డ్రోనేంద్రజాలం!

గాల్లోంచి పిజ్జా వచ్చి గుమ్మం ముందు వాలింది. పప్పులు, ఉప్పులు.. చివరికి మందులూ ఆకాశ మార్గాన్నే ఇంట్లోకి దిగాయి! రక్తం, అవయవాలు అంబులెన్స్‌ లేకుండానే ఆసుపత్రులకు చేరుకున్నాయి. మారుమూల ప్రాంతాలకు టీకాల సరఫరా, ఉత్తరాల బట్వాడా కూడా గాల్లోంచే. పంటలకు పురుగు మందుల పిచికారీ సైతం పైనుంచే!! ఒకప్పుడైతే ఇవి ఊహలే. అధునాతన డ్రోన్లతో అవే ఇప్పుడు నిజమవుతున్నాయి.

Updated : 01 Jun 2022 09:12 IST

గాల్లోంచి పిజ్జా వచ్చి గుమ్మం ముందు వాలింది. పప్పులు, ఉప్పులు.. చివరికి మందులూ ఆకాశ మార్గాన్నే ఇంట్లోకి దిగాయి! రక్తం, అవయవాలు అంబులెన్స్‌ లేకుండానే ఆసుపత్రులకు చేరుకున్నాయి. మారుమూల ప్రాంతాలకు టీకాల సరఫరా, ఉత్తరాల బట్వాడా కూడా గాల్లోంచే. పంటలకు పురుగు మందుల పిచికారీ సైతం పైనుంచే!! ఒకప్పుడైతే ఇవి ఊహలే. అధునాతన డ్రోన్లతో అవే ఇప్పుడు నిజమవుతున్నాయి. మానవ రహిత విమానాల (యూఏవీ) కోవకు చెందిన బుల్లి డ్రోన్లు ప్రస్తుతం నిత్య జీవన సాధనాలుగానూ మారిపోతున్నాయి. ప్రభుత్వం వీటి వాడకాన్ని మరింత ప్రోత్సహించటానికి ఇటీవల భారత్‌ డ్రోన్‌ మహోత్సవ్‌నూ నిర్వహించింది. ఈ నేపథ్యంలో డ్రోన్ల కథా కమామీషేంటో చూద్దాం.

హెలికాప్టర్‌లా ఎక్కడంటే అక్కడ నిట్టనిలువుగా కిందికి దిగుతాయి. పైకి లేస్తాయి. అలాగని అంత పెద్దవేమీ కావు. వీలైనంత సైజులో రూపొందించుకోవచ్చు. చిన్న వస్తువులను లేపటం దగ్గర్నుంచి, ఒకరిద్దరు మనుషులను మోసుకెళ్లే విధంగానూ తీర్చిదిద్దుకోవచ్చు. నడపటానికి మనుషుల అవసరమూ లేదు. చేతిలో జాయ్‌స్టిక్‌ వంటి పరికరం ఉంటే చాలు. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌లతో దూరం నుంచే పనిచేయించొచ్చు. ఇలాంటి సౌకర్యాలే డ్రోన్ల మీద రోజురోజుకీ ఆకర్షణ పెరిగేలా చేస్తున్నాయి. ఇప్పుడు మనదేశంలో వీటి వాడకం బాగా పుంజుకుంటోంది. సృజనాత్మక అవసరాల కోసం డ్రోన్లను చాలాకాలంగా ఉపయోగించుకుంటున్నారు. వీటికి మూవీ కెమెరాను జతచేసి, గాల్లోంచి ఫొటోలు, వీడియోలు తీయటం తేలికైపోయింది. సినిమా షూటింగుల్లోనూ గాల్లోంచి దృశ్యాలను చిత్రీకరించటానికి హెలికాప్టర్లకు బదులు డ్రోన్లనే వాడుకుంటున్నారు. వివాహాలు, వేడుకల్లో క్రేన్లకు బదులు వీటితోనే ఫొటోలు, వీడియోలు తీయటం సాధారణ విషయంగా మారిపోయింది. సరిహద్దుల్లో శత్రువుల మీద బాంబులు వేయటానికీ సైన్యానికి డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడివి వైద్యం, సరకుల రవాణా, వ్యవసాయ రంగాలకూ శరవేగంగా విస్తరిస్తున్నాయి. 

* మనదేశంలో తొలిసారి వాణిజ్యపరంగా డ్రోన్‌ను 2014లో ముంబయిలో వాడుకున్నారు. కిలో కన్నా తక్కువ బరువుండే ఇది 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపార్టుమెంటులో 21వ అంతస్తుకు పిజ్జాను చేరవేసింది.

* కొవిడ్‌-19 విజృంభణ సమయంలో తెలంగాణలో డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు టీకాలను సరఫరా చేశారు. అపోలో ఆసుపత్రి, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లతో కలిసి ప్రభుత్వం మందులనూ సరఫరా చేయనుంది.

* చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్‌ సంస్థ రూపొందించిన వైట్‌ నైట్‌ డ్రోన్లు సైతం మందులు, టీకాలను సరఫరా చేశాయి. 

* కొవిడ్‌ నిబంధనలను పాటించేలా చూడటానికి ముంబయి, వారణాసిల్లో ఆకాశవాణి డ్రోన్‌తో ప్రకటనలు జారీచేశారు. 

* రోడ్ల పర్యవేక్షణ, కీటకాల నివారణ మందులు చల్లడం, అత్యవసర వస్తువులను మోసుకెళ్లటం వంటి పనులకూ కేరళలో డ్రోన్ల సేవలు తీసుకుంటున్నారు. కొవిడ్‌ సమయంలో స్రావాల నమూనాలను పరీక్ష కేంద్రాలకు పంపటానికి, ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాల సాయంతో జ్వరం వచ్చిన వారిని గుర్తించటానికీ ఇవి ఉపయోగపడ్డాయి.

* ఇటీవల గుజరాత్‌లో డ్రోన్లతో ఉత్తరాల బట్వాడా చేశారు.  - డ్రోన్ల సేవలకు సంబంధించి ఇవి కొన్ని మచ్చు తునకలు. 

ఎలా పనిచేస్తాయి?

డ్రోన్ల నిర్మాణంలో ఫ్యాన్‌ రెక్కల వంటి స్పిన్నింగ్‌ రోటార్లే కీలకం.  ఇవి గాలిని కిందికి నెడుతున్నకొద్దీ రోటార్‌ పైకి లేస్తుంది. దీని మూలంగానే డ్రోన్‌ గాలిలో తేలియాడుతుంది. ఎంత వేగంగా రోటార్లు తిరిగితే డ్రోన్‌ అంత పైకి లేస్తుంది. వేగం తగ్గితే కిందికి వస్తుంది. భూమి గురుత్వాకర్షణ శక్తికి సమానంగా రోటార్లు థ్రస్ట్‌ను ఉత్పత్తి చేసినప్పుడు డ్రోన్‌ గాలిలో తేలుతూ ఉంటుంది. మరి పైకెలా వెళ్తుంది? రోటార్లు వేగం పెరగటం వల్లనే. అప్పుడు పైకి నెట్టే బలం డ్రోన్‌ బరువు కన్నా ఎక్కువవుతుంది. దీంతో పైకి లేస్తుంది. ఇక రోటార్ల వేగం తగ్గినప్పుడు నికర బలమూ తగ్గి కిందికి దిగి వస్తుంది. సాధారణంగా డ్రోన్‌కు 4 రోటార్లుంటాయి. వీటిల్లో రెండు సవ్య దిశలో తిరిగితే, మరో రెండు అపసవ్య దిశలో తిరుగుతాయి. దీని మూలంగానే డ్రోన్‌ పక్కలకు కదులుతున్నప్పుడు స్థిరంగా ఉంటుంది. పైకి లేస్తున్నప్పుడు నియంత్రణ తప్పకుండా ఉండటానికి రెండు రోటార్లు మరింత వేగంగా తిరుగుతుంటాయి. ముందుకు, వెనకకు కదలటానికీ ఇదే సూత్రం వర్తిస్తుంది.

ప్రమాదాలు లేకపోలేదు

డ్రోన్లను ఉగ్రవాదులు బాంబులు, మాదక ద్రవ్యాలు  జారవేయటానికి.. నిఘా కోసమూ వాడుకుంటున్న ఉదంతాలు లేకపోలేదు. దీంతో సైన్యం వీటిని ఎదుర్కోవటానికి, నిలువరించటానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డీఆర్‌డీవో ఇప్పటికే రుస్తుం శ్రేణి సైనిక డ్రోన్ల వ్యవస్థను రూపొందించింది. యూఏవీల దాడులను నిర్వీర్యం చేయటానికి యాంటీ-డ్రోన్‌ పరిజ్ఞానాన్ని సైతం తయారుచేసింది. ఇందులో ప్రైవేటు రంగమూ అడుగులు కలుపుతోంది. మనదేశంలో అతిపెద్ద మానవ రహిత విమానాల (యూఏవీ) తయారీ సంస్థ ఐడియాఫోర్జ్‌.. అలాగే ఎల్‌ అండ్‌ టీ సంస్థలు రక్షణ అవసరాల కోసం డ్రోన్లను, డ్రోన్ల సంబంధ వ్యవస్థలను రూపొందించటానికి నడుం బిగించాయి. ఐడియాఫోర్జ్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘స్విచ్‌ యూఏవీ’ ఎత్తయిన ప్రాంతాల్లో, కఠినమైన వాతావరణ పరిస్థితులనూ తట్టుకుంటుంది. రాత్రి పగలు నిర్విరామంగా కాపలా కాయగలదు. మన సైన్యం ‘డ్రోన్‌ స్వార్మ్‌ అటాక్‌’ వంటి కొత్త పరిజ్ఞానాలనూ రూపొందిస్తోంది. ఒకో గుంపులో 75 క్వాడ్‌కాప్టర్లు (నాలుగు ప్రొపెల్లర్‌ డ్రోన్లు) ఉంటాయి. ఇవన్నీ కలిసికట్టుగా దాడికి దిగుతాయి.

ఇదీ ప్రస్థానం

వ్యవసాయానికి సరికొత్త ఆశ

మనదేశంలో మామూలు అవసరాల విషయంలో డ్రోన్లను విరివిగా వాడుతున్నది వ్యవసాయంలోనే. వీటితో పొలాలకు ఎరువులు, పురుగు మందులు చల్లటం తేలిక. ఖర్చూ తగ్గుతుంది. మనదేశంలో వ్యవసాయ యూనివర్సిటీలు డ్రోన్‌ అంకుర సంస్థలతోనూ జట్టు కడుతున్నాయి. ధార్వాడ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ (యూఏఎస్‌), హుబ్బళిలోని కేఎల్‌ఈ టెక్నోలాజికల్‌ యూనివర్సిటీ (కేఎల్‌ఈటీయూ) సాయంతో స్కైక్రాఫ్ట్స్‌ ఏరోస్పేస్‌ సంస్థ పురుగుమందులు, ఎరువులు చల్లటానికి ప్రత్యేకంగా డ్రోన్లను తయారుచేసింది. ఇవి గరిష్ఠంగా 20 లీటర్ల మందును మోసుకెళ్లగలవు. గంటకు ఎకరా చొప్పున రోజుకు సుమారు 10 ఎకరాల వరకు మందులను చల్లగలవు. యూఏఎస్, కేఎల్‌ఈటీయూ మరింత చిన్న, చవకైన డ్రోన్‌ను సృష్టించటంలోనూ పాలు పంచుకున్నాయి. దీని పేరు కిసాన్‌ డ్రోన్‌. బరువు 2 కిలోలు. 15 నిమిషాల వరకు గాల్లో ఎగరగలదు. కిలో మీటరు దూరం చుట్టిరాగలదు. ప్రపంచలోనే అతి చిన్న స్ప్రేయింగ్‌ డ్రోన్‌గా పేరొందిన ఇది గంటలో ఎకరం పొలానికి మందులు చల్లగలదు. దీనికి సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుంది. డ్రోన్ల రద్దీని నియంత్రించటానికి స్కైక్రాఫ్ట్‌ సంస్థ ‘స్కైవేర్‌’ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌నూ రూపొందించింది. ఇది స్మార్ట్‌కాంటాక్ట్‌లతో పనిచేసే డ్రోన్ల వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తుంది. వీటిని బ్లాక్‌చెయిన్‌ పరిజ్ఞానం మీద నమోదు చేస్తుంది కూడా. దీని ద్వారా డ్రోన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏమేం పనులు చేస్తున్నాయి? అనేవి పసిగట్టటానికి వీలవుతుంది. 

మనదేశంలో ఎవరు ఎగరేయొచ్చు?

రోజురోజుకీ డ్రోన్ల వాడకం పెరగుతుండటంతో ప్రభుత్వం వీటి నియంత్రణకు, దుర్వినియోగం కాకుండా ఉండటానికి కొన్ని నిబంధనలు రూపొందించింది. దేశ భద్రతకు భంగం కలగనంతవరకు ప్రైవేటు సంస్థలు వీటి తయారీని చేపట్టేలా ప్రోత్సహించింది. నిబంధనలనూ సరళీకరించింది. వీటి ప్రకారం నానో డ్రోన్లను వినోదాత్మక అవసరాల కోసం ఎవరైనా వాడుకోవచ్చు. వీటిని 400 అడుగుల లోపు ఎత్తులో, కంటి చూపు పరిధిని మించనంత దూరం ఎగరేసుకోవచ్చు. ఆట వస్తువుల దుకాణాల్లో దొరికే డ్రోన్లన్నీ వీటి కిందికే వస్తాయి. మామూలు అవసరాల కోసం మైక్రో డ్రోన్లనూ లైసెన్స్‌ లేకుండా వాడుకోవచ్చు. పర్యాటక ప్రదేశాల్లో గాల్లోంచి ఫొటోలు తీసేవి ఇలాంటి డ్రోన్లే. పెద్ద డ్రోన్ల విషయంలో ఆన్‌-బోర్డ్‌ నావిగేషన్‌ వ్యవస్థ, జియోఫెన్సింగ్‌ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అలాగే డ్రోన్‌ సర్టిఫికెట్, పైలెట్‌ లైసెన్స్‌ కూడా పొందాలి. 

ఐదు రకాలు

సైజులను బట్టి డ్రోన్లను ఐదు రకాలుగా వర్గీకరించొచ్చు.

నానో: 250 గ్రాములు, అంతకన్నా తక్కువ బరువున్నవి.

మైక్రో: 250 గ్రాముల నుంచి 2 కిలోల బరువు వరకు

చిన్న: 2 కిలోల నుంచి 25 కిలోల బరువు

మధ్యరకం: 25 కిలోల నుంచి 150 కిలోలు

పెద్దవి: 150 కిలోల కన్నా ఎక్కువ బరువు గలవి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని