ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ ఇష్టమైనట్టుగా..

పీసీలో డాక్యుమెంట్లు, ఫొటోలు, ఫైళ్లను విడమరచుకొని, ఒక క్రమంలో పెట్టుకోవటానికి విండోస్‌లో ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ను వాడుకుంటూనే ఉంటాం. విండోస్‌ 10, 11లో ఇది మరింత కొత్తగానూ మారిపోయింది. దీనిలోని అన్ని ఫీచర్లు చాలామందికి తెలియదనే అనుకోవాలి. వీటి గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. వీటిల్లో ఒకటి క్విక్‌ యాక్సెస్‌ విభాగాన్ని కావాల్సినట్టుగా మార్చుకోవటం.

Updated : 01 Jun 2022 03:03 IST

పీసీలో డాక్యుమెంట్లు, ఫొటోలు, ఫైళ్లను విడమరచుకొని, ఒక క్రమంలో పెట్టుకోవటానికి విండోస్‌లో ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ను వాడుకుంటూనే ఉంటాం. విండోస్‌ 10, 11లో ఇది మరింత కొత్తగానూ మారిపోయింది. దీనిలోని అన్ని ఫీచర్లు చాలామందికి తెలియదనే అనుకోవాలి. వీటి గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. వీటిల్లో ఒకటి క్విక్‌ యాక్సెస్‌ విభాగాన్ని కావాల్సినట్టుగా మార్చుకోవటం.

విండోస్‌ 10లో ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ వాడేవారికి ‘క్విక్‌ యాక్సెస్‌’ కొత్తేమీ కాదు. తరచూ వాడే ఫోల్డర్లు, ఫైళ్లు ఇందులో కనిపిస్తాయి. ఇవేకాకుండా ఇందులో ఇతర ఫోల్డర్లు కూడా ఉంటే బాగుంటుందనీ కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. దీనికి తేలికైన మార్గం లేకపోలేదు. క్విక్‌ యాక్సెస్‌కు జత చేయాలనుకునే ఫోల్డర్‌ మీద రైట్‌ క్లిక్‌ చేసి పాపప్‌ మెనూలో ‘పిన్‌ టు క్విక్‌ యాక్సెస్‌’ను ఎంచుకుంటే చాలు. లేదూ ఫోల్టర్‌ను క్విక్‌ యాక్సెస్‌లోకి డ్రాగ్‌ చేసినా సరే. లోకల్‌ ఫోల్డర్లనే కాదు.. నెట్‌వర్క్‌ డ్రైవ్‌ నుంచీ ఫోల్డర్లను దీనిలో చేర్చుకోవచ్చు. వన్‌డ్రైవ్, డ్రాప్‌బాక్స్‌ వంటి క్లౌడ్‌ సర్వీసుల ఫోల్డర్లనూ జత చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఫోల్డర్‌ను తొలగించుకోవాలని అనుకున్నారనుకోండి. క్విక్‌ యాక్సెస్‌లోని ఫోల్డర్‌ మీద రైట్‌ క్లిక్‌ చేసి ‘అన్‌పిన్‌ ఫ్రమ్‌ క్విక్‌ యాక్సెస్‌’ను ఎంచుకోవాలి. 

* క్విక్‌ యాక్సెస్‌లో ఫోల్డర్ల అమరికనూ మార్చుకోవచ్చు. ఫోల్డర్లను పైకీ లేదా కిందికి డ్రాగ్‌ చేస్తూ ఇష్టమైనట్టుగానే అమర్చుకోవచ్చు.

* విండోస్‌ టాస్క్‌బార్‌లోనూ క్విక్‌ యాక్సెస్‌ పాలు పంచుకుంటుంది. టాస్క్‌బార్‌ మీద ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ గుర్తుపై రైట్‌ క్లిక్‌ చేసి చూడండి. క్విక్‌ యాక్సెస్‌ కోసం పిన్‌ చేసిన ఫోల్డర్లు మెనూలో కనిపిస్తాయి. 

* తరచూ వాడిన ఫోల్డర్లు, ఫైళ్లు వాటంతటవే క్విక్‌ యాక్సెస్‌లో యాడ్‌ కాకుండానూ చూసుకోవచ్చు. విండోస్‌ 10 ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌లో పైన కనిపించే వ్యూ బటన్‌ను నొక్కాలి. ఇందులో ఆప్షన్‌ గుర్తును క్లిక్‌ చేస్తే ప్రైవసీ విభాగంలో జనరల్‌ ట్యాబ్‌ కనిపిస్తుంది. ఇందులో ‘షో ఫ్రీక్వెంట్లీ యూజ్డ్‌ ఫైల్స్‌ ఇన్‌ క్విక్‌ యాక్సెస్‌’.. ‘షో ఫ్రీక్వెంట్లీ యూజ్డ్‌ ఫోల్డర్స్‌ ఇన్‌ క్విక్‌ యాక్సెస్‌’ బాక్స్‌లను ఆఫ్‌ చేసి, ఓకే బటన్‌ను నొక్కాలి. విండోస్‌ 11 ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌లోనైతే పైన కనిపించే సీ మోర్‌ గుర్తు మీద క్లిక్‌ చేసి, మెనూలోంచి ఆప్షన్స్‌ను ఎంచుకోవాలి. ప్రైవసీ విభాగం ద్వారా జనరల్‌ ట్యాబ్‌లోకి వెళ్లాలి. ‘షో ఫ్రీక్వెంట్లీ యూజ్డ్‌ ఫైల్స్‌ ఇన్‌ క్విక్‌ యాక్సెస్‌’.. ‘షో ఫ్రీక్వెంట్లీ యూజ్డ్‌ ఫోల్డర్స్‌ ఇన్‌ క్విక్‌ యాక్సెస్‌’ బాక్స్‌లను ఆఫ్‌ చేసి, ఓకే బటన్‌ను నొక్కాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని