజిటల్‌ ప్రపంచంలో మనం సృష్టించే వీడియోలు, చేసే ట్వీట్‌, డిజిటల్‌ కళారూపాలు కావొచ్చు. అన్నీ వేటికవే ప్రత్యేకమైనవే కదా. నాన్‌-ఫంజిబుల్‌ అలాంటిదే. ఇక టోకెన్‌ అంటే డిజిటల్‌ రూపంలో ఉనికిలో ఉండటం. ఒక్కమాటలో చెప్పాలంటే- ఎన్‌ఎఫ్‌టీని డిజిటల్‌ ఆస్తి అనుకోవచ్చు. ఇది బ్లాక్‌చెయిన్‌ మీదే ఉనికిలో ఉంటుంది. దీనికి నకళ్లను సృష్టించలేం. ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌టీలుగా చాలావరకు చలామణి అవుతున్నవి జిఫ్‌లు, పాటలు, వీడియోలు, ట్వీట్ల వంటి డిజిటల్‌ కళారూపాలే. వాస్తవ ప్రపంచంలో మీరు ఏదైనా చిత్రం గీశారనుకోండి. ఏదో కవిత రాశారనుకోండి. వాటికి యజమానులు మీరే కదా. అలాగే డిజిటల్‌ ప్రపంచంలో ఎన్‌ఎఫ్‌టీలను సృష్టించినవారే యజమానులుగా బ్లాక్‌చెయిన్‌లో నమోదవుతారు. వీటిని ప్రత్యేక ఆన్‌లైన్‌ వేదికల్లో క్రిప్టోకరెన్సీలతోనే కొనగలం, అమ్మగలం. అయితే ఎన్‌ఎఫ్‌టీని కొంటున్నామంటే దాని పూర్తి యాజమాన్యాన్ని కొంటున్నట్టు కాదని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతానికి అది మన దగ్గరుంది, అది మన ఆస్తి కాబట్టి అప్పటికి మనమే యజమానులం. అంతేగానీ దాన్ని తిరిగి ఉత్పత్తి చేయలేం. ఉదాహరణకు- ఒక చిత్రాన్ని ఎన్‌ఎఫ్‌టీగా కొన్నామనుకోండి. దాన్ని టీ షర్ట్‌ మీద ముద్రించటం వంటి వాటికి వాడుకునే హక్కు ఉండదన్నమాట.


ఎన్‌ఎఫ్‌టీలు ఎలా పనిచేస్తాయి?

రకరకాల క్రిప్టోకరెన్సీలు ఉన్నప్పటికీ సాధారణంగా ఎథెర్‌ క్రిప్టోకరెన్సీతో ఎన్‌ఎఫ్‌టీ క్రయ, విక్రయాలు సాగుతుంటాయి. బయటి ప్రపంచంలో వీటికి మారకపు విలువేమీ ఉండదు. ఆన్‌లైన్‌లో క్రిప్టోకరెన్సీతో వీటిని అమ్మినవారి నుంచి కొన్నవారికి యాజమాన్య ధ్రువపత్రం మార్పిడి అవుతుంది. ఇది బ్లాక్‌చెయిన్‌ వేదికలో నమోదవుతుంది. ఇలా డిజిటల్‌ రూపంలో క్రయ విక్రయాలను ధ్రువీకరిస్తుంది. ఈ ధ్రువీకరణలను జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఎన్‌ఎఫ్‌టీలను వాడుకోవటానికివి అత్యవసరం. వీటిని సినిమాలు, ఫ్యాషన్‌ షోల వంటి వాటి టికెట్లు.. గేమ్స్‌ కొనుక్కోవటం వంటి చాలా అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.


ఎంతవరకు సురక్షితం?

ఎన్‌ఎఫ్‌టీలు చాలా భద్రంగా ఉంటాయి కాబట్టే వీటికి ఆదరణ పెరుగుతోంది. అయితే మనలాంటి దేశాల్లో క్రిప్టోకరెన్సీల మాదిరిగానే వీటికి చట్టబద్ధత లేకపోవటమే పెద్ద చిక్కు. మున్ముందు ఇది ఒకదారిన పడొచ్చు. చట్టబద్ధత లభించొచ్చు. నియంత్రణ విధానాలు రూపొందొచ్చు. మున్ముందు మెటావర్స్‌ వంటి కాల్పనిక ప్రపంచాలు ఇంకా విస్తృతమయ్యే అవకాశముంది. అప్పుడు వీటికి మరింత ఆదరణ పెరుగుతుంది. ఇప్పటికే ఎన్‌ఎఫ్‌టీలతో కాల్పనిక ప్రపంచంలో భూములు, భవనాలు కొనేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎన్‌ఎఫ్‌టీలు దీర్ఘకాలంలో మనుగడ సాగిస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు.


వివిధ రకాలు

ఎన్‌ఎఫ్‌టీలు విశేష ఆదరణ పొందుతుండటానికి ప్రధాన కారణం వినూత్నంగా, విభిన్నంగా ఎదగటానికి చాలా అవకాశం ఉండటం. ప్రస్తుతం రకరకాల ఎన్‌ఎఫ్‌టీలు అందుబాటులో ఉన్నాయి. చిత్రాలు, గేమ్స్‌, సెలబ్రిటీలు, కాల్పనిక ప్రపంచ ఆస్తులు, వేడుకల టికెట్లు, సంగీతం వంటి ఎన్‌ఎఫ్‌టీలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిని వాడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. ఇటీవల క్రిప్టోపంక్స్‌ రూపంలోనూ ఎన్‌ఎఫ్‌టీల వ్యాపారం సాగుతోంది.


విద్యారంగంలో పెనుమార్పులు!

ప్రస్తుతం కళాకారులే ఎక్కువగా ఎన్‌ఎఫ్‌టీల నుంచి లబ్ధిపొందుతున్నారు. కానీ ఇదిప్పుడు వివిధ రంగాలకూ విస్తరిస్తోంది. విద్యారంగంలోనూ ఎన్‌ఎఫ్‌టీలు గణనీయమైన మార్పులు తీసుకురాగలవని భావిస్తున్నారు. కాగితాల అవసరాన్ని పూర్తిగా తగ్గించే అవకాశం లేకపోలేదు. చదువుల్లో మన ప్రతిభను రుజువు చేసుకోవటానికి ధ్రువపత్రాలు కీలకం. ఎన్‌ఎఫ్‌టీలను మార్చటానికి వీలుండదు కాబట్టి ధ్రువపత్రాల స్థానాన్ని ఇవి భర్తీ చేయొచ్చని అనుకుంటున్నారు. ఇవన్నీ డిజిటల్‌ రూపంలో భద్రంగా ఉంటాయి. మార్పులకు వీలుండదు. మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. విద్యార్థుల రిపోర్టులు, ప్రాజెక్టుల వంటివీ డిజిటల్‌ మాధ్యమంలో భద్రంగా ఉంచుకోవచ్చు. వీటిని ఉపాధ్యాయులతో షేర్‌ చేసుకోవచ్చు. కావాలంటే ఇతర అవసరాల కోసం రిఫరెన్స్‌గా వాడుకోవచ్చు. పరీక్షలు, మార్కుల వంటి వివరాలను నమోదు చేయటంలో పనిభారం తగ్గిస్తుంది. వీటిని ఎన్‌ఎఫ్‌టీలుగా దాచుకుంటే బ్లాక్‌చెయిన్‌తో ఎన్‌క్రిప్ట్‌ కావటం వల్ల భద్రంగానూ ఉంటాయి. విద్యార్థులు, యువ కళాకారులు, కంటెంట్‌ డెవలపర్లు తమ నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటుకోవటానికీ ఎన్‌ఎఫ్‌టీలు ఉపయోగపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని