మెదళ్లకే కళ్లు!

కళ్లతో అందే సమాచారాన్ని మెదడు విశ్లేషిస్తుంది. తర్వాత ఆయా దృశ్యాలు కనిపిస్తాయి. మరి మెదడుకే కళ్లు వస్తే? జర్మనీ శాస్త్రవేత్తలు ఇలాంటి అసాధ్యాన్నే సుసాధ్యం చేశారు. గత పదేళ్లుగా ప్రయోగశాలలో చిన్న మెదళ్లను అభివృద్ధి చేసే ప్రక్రియ బాగా పుంజుకుంటోంది. మూలకణాలతో

Updated : 11 May 2022 10:36 IST

ళ్లతో అందే సమాచారాన్ని మెదడు విశ్లేషిస్తుంది. తర్వాత ఆయా దృశ్యాలు కనిపిస్తాయి. మరి మెదడుకే కళ్లు వస్తే? జర్మనీ శాస్త్రవేత్తలు ఇలాంటి అసాధ్యాన్నే సుసాధ్యం చేశారు. గత పదేళ్లుగా ప్రయోగశాలలో చిన్న మెదళ్లను అభివృద్ధి చేసే ప్రక్రియ బాగా పుంజుకుంటోంది. మూలకణాలతో రూపొందించే వీటిని ‘ఆర్గనాయిడ్స్‌’ అనీ పిలుచుకుంటారు. గ్రోత్‌ ఫ్యాక్టర్స్‌ సాయంతో ఇవి వివిధ నాడీ కణాలుగా అభివృద్ధి చెందుతాయి. అంటే ఇవి సూక్ష్మ మెదళ్లలా పనిచేస్తాయన్నమాట. వీటికి తొలిసారిగా ఇతర అవయవాలు పుట్టుకొచ్చేలా చేయటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. విటమిన్‌ ఎ లాంటి పదార్థాలను అందజేయటం ద్వారా కళ్లు వచ్చేలా చేశారు. ఈ మెదళ్లకు తొలిదశలో మన కంటి రెటీనాలో ఉండే కణాలు వృద్ధి చెందాయి. అనంతరం మెదడు కణాలతో నాడీ అనుసంధానాలు ఏర్పరచుకోవటం, కాంతికి  ప్రతిస్పందిస్తుండటం శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించింది. ఇవి గర్భస్థ శిశువులో ముందు, వెనక భాగాలను నిర్ణయించుకునే మెదడు మాదిరిగానే వ్యవస్థీకృతం కావటం విశేషం. దాతల నుంచి సేకరించిన మూలకణాలతో మొత్తం 314 సూక్ష్మ మెదళ్లను పరిశోధకులు రూపొందించారు. వీటిల్లో 72% మెదళ్లకు కళ్లు పుట్టుకొచ్చాయి. పిండస్థ దశలో మెదడు కణాలు, కొత్తగా ఏర్పడిన జ్ఞానేంద్రియాలు ఎలా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయో తెలుసుకోవటానికివి వీలు కల్పించనున్నాయి. కంటి జబ్బులకు వాడే మందుల పనితీరును పరీక్షించటానికీ ఇవి ఉపయోగడతాయి. కంటి జబ్బులతో బాధపడేవారి మూలకణాలతో మున్ముందు కంటి కణజాలాన్ని అభివృద్ధి చేసి, మార్పిడి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని