పండ్లపై పురుగు మందులు గుర్తించే నానో సెన్సర్‌

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి వీటిపై పురుగుమందుల అవశేషాలుంటే? మన కంటికి కనిపించకుండా హాని చేసే అవకాశముంటే? అందుకే స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు ఓ సూక్ష్మ గ్రాహకాన్ని

Published : 15 Jun 2022 00:21 IST


పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి వీటిపై పురుగుమందుల అవశేషాలుంటే? మన కంటికి కనిపించకుండా హాని చేసే అవకాశముంటే? అందుకే స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు ఓ సూక్ష్మ గ్రాహకాన్ని రూపొందించారు. రసాయనాల సంకేతాలను ద్విగుణీకృతం చేసి నిమిషాల్లోనే పురుగుమందుల అవశేషాలను గుర్తించటం దీని ప్రత్యేకత. ఈ సూక్ష్మ గ్రాహకానికి వెండి నానోపార్టికల్స్‌ పూత పూయటం ద్వారా దీన్ని సాధించారు. మనం తినే పండ్లు, కూరగాయల మీద పెద్దమొత్తంలో పురుగుమందుల అవశేషాలు ఉంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే. ఇవి రకరకాల జబ్బులను తెచ్చిపెట్టే ప్రమాదముంది. ఇలాంటి పురుగుమందుల ఆనవాళ్లను గుర్తించటానికి ప్రస్తుతం కొన్ని పద్ధతులు అందుబాటులో లేకపోలేదు. కాకపోతే వీటికి చాలా ఖర్చవుతుంది. ఇవి పనిచేయటానికి అవసరమైన గ్రాహకాలు తయారుచేయటం కష్టమైన పని. ఇలాంటి ఇబ్బందులను తగ్గించటానికే పరిశోధకులు ఈ వినూత్న నానో సెన్సర్‌ను పరిశోధకులు రూపొందించారు. దీన్ని తేలికగా తయారుచేయొచ్చు. ఖర్చూ అంత ఎక్కువ కాదు. దుకాణాల వంటి చోట్ల అక్కడికక్కడే పురుగుమందుల అవశేషాలను గుర్తించటానికి దీన్ని వాడుకోవచ్చు. దీని తయారీలో 1970ల్లో కనుగొన్న ఎస్‌ఈఆర్‌ఎస్‌ (సర్ఫేస్‌-ఎన్‌హ్యాన్స్‌డ్‌ రామన్‌ స్కాటరింగ్‌) పద్ధతిని వాడుకున్నారు. ఇది జీవాణువుల సంకేతాలను 10 లక్షల రెట్లు ఎక్కువగా పసిగట్టటం విశేషం. దీన్ని ఇప్పటికే పలు పరిశోధనల రంగాల్లో వాడుకుంటున్నారు. ఖర్చు ఎక్కువ కావటం వల్ల విస్తృతంగా అందుబాటులోకి రాలేకపోయింది. కొత్త గ్రాహకం రూపకల్పనతో ఎక్కువమంది వాడుకోవటానికి మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని